
నరనరాన పోరాటం
►మ్యాచ్ మ్యాచ్‌కూ పురోగతి సాధించిన సింధు
►అంచనాలను మించి రాణించిన తెలుగు తేజం
►అద్వితీయ ప్రదర్శనతో అందరికీ ఆదర్శం
సాక్షి క్రీడావిభాగం అంతర్జాతీయస్థాయిలో ఎన్ని విజయాలు సాధించినా ఒలింపిక్స్‌లాంటి విశ్వ వేదికపై రాణిస్తేనే క్రీడాకారుల కెరీర్‌కు పరిపూర్ణత లభిస్తుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించినా ఒలింపిక్స్ పతకం లేకుంటే ఏదో వెలితిలా ఉంటుంది. క్రీడా సంస్కృతి అంటే ఎలా ఉండాలో, ఎలా ఉంటుందో ఇప్పుడిపుడే తెలుసుకుంటున్న భారత్‌లాంటి దేశంలో ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తే చాలనుకునే క్రీడాకారులెందరో ఉన్నారు. అయితే ప్రాతినిధ్యంతో సరిపెట్టుకోకుండా పతకంతోనే తిరిగి రావాలనే పట్టుదల పూసర్ల వెంకట సింధుది. రియో ఒలింపిక్స్‌లో 21 ఏళ్ల ఈ తెలుగు అమ్మాయి సాధించిన ఘనతను ఏ రకంగా ప్రశంసించినా తక్కువే అవుతుంది. ఏడాది కాలంగా సరైన ఫలితాలు లేకున్నా, ఒకవైపు గాయాలు బాధిస్తున్నా... అందుబాటులో ఉన్న సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకొని అద్వితీయ ప్రదర్శనతో యావత్‌దేశం గర్వపడేలా చేసింది.
ఫిట్‌నెస్ కీలకం
రియో ఒలింపిక్స్‌కంటే ముందు సింధు ఖాతాలో పెద్దగా విజయాలు లేవు. జనవరిలో మలేసియా గ్రాండ్‌ప్రిగోల్డ్ టోర్నీలో టైటిల్ సాధించిన తర్వాత సింధు తాను పాల్గొన్న 12 టోర్నమెంట్లలో ఫైనల్‌కు కూడా చేరలేదు. జూన్ తొలి వారంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో ఈ హైదరాబాద్ అమ్మాయి తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. ఈ టోర్నీ తర్వాత సింధు మరే టోర్నీలోనూ పాల్గొనకుండా నేరుగా ఒలింపిక్స్‌లోనే అడుగుపెట్టింది. ఈ మెగా ఈవెంట్‌కు సన్నద్ధం కావడానికి ఆమెకు రెండు నెలల సమయం లభించింది. ఫిట్‌నెస్ మెరుగు కావడానికి సింధు కొన్నిరోజులు ముంబైకు వెళ్లి వచ్చింది. ఫిట్‌నెస్‌లో అద్భుతమైన పురోగతి సాధించడంతో ఆ ప్రభావం సింధు ఆటతీరులో స్పష్టంగా కనిపించింది. సుదీర్ఘ ర్యాలీలు సాగినా... కోర్టుకిరువైపులా పాదరసంలా కదలాల్సి వచ్చినా... సింధు ఏమాత్రం అలసటకు గురి కాలేదు.
ఆత్మవిశ్వాసం అద్భుతం
నాకౌట్ దశలో తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులు ప్రత్యర్థులుగా ఉన్నా సింధు ఏమాత్రం తొణకలేదు. ముఖాముఖి రికార్డు తనకు వ్యతిరేకంగా ఉన్నా తనదైన రోజున తాను చెలరేగితే విజయం తథ్యమని నిరూపించింది. లీగ్ దశ రెండో మ్యాచ్‌లో చైనా సంతతికి చెందిన కెనడా క్రీడాకారిణి మిచెల్లి లీ చేతిలో తొలి గేమ్ కోల్పోయినా... వెంటనే తేరుకొని వరుస గేముల్లో విజయాన్ని దక్కించుకుంది. ఇంతకుముందు తనలో బలహీన అంశంగా ఉన్న డిఫెన్స్‌ను సరిదిద్దుకున్న సింధు అన్ని మ్యాచ్‌ల్లో దూకుడుగా కూడా ఆడింది. ముఖ్యంగా ప్రపంచ రెండో ర్యాంకర్ యిహాన్ వాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేమ్ కీలకదశల్లో సింధు సంయమనంతో ఆడి ఫలితాన్ని తనవైపునకు తిప్పుకుంది. అనవసర తప్పిదాలను కూడా తగ్గించుకొని చాలా పాయింట్లను విన్నర్స్ ద్వారానే సాధించింది. ఆఖరికి ఏ లక్ష్యంతో రియోలో అడుగుపెట్టిందో ఆ లక్ష్యాన్ని సాకారం చేసుకుంది.
రజతం గెలిచిన మా అమ్మాయి దేశ ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయింది. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధిస్తుంది. సింధు సాధించిన ఘనతకు తల్లిగా నేను గర్విస్తున్నాను. గోపీచంద్ మార్గదర్శకత్వంలో తను అత్యున్నత శిఖరాలకు చేరుతుందనే నమ్మకం ఉంది’
- విజయలక్ష్మి (సింధు తల్లి)