ఒక్క పరుగుతో భారత్ ‘ఎ’ ఓటమి
* మనీష్ పాండే సెంచరీ వృథా
* ఆస్ట్రేలియా ‘ఎ’తో వన్డే
మకే (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా ‘ఎ’తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ‘ఎ’ చివరి ఓవర్‌లో తొమ్మిది పరుగులు చేయాల్సి ఉండగా ఏడు పరుగులు మాత్రమే చేసింది. అరుుతే ఈ క్వాడ్రాంగులర్ సిరీస్‌లో ఇరు జట్లు ఇప్పటికే ఫైనల్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రమైంది. మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ‘ఎ’ 50 ఓవర్లలో 6 వికెట్లకు 322 పరుగులు చేసింది.
ప్యాటర్సన్ (123 బంతుల్లో 115; 16 ఫోర్లు), మాడిసన్ (117 బంతుల్లో 118; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలు చేశారు. శార్ధుల్ ఠాకూర్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ 50 ఓవర్లలో 8 వికెట్లకు 321 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ మనీష్ పాండే (91 బంతుల్లో 110; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేయగా... సంజూ శామ్సన్ (74 బంతుల్లో 87; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తుదికంటా పోరాడాడు.