ఆటోవాలా... రిఫరీ!
రెండు వారాల క్రితం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో భారత టాప్ ఫుట్‌బాల్ టోర్నీ ఐ-లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఒక వైపు ఫలితం తర్వాత మోహన్‌బగాన్ జట్టు, అభిమానులు సంబరాల్లో ఉన్నారు. మరో వైపు ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన 40 ఏళ్ల సంతోష్ కుమార్ మైదానం బయటికి వెళ్లి ‘తన ఆటోలో’ బయల్దేరాడు. అయితే అతనేమీ ప్యాసింజర్ కాదు! అదే అతని బతుకు తెరువు. ఆటోడ్రైవర్‌గా వచ్చే సంపాదనతోనే సంతోష్ జీవితం గడుస్తుంది.
భారత్‌నుంచి ‘ఫిఫా’ అధికారిక గుర్తింపు పొందిన ఆరుగురు రిఫరీలలో అతను ఒకడు. ‘ఆదాయం విషయంలో మాత్రం ఫుట్‌బాల్‌ను నమ్ముకోలేం. అయితే ఎంత పెద్ద టోర్నీ అయినా ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహకం ఉంటే, రిఫరీలకు మెమెంటో మాత్రం దక్కుతుంది. కాబట్టి నా భుక్తి కోసం తెలిసిన పని డ్రైవింగ్‌ను చేపట్టాను’ అని అతను చెప్పాడు. 20 ఏళ్లకు పైగా రిఫరీగా ఉన్న, అతను 45 ఏళ్ల వయసు వస్తే ఆ అర్హత కోల్పోతాడు. ఎంతో మంది సిఫారసుల తర్వాత కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్‌లో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ మాట నిలబెట్టుకోలేదని, ఉద్యోగం వస్తే ఆటో వదిలేస్తానని సంతోష్ చెబుతున్నాడు.