పూనియా కూడా సిఫారసు చేయమంది!
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్త్న్ర అవార్డు వివాదం మరో మలుపు తిరిగింది. అంజలీ భగవత్ ఆఖరి నిమిషంలో చేసిన మార్పులతోనే రంజన్ సోధి పేరు ఖరారైందని విమర్శలు రావడంతో ఇప్పుడు ఈ మాజీ షూటర్ నోరు విప్పింది. అవార్డు రాలేదంటూ తనపై విరుచుకు పడుతున్న కృష్ణ పూనియానే దోషి అని ఆమె తేల్చింది. ‘ఖేల్త్న్ర ఎంపిక కోసం కమిటీ సమావేశానికి ఒక రోజు ముందు స్వయంగా పూనియా నాకు ఫోన్ చేసింది. ఈ జాబితాలో తన పేరును కూడా సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు జాబితా మార్చానంటూ నన్ను విమర్శించడం ఆమె చవకబారు ప్రచారానికి నిదర్శనం’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
నాకా అవసరం లేదు: పూనియా
అంజలి వ్యాఖ్యలను పూనియా తిప్పికొట్టింది. అవార్డు కోసం తాను పైరవీ చేయడం లేదని, కేవలం తనకు జరిగిన అన్యాయంపై గొంతు వినిపిస్తున్నానని చెప్పింది. ‘నిజంగా నేను పైరవీ చేయాలనుంటే మా రాష్ట్రానికి చెందిన కేంద్ర క్రీడా మంత్రి ద్వారా జాబితా ప్రకటించక ముందే చేసేదానిని. 2003లో అంజలీ భగవత్ లాబీయింగ్ చేసే ఖేల్త్న్ర నెగ్గిందా నా ప్రదర్శననే నమ్ముకున్న నేను అవార్డును రాజకీయం చేయడం లేదు’ అని పూనియా ప్రశ్నించింది. మరో వైపు జాబితా పూర్తిగా సిద్ధమైనా అర్జున అవార్డులను క్రీడా శాఖ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఫైలు మంత్రి వద్దే ఉందని, ఎప్పుడు ప్రకటించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఒక అధికారి వెల్లడించారు.