భారత కెప్టెన్ ధోనికి భద్రత తగ్గింపు!
భారత కెప్టెన్ ధోనికి భద్రత తగ్గింపు!
Published Tue, Aug 12 2014 2:20 AM | Last Updated on Mon, May 28 2018 1:46 PM
రాంచీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి భద్రతను కుదిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వీఐపీలకు ఏర్పాటు చేస్తున్న భద్రతపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో ధోనికి భద్రత తగ్గించామని పోలీసు అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. భారత కెప్టెన్ కు ఎలాంటి ముప్పులేదని ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని రాజీవ్ తెలిపారు.
ఇప్పటి వరకు తొమ్మిది మందితో కూడిన జెడ్ కేటగిరి భద్రత ఉండేది. తాజా నిర్ణయంతో ధోని భద్రత 'వై' కేటగిరికి మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వై కేటగిరిలో ఏడుగురు పోలీసు సిబ్బంది భద్రతగా ఉంటారని పోలీసులు తెలిపారు. ధోని భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన పడకూడదని.. సొంత పట్టణానికి ఎప్పుడొచ్చినా.. జెడ్ కేటగిరి కంటే ఎక్కువ భద్రతనే ఏర్పాటు చేస్తామని రాజీవ్ అన్నారు.
గతంలో ధోనికి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేరకే తాము జెడ్ కేటగిరి భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ధోనికి ఎలాంటి ముప్పు లేదని ఆయన అన్నారు. రాంచీలోని హార్మూలో ధోని నివాసముంది. రాంచీని సందర్శించిన ప్రతిసారి డియోరి ఆలయాన్ని సందర్శిస్తారు. అంతేకాకుండా సొంత పట్టణంలో మోటార్ సైకిల్ నడపడానికి ధోని ఇష్టపడుతారని పోలీసులు తెలిపారు.
Advertisement