బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని దాటాడు. షకీబ్.. మూడు ఫార్మాట్లలో కలిపి 14000 పరుగుల మార్కును అధిగమించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జులై 11) జరిగిన మూడో వన్డేలో షకీబ్ ఈ రికార్డు సాధించాడు. బంగ్లాదేశ్ క్రికెట్‌లో 14000 పరుగుల మార్కును దాటిన మూడో క్రికెటర్‌గా షకీబ్ రికార్డుల్లోకెక్కాడు. 416 మ్యాచ్‌ల్లో షకీబ్ ఈ మార్కును దాటాడు. షకీబ్‌కు ముందు తమీమ్ ఇక్బాల్ (389 మ్యాచ్‌ల్లో 15205), ముష్ఫికర్ రహీమ్ (438 మ్యాచ్‌ల్లో 14310 పరుగులు) బంగ్లాదేశ్ తరఫున ఈ రికార్డు సాధించారు.
ఓవరాల్‌గా చూస్తే ప్రపంచ క్రికెట్‌లో షకీబ్‌కు ముందు 47 మంది 14000 పరుగుల మార్కును దాటారు. వీరిలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (664 మ్యాచ్‌ల్లో 34357 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. సంగక్కర (28016), రికీ పాంటింగ్ (27483) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో షకీబ్ కంటే ముందుగా విరాట్ కోహ్లి (25385), జో రూట్ (18336), డేవిడ్ వార్నర్ (17267), కేన్ విలియమ్సన్ (17142), రోహిత్ శర్మ (17115), స్టీవ్ స్మిత్ (15084), ఏంజెలో మాథ్యూస్ (14231) అంతర్జాతీయ క్రికెట్‌లో 14000 పరుగుల మార్కును దాటారు.
బంగ్లా-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. స్వదేశంలో అఫ్ఘనిస్తాన్ చేతిలో వైట్‌వాష్ అయ్యే ప్రమాదాన్ని బంగ్లాదేశ్ తప్పించుకుంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 0-2తో వెనుకపడిన బంగ్లా జట్టు.. ఇవాళ (జులై 11) జరిగిన మూడో వన్డేలో గెలుపొందడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించి, ఘోర పరాభవం ఎదుర్కోకుండా బయటపడగలిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. 45.2 ఓవర్లలో 126 పరుగులకే చాపచుట్టేయగా, బంగ్లాదేశ్ 23.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment