
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా.. రిటైర్మెంట్ తర్వాత ఏం చేయబోతున్నారు? నిజానికి రిటైర్మెంట్ గురించి నిశితంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న నెహ్రా.. తర్వాత ఏం చేయాలన్నది మాత్రం నిర్ణయించలేదు. అయితే, భవిష్యత్తులో కోచ్ లేదా కామెంటేటర్‌గా కొనసాగాలని రెండు ఆప్షన్లు పెట్టుకున్నారు. కొంతకాలం విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
నిజానికి నెహ్రా జీవితమంతా క్రికెట్ తప్ప మరో వ్యాపకం లేకుండా సాగిపోయింది. గాయాల కారణంగా ఎన్నిసార్లు జట్టులో చోటు కోల్పోయినా.. మరింత అకుంఠిత దీక్షతో శ్రమించి.. తిరిగి జట్టులోకి వచ్చాడు. యువకులతో పోటీ పడి మరీ బౌలింగ్ చేసిన ఈ క్రికెటర్ బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన టీ-20 మ్యాచ్‌తో తన కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
భవిష్యత్ కార్యాచరణ గురించి నెహ్రాను ప్రశ్నించగా.. ’తర్వాత ఏం చేయాలనేది నేనింకా నిర్ణయించుకోలేదు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోచింగ్ లేదా కామెంటేటరీలోకి వెళ్లొచ్చు’ అని చెప్పాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్ వేయాల్సింది కోహ్లి తనకు బంతి ఇచ్చినప్పుడు తనను ఎన్నో భావోద్వేగాలు ముంచెత్తాయని నెహ్రా చెప్పాడు. ’అది నిజంగా భావోద్వేగభరితమైన సందర్భం. 15-16వ ఓవర్ తర్వాత చివరి ఓవర్ వేయాల్సిందిగా కోహ్లి నాకు బాల్ ఇచ్చాడు. ఒక క్రికెటర్‌గా ఈ మాట చెప్పకూడదు కానీ, అప్పటికే గేమ్ ముగిసిపోయింది’ అని నెహ్రా అన్నాడు. ఈ మ్యాచ్‌లో కివీస్‌పై 53 పరుగుల తేడాతో టీమిండియా సునాయసంగా గెలుపొందిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment