
‘మన్కడింగ్’ పేరును తొలగించండి!
సునీల్ గావస్కర్ సూచన
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్ గౌరవాన్ని తగ్గించే విధంగా ఉన్న ‘మన్కడింగ్’ పద ప్రయోగాన్ని క్రికెట్ పరిభాష నుంచి తొలగించాలని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. బౌలర్ చేతి నుంచి బంతి దాటక ముందే నాన్‌స్ట్రైకర్ క్రీజ్ వదిలినప్పుడు అతడిని అవుట్ చేయడాన్ని మన్కడింగ్‌గా వ్యవహరిస్తారు. 1947–48 ఆస్ట్రేలియా సిరీస్‌లో బిల్ బ్రౌన్‌ను మన్కడ్ ఈ తరహాలో అవుట్ చేసినప్పటి నుంచి అతని పేరునే దీనికి వాడుతున్నారు.
‘ఈ పేరును వాడటం మన్కడ్‌లాంటి దిగ్గజ ఆటగాడి స్థాయిని తగ్గిస్తున్నట్లుగా అనిపిస్తోంది. నిజంగా పేరుతోనే దీనిని పిలవాలంటే అప్పటి నాన్‌స్ట్రైకర్ పేరునే దీనికి వాడాలి. ఎందుకంటే మన్కడ్ రెండుసార్లు హెచ్చరించిన తర్వాత కూడా అతను క్రీజ్ దాటి వెళ్లాడు. తప్పు బ్యాట్స్‌మన్‌దే. కాబట్టి దీనిని బ్రౌనింగ్ అని వ్యవహరిస్తే మేలు’ అని గవాస్కర్ సూచించారు. ఇటీవలే క్రికెట్ నిబంధనల్లో ఎంసీసీ పలు మార్పులు చేసింది. ఇందులో మన్కడింగ్‌ను పూర్తిగా బ్యాట్స్‌మన్ తప్పుగా నిర్ధారించింది. రనౌట్‌కు నాన్‌స్ట్రైకర్‌దే తప్ప బౌలర్‌ది బాధ్యత కాదని స్పష్టం చేసింది.