మెక్‌కే (ఆ్రస్టేలియా): బౌలర్ల పట్టుదలకు బ్యాటర్ల క్రమశిక్షణ తోడవడంతో భారత్ ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ఆ్రస్టేలియా ‘ఎ’ విజయం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 208/2తో శనివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ జట్టు 100 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది.
సాయి సుదర్శన్ (200 బంతుల్లో 103; 9 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకోగా... దేవదత్ పడిక్కల్ (199 బంతుల్లో 88;6 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరూ సాధికారికంగా ఆడటంతో ఒక దశలో భారత్ ‘ఎ’ 226/2తో పటిష్ట స్థితిలో కనిపించింది.
మిడిలార్డర్ కూడా రాణిస్తే... మ్యాచ్‌పై పట్టు చిక్కినట్లే అని భావిస్తే... కింది వరస బ్యాటర్లు కనీస పోరాటం చేయకుండానే చేతులెత్తేశారు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కాసేపు మెరిపించగా... బాబా ఇంద్రజిత్ (6), నితీశ్ కుమార్ రెడ్డి (17), మానవ్ సుతార్ (6) నిలువలేకపోయారు. ఆ్రస్టేలియా ‘ఎ’ బౌలర్లలో ఫెర్గూస్ ఓ నీల్ 4, టాడ్ మర్ఫీ మూడు వికెట్లు పడగొట్టారు.
దీంతో కంగారూల ముందు 225 పరుగుల లక్ష్యం నిలవగా... శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 50.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.
కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (47 బ్యాటింగ్; 5 ఫోర్లు), మార్కస్ హారీస్ (36; 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్ తలా ఒక వికెట్ పడగొట్టారు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు విజయానికి మరో 86 పరుగులు చేయాల్సి ఉంది.
మెక్‌స్వీనీతో పాటు వెబ్‌స్టర్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకు ఆలౌట్ కాగా... ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 195 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment