ఢిల్లీని చిత్తుచేసిన కోల్ కతా
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు సార్లు ఛాంపియన్ అయిన కోల్కతా నైట్రైడర్స్ తమ తొలి మ్యాచ్ లో శుభారంభం చేసింది. ఐపీఎల్ 9లో భాగంగా ఢిల్లీ డేర్డెవిల్స్ తో ఇక్కడ జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్రైడర్స్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 99 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో ఛేదించింది. లక్ష్య ఛేదనకు దిగిన నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గౌతమ్ గంభీర్ (41 బంతుల్లో 38 నాటౌట్; 5 ఫోర్లు) నాటౌట్, మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 35; 7 ఫోర్లు) శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 69 పరుగులు జోడించిన తర్వాత ఉతప్ప ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(15)తో కలిసి మిగిలిన లాంఛనాన్ని పూర్తిచేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్ అమిత్ మిశ్రాకు ఒక వికెట్ దక్కింది.
ఢిల్లీ తడబాటు:
అంతకుముందు టాస్ గెలిచిన కోల్ కతా తొలుత ఢిల్లీని బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్ కతాకు 99 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఆది నుంచి తడబడింది. జట్టులో ఏ ఒక్క ఆటగాడు కనీసం పోరాట పటిమను ప్రదర్శించలేదు. డీ కాక్(17), మయాంక్ అగర్వాల్(9), సంజూ శ్యాంసన్(15), నేగీ(11), బ్రాత్ వైట్(6), క్రిస్ మోరిస్(11),అమిత్ మిశ్రా(3) , జహీర్ ఖాన్(4) ఇలా వరుసగా క్యూట్టడంతో ఢిల్లీ 17.4 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటయ్యింది. కోల్కతా బౌలర్లలో రస్సెల్, బ్రాడ్ హాగ్లు తలో మూడు వికెట్లు సాధించగా, పీయూష్ చావ్లా, హేస్టింగ్లకు చెరో రెండు వికెట్లు దక్కాయి.