
పేస్@700
రెండో రౌండ్‌లో సానియా జంట
పారిస్ : భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరో ఘనత సాధించాడు. డబుల్స్ కెరీర్‌లో 700వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో భాగంగా బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో పదో సీడ్ పేస్-నెస్టర్ (కెనడా) ద్వయం 6-2, 5-7, 7-5తో జేమ్స్ డక్‌వర్త్-క్రిస్ గుకోయిన్ (ఆస్ట్రేలియా) జంటను ఓడించి రెండో రౌండ్‌కు చేరింది. అత్యధిక డబుల్స్ మ్యాచ్‌లు నెగ్గిన వారి జాబితాలో నెస్టర్ (972), మైక్ బ్రయాన్ (946), బాబ్ బ్రయాన్ (932) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
మరోవైపు రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట కూడా శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో బోపన్న-మెర్జియా 5-7, 6-3, 6-4తో క్రాజినోవిచ్-విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా)లపై గెలిచారు. మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట అలవోక విజయంతో రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో సానియా-హింగిస్ జోడీ 6-3, 6-0తో జూలియా జార్జెస్ (జర్మనీ)-బార్బర క్రెజ్‌సికోవా (చెక్ రిపబ్లిక్) జంటను ఓడించింది.