సన్‌రైజర్స్‌ ఐదో‘సారీ’ | Kolkata Knight Riders Beat Sunrisers Hyderabad By 17 Runs | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ ఐదో‘సారీ’

Published Sun, Apr 16 2017 2:22 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

సన్‌రైజర్స్‌ ఐదో‘సారీ’

సన్‌రైజర్స్‌ ఐదో‘సారీ’

♦  ఈడెన్‌లో వరుసగా ఐదోసారి ఓడిన హైదరాబాద్‌
17 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం ఉతప్ప మెరుపులు


డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం మరోసారి అచ్చి రాలేదు. ఈ వేదికపై గతంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన హైదరాబాద్‌ తలరాత ఐదో మ్యాచ్‌లోనూ మారలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విధించిన 173 పరుగుల లక్ష్యం హైదరాబాద్‌కు అసాధ్యమైన సవాలేమీ కాదు. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్, శిఖర్‌ ధావన్, హెన్రిక్స్, యువరాజ్‌ సింగ్‌లలో ఒక్కరు భారీ ఇన్నింగ్స్‌ ఆడినా ఫలితం అనుకూలంగా వచ్చేది. కానీ హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరూ క్రీజులో ఎక్కువసేపు నిలువలేకపోయారు. ఫలితంగా ఐపీఎల్‌–10లో హైదరాబాద్‌ జట్టు ఖాతాలో వరుసగా రెండో ఓటమి చేరింది. మరోవైపు అన్ని విభాగాల్లో రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మూడో విజయంతో పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరింది.  

కోల్‌కతా: సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు దుమ్మురేపింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 17 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు సాధించింది.

 ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాబిన్‌ ఉతప్ప (39 బంతుల్లో 68; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులకు తోడు మనీశ్‌ పాండే (35 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ (3/20) చెలరేగాడు. అనంతరం హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసి ఓడిపోయింది. వార్నర్‌ (30 బంతుల్లో 26; 4 ఫోర్లు), యువరాజ్‌ (16 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు.   

ఉతప్ప ఉతికేశాడు...
పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మెరుపు ఆరంభా న్నిచ్చిన సునీల్‌ నరైన్‌ (6) ఈసారి తొందరగానే వెనుదిరిగాడు. భువనేశ్వర్‌ అద్భుతమైన యార్కర్‌కు నరైన్‌ పెవి లియన్‌ చేరాడు. ఈ సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న గంభీర్‌ (16 బంతుల్లో 15; 2 ఫోర్లు) కూడా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. ఈ దశలో కర్ణాటక సహచరులు మనీశ్‌ పాండే, రాబిన్‌ ఉతప్పల భాగస్వామ్యం జట్టును ఆదుకుంది. వీరిద్దరూ ధాటిగా ఆడి 52 బంతుల్లో 77 పరుగులు జోడించారు. చివర్లో యూసుఫ్‌ పఠాన్‌ (15బంతుల్లో 21 నాటౌట్‌; 1 ఫోర్, 1సిక్స్‌) మెరవడంతో కోల్‌కతా మంచి స్కోరు సాధించింది.

మిడిలార్డర్‌ వైఫల్యం...
ఛేజింగ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. వార్నర్‌తో తొలి వికెట్‌కు 46 పరుగుల్ని జోడించాక పఠాన్‌ బౌలింగ్‌లో  ధావన్‌ (22 బంతుల్లో 23; 4 ఫోర్లు)  అవుటయ్యాడు. మరికాసేపటికే వార్నర్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. వచ్చీ రాగానే రెండు బౌండరీలను బాదిన హెన్రిక్స్‌ (13) బౌలర్‌కే  రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత దీపక్‌ హుడా (7 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్సర్‌), యువరాజ్‌ సింగ్‌ ధాటిగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యారు. చివరి 30 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన దశలోనూ ఆటగాళ్లు పుంజుకోలేకపోయారు.

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: నరైన్‌ (బి) భువనేశ్వర్‌ 6; గంభీర్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 15; ఉతప్ప (సి) రషీద్‌ (బి) కటింగ్‌ 68; మనీశ్‌ పాండే (సి) వార్నర్‌ (బి) భువనేశ్వర్‌ 46; యూసుఫ్‌ పఠాన్‌ నాటౌట్‌ 21; సూర్య కుమార్‌ యాదవ్‌ (సి) ఓజా (బి) నెహ్రా 4; గ్రాండ్‌హోమ్‌ (బి) భువనేశ్వర్‌ 0; వోక్స్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 172.

వికెట్ల పతనం: 1–10, 2–40, 3–117, 4–153, 5–163, 6–170. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–20–3, నెహ్రా 4–0–35–1, కటింగ్‌ 4–0–41–1, రషీద్‌ఖాన్‌ 4–0–29–1, హెన్రిక్స్‌ 2–0–26–0, బిపుల్‌ శర్మ 2–0–20–0.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) వోక్స్‌ (బి) కుల్దీప్‌ యాదవ్‌ 26; ధావన్‌ (సి) గ్రాండ్‌హోమ్‌ (బి) పఠాన్‌ 23; హెన్రిక్స్‌ (సి అండ్‌ బి) వోక్స్‌ 13; యువరాజ్‌ సింగ్‌ (సి) సబ్‌–రిషి ధావన్‌ (బి) వోక్స్‌ 26; హుడా (స్టంప్డ్‌) ఉతప్ప (బి) నరైన్‌ 13; కటింగ్‌ (సి) గ్రాండ్‌హోమ్‌ (బి) బౌల్ట్‌ 15; ఓజా నాటౌట్‌ 11; బిపుల్‌ శర్మ 21 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155.

వికెట్ల పతనం: 1–46, 2–59, 3–65, 4–96, 5–112, 6–129. బౌలింగ్‌: ఉమేశ్‌ 3–0–27–0, బౌల్ట్‌ 4–0–33–1, నరైన్‌ 4–0–18–1, కుల్దీప్‌ 4–0–23–1, పఠాన్‌ 1–0–2–1, వోక్స్‌ 4–0–49–2.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement