
న్యూయార్క్: ఫుట్‌బాల్ అంటే మక్కువ చూపే దేశాల్లో బ్రెజిల్ ఒక్కటి. 13 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బ్రెజిల్‌లో ఆ ఆట అంటే పడి చచ్చిపోతారు. అయితే అది ఒకప్పటి మాట. ప్రస్తుతం బ్రెజిల్ వాసులు ఆ ఆట మీద ఏ మాత్రం మక్కువ చూపటం లేదని ఓ సర్వే తేల్చింది. పైగా రికార్డు స్థాయిలో ఆ గేమ్ మీద ఆసక్తి కోల్పోయారని షాకింగ్ నివేదికనే సమర్పించింది.
సర్వే వివరాలు... ఫిఫా వరల్డ్ కప్-2018 నేపథ్యంలో న్యూయార్క్‌కు చెందిన నీల్సెన్ స్పోర్ట్స్ సంస్థ ఆన్‌లైన్ ద్వారా సర్వే చేపట్టింది. నివేదిక ఆధారంగా మొత్తం 30 దేశాలతో ఓ జాబితాను రూపొందించింది. అందులో అత్యధికంగా 80 శాతంతో యూఏఈ దేశ ప్రజలు ఫుట్‌బాల్ మీద ఆసక్తికనబరుస్తున్నట్లు వెల్లడించింది. తర్వాతి స్థానంలో థాయ్‌లాండ్(78 శాతం), చిలీ, పోర్చుగల్, టర్కీ నిలవగా, బ్రెజిల్ అనూహ్యంగా 13వ స్థానంలో నిలిచింది. 2013లో 73 శాతం మంది బ్రెజిల్ ప్రజలు ఆట మీద మక్కువ ప్రదర్శించగా.. ఇప్పుడు అది గణనీయంగా పడిపోయినట్లు(ఎంత శాతం అన్నది స్పష్టం చేయలేదు) గణాంకాలు చెబుతున్నాయి.
ఇండియాలో ఫిఫా క్రేజ్
మిగతా దేశాలను పరిశీలిస్తే... గత నివేదికతో(2013) పోలిస్తే ప్రస్తుతం మిగతా దేశాల్లో సాకర్‌పై మక్కువ పెరిగిపోయింది. చైనాలో 5 శాతం(ఇంతకు ముందు 27.. ఇప్పుడు 32),అమెరికాలో 4 శాతం(ఇంతకు ముందు 28.. ఇప్పుడు 32), ఇండియాలో కాస్త ఎక్కువగా 15 శాతం (ఇంతకు ముందు 30.. ఇప్పుడు 45) ఫుట్‌బాల్‌పై మక్కువ కనబరుస్తున్నట్లు నివేదిక తెలిపింది.
జర్మనీతో మ్యాచ్‌లో ఓటమి తర్వాత దృశ్యం
కారణం అదేనా?... ఒకానోక టైంలో ఫుట్‌బాల్ అంటేనే గుర్తొచ్చే పేరు బ్రెజిల్. అలాంటిది పరిస్థితి ఇంత దారుణంగా పడిపోవటానికి కారణాలు సైతం ఆ సర్వే విశ్లేషించింది. గత ఫిఫా వరల్డ్ కప్ వేదిక బ్రెజిల్ అన్న విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు ఏడాది నుంచి బ్రెజిల్ ఫెర్‌ఫార్మెన్స్ దారుణంగా పడిపోతూ వచ్చింది. దీనికి తోడు సొంత దేశంలో సెమీ ఫైనల్‌లో జర్మనీ చేతిలో 7-1 తేడాతో బ్రెజిల్ చిత్తుగా ఓడిపోవటాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి ఆటపై ఆదరణ క్రమక్రంగా తగ్గిపోతూ వస్తోంది. వాతావరణం అనుకూలించకపోయినా ఆట కోసం మైదానాలకు ఎగబడిపోయే బ్రెజిల్ ప్రేక్షకులు.. బ్రెజిలియన్ ఛాంపియన్ షిప్ మ్యాచ్‌ల సమయంలో అంతంత మాత్రంగా హాజరుకావటం... పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో తెలిపింది. ప్రస్తుతం ఫుట్‌బాల్ పట్ల అక్కడి ప్రజలు అంత ఆసక్తికనబరచటం లేదని స్పష్టమౌతోంది. ఫిఫా వరల్డ్‌కప్ 2018 సందర్భంగా ఫుట్‌బాల్ సంబంధిత ఉత్పత్తులు అంతగా అమ్ముడుపోకపోవటం( గతంలో కంటే 50 శాతానికి పైగా పడిపోయినట్లు అమ్మకపు కంపెనీలు చెబుతున్నాయి), ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రష్యాకు చేరుకుంటున్న వారి సంఖ్య బాగా తగ్గిపోయిందని స్వయానా బ్రెజిల్ ఫుట్‌బాల్ అసోషియేషన్ ప్రకటించటం గమనార్హం.
ఓటమి తర్వాత బ్రెజిల్ ప్రేక్షకుల కంటతడి
మెస్సీ కంటే రొనాల్డోనే... సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి ఇందుకు సంబంధించిన ట్రోల్ గురించి పరిచయం అక్కర్లేదు. మెస్సీ కంటే రొనాల్డోనే గ్రేట్ అని.. లేదు రొనాల్డో కంటే మెస్సీనే గొప్ప అంటూ ఇద్దరు ఆటగాళ్ల ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఫిఫా నేపథ్యంలో ఎవరికి క్రేజ్ ఎక్కువ అన్నదానిపై నీల్సెన్ స్పోర్స్ట్ సర్వే జరిపింది. ఇందులో లియోనెల్ మెస్సీ(అర్జెంటీనా)పై క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగల్) పైచేయి సాధించాడు. సోషల్ మీడియాలో(ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ అన్ని కలిపి) మెస్సీ కంటే రొనాల్డోకే ఫాలోవర్లు ఎక్కువ. పైగా గత ఐదు నెలలుగా రొనాల్డో ఫాలోయింగ్ గణనీయంగా పెరిగిపోతూ వస్తోందని సర్వే తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment