మరో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ముగిసింది. ఆశల పల్లకి మోస్తూ బరిలోకి దిగిన భారత బృందం రిక్తహస్తాలతో వెనుదిరిగి వచ్చింది. చిన్నాచితక దేశాలూ పతకాలు కొల్లగొడుతున్న వేళ భారత్ మాత్రం నిరాశపరుస్తోంది. కారణాలు ఏమైనా... మనోళ్లు ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్, గ్రాండ్‌ప్రి సిరీస్‌లలోనే మెరిపిస్తారని... అందరి దృష్టి కేంద్రీకృతమయ్యే విశ్వ వేదికలపై మాత్రం తడబడతారని మరోసారి తేటతెల్లం అయ్యింది.
సాక్షి క్రీడా విభాగం
పదహారేళ్ల క్రితం అంజూ బాబీ జార్జి మహిళల లాంగ్‌జంప్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత పలువురు భారత క్రీడాకారులు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్స్ వరకు వెళ్లినా పోడియంపై మాత్రం స్థానం సంపాదించలేకపోతున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు పాల్గొనే సన్నాహక టోర్నమెంట్‌లలో పతకాలు సాధించి ఆశలు రేకెత్తించి... తీరా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం చేతులెత్తుస్తున్నారు. ఒత్తిడికి తలవంచుతారో... పోటీతత్వానికి తట్టుకోలేకపోతారోగానీ కొందరు అగ్రశ్రేణి అథ్లెట్స్ సీజన్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోతారు.
మూడు ఈవెంట్స్‌లో ఫైనల్స్ చేరడం... రెండు ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకోవడం మినహా ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విశేషాలు లేవు. మహిళల జావెలిన్ త్రోలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అన్ను రాణి గుర్తింపు పొందడం... 4్ఠ400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో భారత బృందం ఫైనల్‌కు చేరడంతోపాటు ఒలింపిక్ బెర్త్ సాధించడం... పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో అవినాశ్ సాబ్లే మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు తన పేరిటే ఉన్న జాతీయ రికార్డులను సవరించడం, టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం మనకు కాస్త ఊరటనిచ్చాయి.
ఆసియా చాంపియన్‌షిప్‌లలో మెరిపించే భారత క్రీడాకారులు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్–5లో కూడా ఉండటం లేదు. పురుషుల షాట్‌పుట్ విభాగంలో ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్ అయిన తజీందర్ పాల్ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ హీట్స్‌లోనే ఇంటిదారి పట్టింది. 4్ఠ400 మీటర్ల పురుషుల, మహిళల విభాగం రిలేల్లోనూ భారత బృందాలు నిరాశ పరిచాయి.
అమెరికా అదుర్స్...
మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్న అమెరికా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 14 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 29 పతకాలను గెల్చుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్‌లో నమోదైన మూడు ప్రపంచ రికార్డులు అమెరికా అథ్లెట్స్ సాధించడం విశేషం. మహిళల 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో దలీలా మొహమ్మద్ 52.16 సెకన్లలో గమ్యానికి చేరి 52.20 సెకన్లతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. టైరెల్ రిచర్డ్, జెస్సికా బియర్డ్, జాస్మిన్ బ్లాకర్, ఒబి ఇగ్‌బోక్విలతో కూడిన అమెరికా మిక్స్‌డ్ రిలే బృందం 4్ఠ400 హీట్స్‌లో 3ని:12.42 సెకన్లతో ప్రపంచ రికార్డును సృష్టించగా... ఫైనల్లో పోటీపడిన అలీసన్ ఫెలిక్స్, విల్బెర్ట్, కొట్నీ ఒకోలో, మైకేల్ చెర్రీలతో కూడిన అమెరికా మిక్స్‌డ్ రిలే బృందం 3ని:09.34 సెకన్లతో హీట్స్‌లో తమ సహచర బృందం నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.
ఆఫ్రికా ఆకట్టుకుంది....
అమెరికాకు ఎదురులేకున్నా... ఆఫ్రికా దేశాల అథ్లెట్స్ కూడా ఈసారీ తమ సత్తాను చాటుకున్నారు. పతకాల పట్టికలో టాప్–10లో మూడు ఆఫ్రికా దేశాలు ఉండటం విశేషం. కెన్యా 5 స్వర్ణాలు, 2 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 11 పతకాలతో రెండో స్థానం సాధించడం గమనార్హం. ఇథియోపియా 2 స్వర్ణాలు, 2 రజతాలు, ఒక కాంస్యంతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఉగాండా రెండు స్వర్ణాలతో పదో స్థానంలో నిలిచింది.
అమ్మలు అదరగొట్టారు...
తల్లి హోదా వచ్చాక ఆటకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని... పట్టుదలతో కృషి చేస్తే అద్భుతాలు చేయవచ్చని ఈ మెగా ఈవెంట్‌లో స్టార్ అథ్లెట్స్ నియా అలీ, షెల్లీ యాన్ ఫ్రేజర్, అలీసన్ ఫెలిక్స్ (అమెరికా) నిరూపించారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఇద్దరు పిల్లల తల్లి అయిన నియా అలీ (అమెరికా)... 100 మీటర్ల విభాగంలో జమైకా స్టార్ షెల్లీ యాన్ ఫ్రేజర్... 4్ఠ400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో అలీసన్ ఫెలిక్స్ స్వర్ణాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. మిక్స్‌డ్ రిలేలో స్వర్ణం సాధించిన క్రమంలో అలీసన్ ఫెలిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యధికంగా 11 స్వర్ణాలతో ఉసేన్ బోల్ట్ (జమైకా) పేరిట ఉన్న రికార్డును 12వ పసిడి పతకంతో సవరించింది.
