13కే పెళ్లి.. పద్నాలుగేళ్లకే పిల్లలు..?
ముంబై: పట్టుదల ఉంటే కొండనైనా పిండిచేయవచ్చని చెబుతుంటారు. ఆ పట్టుదలతోనే తన కలను నెరవేర్చుకున్న యువతి.. కాదు మహిళ ...కాదు కాదు. ఓ అమ్మ కథ. మహారాష్ట్రలోని భీవాండికి చెందిన నీతూకి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు నెత్తిమీద పడినా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే అన్ని అడ్డంకులను అధిగమించింది. చివరికి ప్రపంచ క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచింది. ఇంతకీ ఆమె ఏం చేసింది...
రోహతక్ ట్రెయినింగ్ మ్యాట్ పై నీతూ (19) దేశంలోని సాధారణ క్రీడాకారిణి లాగానే కనిస్తుంది. కానీ ఆమె ప్రత్యేకతే వేరు.
నీతూకి అతి చిన్న వయసులోనే (13 ఏళ్లు) పెళ్లయింది. ఇక పద్నాలుగేళ్లకే కవల పిల్లలకు తల్లయింది. కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. అయినా తనకి ఎంతో ఇష్టమైన రెజ్లింగ్ క్రీడను కెరీర్ గా ఎంచుకోవాలనుకుంది అయితే కుటుంబ సభ్యులు ఎవరూ అందుకు అంగీకరించలేదు. కానీ రీతూ ఎక్కడా నిరాశకు గురి కాలేదు....కుంగిపోలేదు. పట్టుదలతో కఠోర శ్రమ చేసి చివరకు అనుకున్నది సాధించింది.
పెళ్లి, పిల్లలతో పెరిగిన తన శరీర బరువును తగ్గించుకోవడానికి రీతూ పగలు రాత్రి కష్టపడింది. తెల్లవారుఝామున మూడు గంటలకే నిద్ర లేచి రన్నింగ్ చేసి ఎనభై కిలోల బరువును అదుపులోకి తెచ్చింది. ఎలాంటి శిక్షణ లేకుండానే రెజ్లింగ్ క్రీడలోని మెళకువలు నేర్చుకుంది. అటు పిల్లల పెంపకాన్ని, ఇటు రెజ్లింగ్ సాధనను రెండింటినీ సమర్ధవంతంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా రీతూ మాట్లాడుతూ.. 'మాది చాలా సాంప్రదాయ కుటుంబం.. రెజ్టింగ్ నేర్చుకుంటానని చెప్పగానే.. అందరిలాగానే మా కుటుంబ సభ్యులు కూడా అస్సలు అంగీకరించలేదు. అయినా గ్రామంలో ఎవ్వరూ నిద్ర లేవకముందే నా శిక్షణ పూర్తి చేసుకుని, తర్వాత ఇంట్లో పనిని చూసుకునేదాన్నంటూ' తను గెలుచుకున్న పతకాలను మీడియాకు చూపించింది.
జూనియర్, సీనియర్ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో రీతూ విజేతగా నిలిచింది. ప్రపంచ రెజ్లింగ్ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. కోచ్ మణిదీప్ సింగ్ నీతూ టాలెంట్ను అభినందిస్తూ.... నీతూ అస్సలు సమయాన్ని వృధా చేయదు. కష్టపడి పనిచేస్తుంది తనలో చాలా శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. ఆమె ఇంకా చాలా విజయాలు సాధిస్తుంది అనే ధీమాను వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం సహాయ సహకారాలు ఆమెకు అందించాలని కోరుతున్నారు.