న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పట్టుదల నెగ్గింది. భారత దిగ్గజం మేరీకోమ్‌తో ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్ పోరు నిర్వహించాలనే ఆమె మొరను కేంద్ర క్రీడాశాఖ, భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఆలకించాయి. ఇద్దరి మధ్య ట్రయల్ బౌట్ పెట్టాలని బీఎఫ్‌ఐని క్రీడాశాఖ ఆదేశించింది. దీంతో బీఎఫ్‌ఐ డిసెంబర్ 29, 30 తేదీల్లో మహిళా బాక్సర్లందరికీ సెలక్షన్ బౌట్లను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇటీవల బీఎఫ్‌ఐ ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకోమ్‌కి అనుకూలంగా వ్యవహరించింది. ట్రయల్స్ లేకుండానే 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌ని ఒలింపిక్స్ క్వాలియఫర్స్‌కు ఎంపిక చేసింది. ఇది వివాదం రేపింది. తన ఒలింపిక్స్ అవకాశాల్ని ఇలా తుంచేయడాన్ని సహించలేకపోయిన నిఖత్ ఏకంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాసింది.
ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని అందులో కోరింది. దీనిపై ఎట్టకేలకు స్పందించిన క్రీడాశాఖ ట్రయల్స్ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో డిసెంబర్ 29, 30 తేదీల్లో మహిళా బాక్సర్లకు ట్రయల్స్ పోటీలు జరుగనున్నాయి. 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్, నిఖత్‌ల మధ్య నిర్వహించే ట్రయల్స్ బౌట్‌లో నెగ్గిన బాక్సర్... ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సంపాదిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో ఈ క్వాలిఫయర్స్ పోటీలు జరుగుతాయి. 51 కేజీల విభాగంతోపాటు 57, 60, 69, 75 కేజీల విభాగాల్లో కూడా సెలెక్షన్ ట్రయల్స్ బౌట్‌లు ఉంటాయి.
ఆ ఇద్దరికి మినహాయింపు...
ఇక పురుషుల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన అమిత్ పంఘాల్ (52 కేజీలు), కాంస్యం సాధించిన మనీశ్ కౌశిక్ (63 కేజీలు)లకు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే నేరుగా జట్టులోకి ఎంపిక చేయనున్నారు. మిగతా ఆరు కేటగిరీల్లో (57, 69, 75, 81, 91, ప్లస్ 91 కేజీలు) మాత్రం డిసెంబర్ 27, 28 తేదీల్లో ట్రయల్స్ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment