అంపైరింగ్ కు మహనామా గుడ్ బై!
దుబాయ్:అంతర్జాతీయ క్రికెట్ లో సుదీర్ఘమైన సేవలందించిన రోషన్ మహనామా తన అంపైరింగ్ జీవితానికి త్వరలో వీడ్కోలు చెప్పనున్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఐసీసీ రిఫరీస్ ఎలైట్ ప్యానెల్ లో కొనసాగుతున్న మహనామా అంపైరింగ్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది. మహనామా కాంట్రాక్టు మరో ఆరు నెలలు ఉన్నా.. కుటుంబంతో అత్యంత సమయం గడపాలనే కారణం చేత ప్యానెల్ నుంచి బయటకొస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ఈ ఏడాది చివర్లో మహనామా అంపైరింగ్ సేవల నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
శ్రీలంక క్రికెట్ లో విశేష సేవలందించిన మహనామా.. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో 2004 సభ్యత్వం స్వీకరించారు. అటు తరువాత 222 వన్డేలు, 58 టెస్టులు, 35 ట్వంటీ 20 మ్యాచ్ లకు మహనామా అంపైర్ గా, రిఫరీగా పనిచేశారు . ఇందులో మూడు వరల్డ్ కప్ లతో పాటు, 2009లో జరిగిన ఐసీసీ చాంపియ్స్ ట్రోఫీ కూడా ఉండటం విశేషం. దాదాపు 12 సంవత్సరాల పాటు మహనామా ఐసీసీ ప్యానెల్లో కొనసాగారు. అటు ఆటగాడిగా, అంపైర్ గా, రిఫరీగా సుమారు 600 మ్యాచ్ లు అనుభవం మహనామా సొంతం. శ్రీలంక క్రికెట్ జట్టు తరుపున 1986 నుంచి 1999 వరకూ సేవలందించిన మహనామా 52 టెస్టులు, 213 వన్డేలు ఆడారు. 1996 లో శ్రీలంక సాధించిన వరల్డ్ కప్ లో మహనామా సభ్యుడు కావడం మరో విశేషం.