నియా అలీ
షెల్లీ
ఫెలిక్స్
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన
మహిళల విభాగం
100 మీటర్లు: ద్యుతీ చంద్ (11.48 సెకన్లతో తన హీట్స్‌లో ఏడో స్థానం. ఓవరాల్‌గా 47 మందిలో 37వ స్థానం).
200 మీటర్లు: అర్చన (23.65 సెకన్లతో తన హీట్స్‌లో ఎనిమిదో స్థానం. ఓవరాల్‌గా 43 మందిలో 40వ స్థానం)
400 మీటర్లు: అంజలి దేవి (52.33 సెకన్లతో తన హీట్స్‌లో ఆరో స్థానం. ఓవరాల్‌గా 47 మందిలో 37వ స్థానం).
1500 మీటర్లు: చిత్రా ఉన్నికృష్ణన్ (4ని:11.10 సెకన్లతో తన హీట్స్‌లో ఎనిమిదో స్థానం. ఓవరాల్‌గా 35 మందిలో 30వ స్థానం).
జావెలిన్ త్రో: అన్ను రాణి (క్వాలిఫయింగ్‌లో 62.43 మీటర్లతో గ్రూప్ ‘ఎ’లో మూడో స్థానం. ఓవరాల్‌గా ఐదో స్థానం. 12 మంది పాల్గొన్న ఫైనల్లో 61.12 మీటర్లతో ఎనిమిదో స్థానం).
4x400 మీటర్ల రిలే: (జిస్నా మాథ్యూ, పూవమ్మ రాజు, విస్మయ, శుభాలతో కూడిన బృందం 3ని:29.42 సెకన్లతో హీట్స్‌లో ఆరో స్థానం)
పురుషుల విభాగం
400 మీటర్ల హర్డిల్స్: జబీర్ మదారి (49.62 సెకన్లతో తన హీట్స్‌లో మూడో స్థానంలో నిలిచి సెమీఫైనల్ చేరాడు. అనంతరం మూడో సెమీఫైనల్లో 49.71 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయాడు); ధరుణ్ అయ్యసామి (50.55 సెకన్లతో తన హీట్స్‌లో ఆరో స్థానం).
1500 మీటర్లు: జిన్సన్ జాన్సన్ (3ని:39.86 సెకన్లతో తన హీట్స్‌లో పదో స్థానం. ఓవరాల్‌గా 43 మందిలో 34వ స్థానం)
3000 మీటర్ల స్టీపుల్‌చేజ్: అవినాశ్ సాబ్లే (హీట్స్‌లో 8ని:25.23 సెకన్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ చేరిక. 15 మంది పాల్గొన్న ఫైనల్లో 8ని:21.37 సెకన్లతో 13వ స్థానం)
4x400 మీటర్ల రిలే: (జాకబ్, అనస్, జీవన్, నోవా నిర్మల్‌లతో కూడిన భారత బృందం తమ హీట్స్‌లో 3ని:03.09 సెకన్లతో ఏడో స్థానం)
20 కిలోమీటర్ల నడక: ఇర్ఫాన్ (గంటా 35ని.12 సెకన్లతో 27వ స్థానం); దేవేందర్ సింగ్ (గంటా 41ని.48 సెకన్లతో 36వ స్థానం).
మారథాన్: గోపీ (2గం:15ని.57 సెకన్లతో 21వ స్థానం)
లాంగ్‌జంప్: శ్రీశంకర్ (14 మంది పోటీపడిన క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’లో 7.62 మీటర్లతో 12వ స్థానం).
జావెలిన్ త్రో: శివపాల్ సింగ్ (16 మంది పోటీపడిన క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎ’లో 78.97 మీటర్లతో పదో స్థానం. ఓవరాల్‌గా 30 మందిలో 24వ స్థానం)
షాట్‌పుట్: తజీందర్ సింగ్ (18 మంది పోటీపడిన క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’లో 20.43 మీటర్లతో ఎనిమిదో స్థానం)
4x400 మిక్స్‌డ్ రిలే: (అనస్, నోవా, జిస్నా, విస్మయలతో కూడిన భారత బృందం హీట్స్‌లో 3ని:16.14 సెకన్లతో మూడో స్థానం. ఎనిమిది జట్లు పాల్గొన్న ఫైనల్లో 3ని:15.77 సెకన్లతో ఏడో స్థానం)
కనీసం ఒక పతకమైనా సాధించిన దేశాల సంఖ్య:43
ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనీసం ఒక స్వర్ణమైనా సాధించిన దేశాల సంఖ్య:20
పురుషుల 4x400 మీటర్ల హీట్స్‌లో భారత అథ్లెట్స్
అదే కథ... అదే వ్యథ!
Published Tue, Oct 8 2019 3:55 AM | Last Updated on Tue, Oct 8 2019 5:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment