నిరాశపరిచిన మ్యాక్స్ వెల్: బెయిలీ
బెంగళూరు: విధ్వంసకర ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ జార్జి బెయిలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సీజన్ అతడు నిరాశపరిచాడని పేర్కొన్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన మ్యాక్స్ వెల్ కేవలం 62 పరుగులే చేశాడు. వన్డే వరల్డ్ కప్ లో రాణించిన అతడు ఐపీఎల్ లో చతికిలపడడాన్ని బెయిలీ జీర్ణించుకోలేకపోతున్నాడు.
మ్యాక్స్ వెల్ ఆటతీరు అతడికే అసంతృప్తి కలింగించేలా ఉందని వెల్లడించాడు. తనదైన శైలిలో అతడు ఆడలేకపోతున్నాడని తెలిపాడు. ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ ఆడి వచ్చిన మ్యాక్స్ వెల్ భారత్ లో పరిస్థితులకు అలవాటు పడడానికి సమయం పడుతుందని అన్నాడు. పంజాబ్ కు ప్లేఆప్ అవకాశాలు సజీవంగా ఉన్నాయని తెలిపాడు. తాము పుంజుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ ఏడింట్లో ఓడింది. కేవలం 2 విజయాలు మాత్రమే దక్కించుకుంది.