పతకాల పంట | Medal harvest | Sakshi
Sakshi News home page

పతకాల పంట

Published Sun, Sep 28 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM

Medal harvest

ఎనిమిదో రోజు భారత్ ఖాతాలో 11 పతకాలు
 
 వారం రోజుల నిరీక్షణ ఫలించింది. తొలి రోజు ఏకైక స్వర్ణం తర్వాత ఆరు రోజుల పాటు కంచు మోతలో వినిపించకుండా పోయిన ‘కనకం'... ఎట్టకేలకు ఘనంగా మోగింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత అథ్లెట్లు ఆసియా క్రీడల్లో శనివారం పసిడి వెలుగులు నింపారు. పురుషుల కాంపౌండ్ ఆర్చరీ, స్క్వాష్ జట్లు స్వర్ణాలు సాధించి భారత శిబిరంలో ఉత్సాహాన్ని పెంచాయి. క్రీడాకారుల నిలకడకు ఈ రెండు ఈవెంట్లలో రెండు రజతాలు కూడా తోడయ్యాయి. అథ్లెటిక్స్ తొలి రోజు భారత్ ఖాతాలో ఓ రజతం ఓ కాంస్యం చేరాయి. వీటితో పాటు అన్ని క్రీడల్లో కలిపి మరో ఐదు కాంస్యాలు సాధించడంతో... ఇంచియాన్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.
 
 స్క్వాష్


 గతంతో ఎన్నడూ లేనన్ని పతకాలు సాధించి భారత ఆటగాళ్లు కొత్త చరిత్ర సృష్టించారు. పురుషుల టీమ్ స్వర్ణం గెలుచుకోగా, మహిళల జట్టు రజతం సాధించి ఔరా అనిపించింది. అంతకుముందు వ్యక్తిగత విభాగంలో సౌరవ్ ఘోషాల్ రజతం, దీపికా పల్లికల్ కాంస్యం సాధించారు. ఓవరాల్‌గా భారత స్క్వాష్ చరిత్రలో నాలుగు పతకాలు (1 స్వర్ణం+2 రజతాలు+1 కాంస్యం) లభించడం ఇదే మొదటిసారి.  
     పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ 2-0తో మలేసియాపై గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. తొలి సింగిల్స్‌లో హరీందర్ పాల్ సంధూ 3-1తో మహ్మద్ ఇస్కందర్‌పై; రెండో సింగిల్స్‌లో సౌరవ్ ఘోషాల్ 3-2తో ఆంగ్ బెంగ్ హీపై నెగ్గారు. వరుసగా రెండు సింగిల్స్ గెలవడంతో మహేశ్ మంగోన్కర్‌కు మూడో సింగిల్స్ ఆడాల్సిన అవసరం లేదు.


     మహిళల ఫైనల్లో భారత్ 0-2తో మలేసియా చేతిలో ఓడి రెండో స్థానంతో సంతృప్తిపడింది. తొలి సింగిల్స్‌లో అనక అలంకమోని 0-3తో ఆర్నాల్డ్ డెలియా చేతిలో; రెండో సింగిల్స్‌లో దీపికా పల్లికల్ 0-3తో నికోల్ డేవిడ్ చేతిలో ఓడారు. దీంతో రెండు మ్యాచ్‌ల ఫలితాలు మలేసియాకు అనుకూలంగా రావడంతో జోష్న చిన్నప్ప మూడో సింగిల్స్ ఆడలేదు.
 

 


 షూటింగ్
 రోజురోజుకూ షూటర్ల బుల్లెట్ పదును పెరుగుతోంది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో చైన్ సింగ్ 441.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు.
     క్వాలిఫయింగ్‌లో సంజీవ్ రాజ్‌పుత్ (1159), గగన్ నారంగ్ (1157) వరుసగా 12, 15వ స్థానాల్లో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు.  
     50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ టీమ్ విభాగంలో భారత్‌కు ఒక్క పాయింట్ తేడాతో కాంస్యం చేజారింది. భారత్ 3480 పాయింట్లు చేయగా, కాంస్యం నెగ్గిన జపాన్ 3481 పాయింట్లు స్కోరు చేసింది.


 
ఆర్చరీ
భారత విలుకాండ్ల గురి అదిరింది. ఒక్క రోజే ఓ స్వర్ణంతో కలిపి మూడు పతకాలు గెలిచి సత్తా చాటారు.
     పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, సందీప్ కుమార్‌ల త్రయం 227-225తో కొరియాపై నెగ్గి ‘పసిడి’ పతకాన్ని సొంతం చేసుకుంది.  ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టిన తొలిసారే భారత్ స్వర్ణం గెలవడం విశేషం.
     కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ రజతంతో సంతృప్తిపడ్డాడు. ఫైనల్లో అభిషేక్ 141-145తో ఇస్మాయిల్ బాది (ఇరాన్) చేతిలో ఓడాడు.


     మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో త్రిషా దేబ్, పూర్వాషా షిండే, జ్యోతి సురేఖల బృందం 224-217తో ఇరాన్‌పై నెగ్గి కాంస్యం కైవసం చేసుకుంది.
     కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో త్రిషా దేబ్ 138-134తో హుయాంగ్ జో (దక్షిణ కొరియా)పై నెగ్గి కాంస్యాన్ని గెలుచుకుంది.
     చివరి బాణం వరకు భారత ఆర్చర్ వెనుకబడి ఉన్నా.. ఐదో, ఫైనల్ రౌండ్‌లో హుయాంగ్ నిరాశపర్చడం త్రిషకు కలిసొచ్చింది.

 


 అథ్లెటిక్స్
 తొలి రోజు భారత అథ్లెట్లు జోరు కనబర్చారు. ఓ రజతం, కాంస్యంతో మహిళలు మెరిశారు.
     మహిళల 3 వేల మీటర్ల స్టీపుల్ చేజ్‌లో లలిత శివాజీ బబర్ 9:35.37 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది. సుధా సింగ్ 9:35.64 సెకన్లతో మూడో స్థానంతో కాంస్యం చేజిక్కించుకుంది. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఈ పోటీలో మొదట లలితకు కాంస్యం లభించగా, సుధా సింగ్ నాలుగో స్థానంతో సంతృప్తిపడింది. అయితే స్వర్ణం సాధించిన రూత్ జిబెట్ (బహ్రెయిన్) ఆఖరి ల్యాప్‌లో పొరపాటుగా ట్రాక్ లోపల స్టెప్ వేసింది. దీనిపై భారత్ ఫిర్యాదు చేయగా ఆమెపై అనర్హత వేటు పడింది. పతకం అందుకోవడానికి సమాయత్తం అవుతున్న సమయంలో రూత్‌పై వేటు వేసిన సంగతిని స్టేడియంలోని పబ్లిక్ సిస్టమ్‌లో ప్రకటించారు. దీంతో లలిత రెండు, సుధా మూడో స్థానంలో నిలిచి పతకాలు అందుకున్నారు.
     మహిళల 10 వేల మీటర్ల ఫైనల్లో గత ఏడాది స్వర్ణం సాధించిన ప్రీజా శ్రీధరన్ ఈసారి ఏడో స్థానంలో నిలిచి నిరాశపర్చింది.
 
 రెజ్లింగ్
 భారత మహిళా రెజ్లర్ల పట్టు అదిరింది.
  ఫ్రీస్టయిల్ 48 కేజీల విభాగం కాంస్య పతక పోరులో వినేష్ 4-0 తేడాతో నరంగెరెల్ ఎర్డెనెసుఖ్ (మంగోలియా)పై గెలిచింది.   అంతకుముందు సెమీఫైనల్లో వినేష్ 1-3 తేడాతో ఎరి టొసాకా (జపాన్) చేతిలో ఓడింది.  
     {ఫీస్టయిల్ 63 కేజీల విభాగం కాంస్య పోరులో గీతిక జఖార్ 5-0తో తీ హియాన్ లీ (వియత్నాం)పై నెగ్గింది.  సెమీఫైనల్లో గీతిక 0-5తో జువోమా జిలూ (చైనా) చేతిలో పరాజయం పాలైంది.
 
 బాక్సింగ్

 మహిళల ఫ్లయ్ వెయిట్ (48-51 కేజీ) విభాగంలో మేరీ కోమ్ క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో తను 3-0 తేడాతో యేజి కిమ్ (దక్షిణ కొరియా)ను ఓడించింది.
  లైట్ వెయిట్ (57-60 కేజీ) ప్రిక్వార్టర్స్‌లో సరితా దేవి 3-0తో చుంగ్సన్ రి (ఉ.కొరియా)ని ఓడించి క్వార్టర్స్‌కు చేరింది.  మిడిల్ వెయిట్ (69-75 కేజీ) ప్రిక్వార్టర్స్‌లో పూజా రాణి 3-0తో ఉండ్రామ్ ఎర్డెనెసోయోల్ (మంగోలియా)ను ఓడించింది.
  పురుషుల ఫ్లయ్ వెయిట్ (52 కేజీ)లో గౌరవ్ బిధురి 3-0తో ప్రేమ్ చౌధరి (నేపాల్)ను ఓడించి క్వార్టర్స్ చేరాడు.
     పురుషుల వెల్టర్ వెయిట్ (69 కేజీ) మన్‌దీప్ జాంగ్రా 2-1 తేడాతో వీ లియూ (చైనా)పై నెగ్గి క్వార్టర్స్ చేరాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement