వయసు 39.. సెంచరీలు 100
లీడ్స్: శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర విజృంభణ కొనసాగుతోంది. ఇంగ్లీష్ కౌంటీల్లో ఇరగదిస్తున్నాడు. వరుస శతకాలతో మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్‌లో వందో శతకం పూర్తి చేశాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో భాగంగా సర్రే టీమ్ తరపున ఆడుతున్న సంగక్కర అన్ని ఫార్మాట్లలో కలిపి 45,529 పరుగులు సాధించాడు.
కౌంటీ చాంపియన్ షిప్‌లో భాగంగా మంగళవారం యార్క్‌షైర్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో తన జట్టుకు విజయాన్ని అందించాడు. 121 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన సర్రే టీమ్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 313 పరుగులు చేసింది. యార్క్‌షైర్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 289 పరుగులు సాధించింది.
39 ఏళ్ల సంగక్కర రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. దేశవాళీ క్రికెట్ నుంచి కూడా త్వరలో తప్పుకోనున్నట్టు ఇటీవల ప్రకటించాడు. మరో నాలుగు నెలలు మాత్రమే క్రికెట్ ఆడతానని వెల్లడించాడు. వయసు మీదపడుతున్న అతడి బ్యాటింగ్ పదును తగ్గలేదు. కౌంటీ చాంపియన్ షిప్‌లో సర్రే టీమ్ తరపున రు సెంచరీలు సాధించడమే ఇందుకు తాజా రుజువు. కెరీర్‌లో సంగక్కర సాధించిన వంద శతకాల్లో 61 ఫస్ట్ క్లాస్ సెంచరీలుండగా, 39 లిస్ట్-ఎ సెంచరీలున్నాయి. కెరీర్ ముగించేలోపు మైదానంలో అతడు మరిన్ని రికార్డులు సాధించడం ఖాయం.