శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వద్ద రూట్ టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా అవతరించాడు. గతంలో ఈ స్థానంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ఉండేవాడు. సంగక్కర 134 టెస్ట్‌ల్లో 12400 పరుగులు చేయగా.. రూట్ తన 146వ టెస్ట్‌లో సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు.
సంగక్కర రికార్డు బద్దలు కొట్టాక రూట్ మరో పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 12402 పరుగులు ఉన్నాయి. సెకెండ్ ఇన్నింగ్స్‌లో రూట్ 83 పరుగులు చేసుంటే టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా అవతరించేవాడు. ప్రస్తుతం ఆ స్థానంలో ఇంగ్లండ్‌కే చెందిన అలిస్టర్ కుక్ ఉన్నాడు. కుక్ ఖాతాలో 12472 టెస్ట్ పరుగులు ఉన్నాయి.
ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగుల రికార్డు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ ఖతాలో 15921 పరుగులు ఉన్నాయి. సచిన్ తర్వాత రికీ పాంటింగ్ (13378), జాక్ కల్లిస్ (13289), రాహుల్ ద్రవిడ్ (13288) టాప్-4 టెస్ట్ రన్ స్కోరర్లుగా ఉన్నారు.
70 పరుగులకే 6 వికెట్లు..
మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతుంది. ఆ జట్టు 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. బెన్ డకెట్ 7, డేనియల్ లారెన్స్ 35, ఓలీ పోప్ 7, జో రూట్ 12, హ్యారీ బ్రూక్ 3, క్రిస్ వోక్స్ 0 పరుగులకు ఔటయ్యారు. లంక బౌలర్లలో లహీరు కుమార 3, విశ్వ ఫెర్నాండో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్ తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు.
అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. 211/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 52 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది.
దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (154) భారీ శతకంతో కదంతొక్కగా.. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
కాగా, శ్రీలంక మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment