
డెహ్రాడూన్: అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో బంగ్లాదేశ్ వైట్‌వాష్ అయ్యింది. ఏ గేమ్‌లోనూ ఆకట్టుకోలేకపోయిన బంగ్లాదేశ్.. తమకంటే ఎంతో జూనియర్ జట్టైన అఫ్గాన్ చేతిలో ఘోరపరాభవం చూసింది. గురువారం ఉత్కంఠభరితంగా జరిగిన చివరిదైన మూడో టి20లో అఫ్గాన్ ఒక పరుగుతో విజయం సాధించింది. బంగ్లా విజయానికి చివరి 2 ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి ఉండగా... 19వ ఓవర్‌లో ముష్ఫికర్ రహీమ్ (46; 7 ఫోర్లు) వరుసగా ఐదు ఫోర్లు కొట్టి మొత్తం 21 పరుగులు రాబట్టాడు. దీంతో సమీకరణం చివరి ఓవర్లో 9 పరుగులకు మారింది. ఆ సమయంలో బంతి అందుకున్న రషీద్ ఖాన్ తొలి బంతికే రహీమ్‌ను ఔట్ చేయడంతో పాటు ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి గెలిపించాడు. దాంతో అఫ్గానిస్తాన్ హ్యాట్రిక్ విజయంతో క్లీన్‌స్వీప్ చేయగా, బంగ్లాదేశ్ ఒక్క విజయం కూడా లేకుండా సిరీస్‌ను ముగించింది.
దీనిపై మ్యాచ్ అనంతరం బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ మాట్లాడుతూ..‘ సిరీస్ ఓటమిపై సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉంది. నేను గతంలో ఎప్పుడూ ఈ తరహా పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయలేదు. మా జట్టులో బౌలర్ అయినా, బ్యాట్స్‌మెన్ అయినా వారి వారి ప్రదర్శనపై పునరాలోచించుకోవాలి. మా జట్టులో మానసిక పరిపక్వత లోపించినట్లు కనబడింది. ఓవరాల్‌గా మా ప్రదర్శనతో సిరీస్ గెలిచే అర్హత లేదనేది అర్థమైంది. మూడు విభాగాల్లోనూ పూర్తిగా విఫలయమ్యాం. అఫ్గానిస్తాన్ పరిస్థితులకు తగ్గట్టు ఆడింది. అఫ్గాన్ జట్టులో రషీద్ ఖాన్ కీలక ఆటగాడు. అతను మ్యాచ్‌లను గెలిపించిన తీరు అమోఘం’ అని షకిబుల్ హసన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment