హోబార్ట్: ఈ ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ఆడబోతున్న ఆసీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మెరుపులు మెరిపిస్తున్నాడు. బీబీఎల్‌లో బ్రిస్బేన్ హీట్‌కు సారథిగా వ్యవహరిస్తున్న లిన్.. శుక్రవారం హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 55 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 88 పరుగులు సాధించాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన లిన్ వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగులు మోత మోగించాడు.
ఈ క‍్రమంలోనే ఓపెనర్ మ్యాక్స్ బ్రయాంట్(65)తో కలిసి 95 పరుగుల్ని జోడించాడు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో బ్రిస్బేన్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఆపై మ్యాట్ రెన్‌షాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన లిన్ జట్టు స్కోరును రెండొందల దాటించాడు. రెన్ షా 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేయడంతో బ్రిస్బేన్ మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇక లిన్ నాటౌట్‌గా మిగిలాడు. ఆపై టార్గెట్‌ను ఛేదించే క్రమంలో హరికేన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. దాంతో బ్రిస్బేన్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో బ్రిస్బేన్‌కు ఇది రెండో విజయం. అంతకుముందు సిడ్నీ సిక్సర్స్‌పై బ్రిస్బేన్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కూడా లిన్ దూకుడుగా ఆడాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 94 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిడ్నీ సిక్సర్స్‌పై బ్రిస్బేన్ హీట్ 48 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.(ఇక్కడ చదవండి:‘ప్రతీ సిక్స్‌ను డొనేట్ చేస్తా’)
Comments
Please login to add a commentAdd a comment