హైదరాబాద్: అత్యధిక పరుగులు, వంద సెంచరీలు, సుదీర్ఘ క్రికెట్ అనుభవం, యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయగల సమర్థుడు, క్లిష్ట సమయాల్లో జట్టు సమైక్యతను కాపాడిన ఘనుడు ఇలా అనేక ప్రశంసలు, ఘనతలు అందుకున్న క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గొప్ప సారథినని మాత్రం నిరూపించుకోలేకపోయాడు. అతడి కెరీర్‌లో ఏదైనా చిన్న అసంతృప్తి ఉందంటే అది కెప్టెన్సీనే. ఆటగాడిగా ఎన్నో కీర్తి ప్రతిష్టలు అందుకున్న సచిన్ నాయకుడిగా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడంటూ కొందరు బహిరంగంగానే విమర్శించారు. అయితే సారథిగా సచిన్ ఎక్కడ విఫలమయ్యాడో మాజీ క్రికెటర్, ప్రపంచకప్-1983 గెలిచిన భారత జట్టులో సభ్యుడు మదన్‌లాల్ తాజాగా వివరించాడు. (‘2007లోనే రిటైర్మెంట్‌కు సచిన్ ప్లాన్’)
‘సచిన్ గొప్ప సారథి కాదనే వ్యాఖ్యలతో నేను ఏ మాత్రం ఏకీభవించను. బాధ్యత గల సారథిగా అతడు తన వ్యక్తిగత ఆటపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. కానీ మిగతా పది మంది ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చనిచ్చాడు. మంచి ప్రదర్శన చేయాలని వారిపై ఒత్తిడి తేలేదు. అయితే ఆ సమయంలో వారు బాధ్యతాయుతంగా ఆడి ఉంటే సచిన్ కూడా గొప్ప సారథి అయ్యుండే వాడు. క్రికెట్‌లో కెప్టెన్ ఒక్కడే రాణిస్తే విజయాలు సాధించలేము. ఆ ఒక్కడితో పాటు మిగతా పది మంది బాధ్యతాయుతంగా ఆడితేనే విజయం సాధిస్తాం. దీన్ని సమన్వయం చేయడం కష్టమే. కొని సార్లు సహచర ఆటగాళ్లతో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో సచిన్ కాస్త వెనకపడ్డాడు. గొప్ప సారథి కాలేకపోయాడు’ అని మదన్‌లాల్ వ్యాఖ్యానించాడు. (ఆ వార్తలను నమ్మకండి : ఆఫ్రిది)
1996 ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక మ్యాచ్ గల బోర్డర్-గావస్కర్ సిరీస్‌తో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న సచిన్.. 73 వన్డేలు, 25 టెస్టుల్లో జట్టును ముందుండి నడిపించాడు. కానీ జట్టుకు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలన్నందించలేకపోయాడు. అతని సారథ్యంలో భారత్ 23 వన్డేలు, 4 టెస్ట్‌లు మాత్రమే గెలవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment