
దుబాయ్: టీమిండియా ఎడమచేతి మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో భాగంగా బౌలర్ల విభాగంలో కుల్దీప్ రెండో స్థానానికి ఎగబాకాడు. కుల్దీప్ 728 రేటింగ్ పాయింట్లతో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఫలితంగా తన కెరీర్ బెస్ట్ ర్యాంకను సాధించాడు. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో కేవలం చివరి మ్యాచ్ మాత్రమే ఆడిన కుల్దీప్ 26 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఫలితంగా తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకుని కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.
ఇక మరో భారత స్పిన్నర్ కృనాల్ పాండ్యా 39 స్థానాలు మెరుగుపరుచుని 58 స్థానంలో నిలిచాడు. ఇది కృనాల్ కెరీర్ బెస్ట్ ర్యాంకుగా నమోదైంది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్(793 రేటింగ్ పాయింట్లు) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ మూడు స్థానాలు ఎగబాకి 7వ స్థానంలో నిలవగా, శిఖర్ ధావన్ 11వ స్థానంలో ఉన్నాడు. జట్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు రెండు పాయింట్లు కోల్పోయినప్పటికీ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. తొలి స్థానంలో పాకిస్తాన్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment