
'ప్రజలు ఎందుకు రిటైరవుతున్నావని అడుగుతున్నప్పుడే తప్పుకోవడం మంచిది.. లేదంటే ఇంకా రిటైర్ కావడం లేదేంటి అంటారు'.. ఇది టీమిండియా వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయం.. గాయాలతో సతమతమవుతున్న నెహ్రా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చేనెల ఢిల్లీలోని సొంత గ్రౌండ్‌లో న్యూజిల్యాండ్‌తో జరిగే టీ-20 మ్యాచ్‌తో తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతానని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన నెహ్రా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
అంతకన్నా గొప్పేముంటుంది..
'టీమిండియా మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ చైర్మన్‌తో నేను మాట్లాడాను. ఢిల్లీలో న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతోంది. 20 ఏళ్ల కిందట తొలి రంజీ మ్యాచ్ ఆడిన సొంత మైదానంలో సొంత ప్రేక్షకుల నడుమ రిటైర్ కావడం కంటే గొప్పేముంటుంది' అని నెహ్రా అన్నాడు. ఆస్ట్రేలియాలో టీ-20 సిరీస్ కోసం నెహ్రా తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ.. తొలి రెండు మ్యాచ్‌ల్లో అతని తుదిజట్టులో చోటు లభించలేదు. ప్రస్తుతం టీమిండియా యువతరం ఆటగాళ్లతో దృఢంగా ఉందని నెహ్రా చెప్పాడు.
'సిరీస్ కోసం నన్ను జట్టులోకి తీసుకున్నప్పుడు.. అన్నీ మ్యాచ్‌లు ఆడాలని సన్నద్ధమయ్యాను. కెప్టెన్ (విరాట్ కోహ్లి), కోచ్ (రవిశాస్త్రి)కి నేరుగా ఈ విషయాన్ని చెప్పాను. అవకాశం ఉంటే తుదిజట్టులోకి తీసుకుంటారని భావించాను. గత రెండేళ్లలో భారత్ టీ-20 మ్యాచ్‌లన్నింటిలోనూ నేను ఆడాను' అని నెహ్రా వివరించాడు.
తుది జట్టులో చోటు లభించకపోవడంతో రాత్రికి రాత్రే రిటైర్ అవ్వాలని నిర్ణయం తీసుకోలేదని, యంగ్ పేస్ బౌలర్లు దీటుగా రాణిస్తుండటంతోనే వారికి అవకాశం కల్పించాలని తాను ఈ నిర్ధారణకు వచ్చానని నెహ్రా తెలిపాడు. 'భువనేశ్వర్ బౌలింగ్ బాధ్యతలను మోసేందుకు సిద్ధంగా ఉన్నాడు. గతంలో నేను, బుమ్రా బౌలింగ్ చేసేవాళ్లం. ఇప్పుడు భువీ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక, వచ్చే ఐదారు నెలలు పెద్దగా మ్యాచ్‌లు, ఈవెంట్లు లేవు. అందుకే నా అభిప్రాయాన్ని మేనేజ్‌మెంట్‌కు చెప్పాను. నా నిర్ణయాన్ని అందరూ గౌరవించారు' అని నెహ్రా వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment