Men And Women
-
సంతాన లేమి : అవే కొంప ముంచుతున్నాయి!
వంధ్యత్వం లేదా ఇన్ఫెర్టిలిటీ అనేది ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య. గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఏడు జంటలలో ఒకరిని ప్రభావితం చేస్తోంది దక్షిణ , మధ్య ఆసియా, సబ్-సహారా ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో అత్యధిక ఈ సమస్య కనిపిస్తోంది. పురుషుల్లో వాయు కాలుష్యం, మహిళల్లో రోడ్డు ట్రాఫిక్ శబ్దం కారణంగా వంధ్యత్యం వేధిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. నార్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు బీఎంజే జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి.డెన్మార్క్‌లోని నోర్డ్ అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం పాటు ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (PM 2.5) వాయు కాలుష్యాన్ని గురైన పురుషుల్లో సంతాన లేమి ఏర్పడే ముప్పు అధికంగా ఉందని పేర్కొంది. పీఎం 2.5 పురుషులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. దీనికి ఎక్కువ ఎక్స్పోజ్ కావడంతో పురుషులలో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదేవిధంగా, శబ్ద కాలుష్యం మహిళల్లో అధిక వంధ్యత్వానికి దారితీస్తోంది. సగటు కంటే 10.2 డెసిబుల్స్ ఎక్కువగా ఉండే రోడ్డు ట్రాఫిక్ శబ్దం 35 ఏళ్లు పైబడిన మహిళల్లో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనం కనుగొంది. 2000-2017 మధ్య డెన్మార్క్‌లో 30-45 ఏళ్ల వయసున్న 5,26,056 మందిపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. పీఎం 2.5కి ఐదేళ్లకు పైన గురైన 30-45 ఏళ్ల వయసున్న వారిలో వంధ్యత్య ముప్పు 24 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనం వివరించింది. -
భారతీయుల్లో సగంమంది అన్‌ఫిట్టే! 60 ఏళ్లు పైబడినవారు బెటర్!
మన దేశంలో దాదాపు సగంమంది ఫిజికల్‌గా ఫిట్‌గా లేరట. భారతీయుల్లో 50 శాతం మంది శారీర శ్రమ అన్న ఊసే ఎత్తడం లేదని తేలింది. గ్లోబల్ హెల్త్ జర్నల్ లాన్సెట్ నిర్వహించిన స్టడీలో ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 2022లో భారతదేశంలోని దాదాపు 50శాతం మంది తగినంత వ్యాయామం చేయడం లేదు. కనీసం వారానికి 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదని తేలింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సూచనల ప్రకారం, పద్దెనిమిదేళ్లు పైబడిన వారు(అడల్ట్స్) వారానికి 150 నిమిషాలు మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్యాక్టివిటీ చేయాలి. దీన్ని ఆధారంగా చేసుకుని 2000-2022 మధ్యకాలంలో 197 దేశాల్లో లాన్సెట్ సర్వే చేసింది. దక్షిణాసియా ప్రాంతంలో మహిళల్లో తగినంత శారీరక శ్రమ లేకపోవడం పురుషుల కంటే సగటున 14శాతం ఎక్కువ. 42 శాతంగా పురుషులతో పోలిస్తే, తగిన శారీరక శ్రమ చేయని మహిళల సంఖ్య 57శాతంగా ఉంది.అంతేకాదు 2000 సంవత్సరంలో 22శాతం భారతీయులు శారీరంగా దృఢంగా ఉండగా, 2010 నాటికి ఇది 34 శాతానికి, 2022 నాటికి 50 శాతానికి పెరిగిందని తెలిపింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఇది 60 శాతం దాటుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న స్త్రీపురుషులిరువురిలోనూ శారీరక శ్రమ పెరగడం గమనార్హం.కాగా, ప్రపంచవ్యాప్తంగా 31.3 శాతం మంది పెద్దలు (18 ఏళ్లు పైబడిన వారు) ఫిజికల్లీ అన్ ఫిట్‌గా ఉన్నారని స్టడీలో తేలింది. ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్‌లో ఆసియా పసిఫిక్ రీజియన్, రెండో స్థానంలో దక్షిణాసియా ఉందని లాన్సెట్ పరిశోధకులువెల్లడించారు. -
మహిళ కనిపిస్తే.. వేధింపులేనా? మీరేం మనుష్యులు
మహిళలకు సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని సోషల్‌మీడియాలో ప్రస్తావించారు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల. ఆయన ట్విట్టర్ వేదికగా రాసిన పోస్టు యథాతధంగా.. నేను వైద్యం చేసిన ఎంతోమంది ఆడవాళ్లు (వయసు నిమిత్తం లేకుండా), నా స్నేహితురాళ్ల అనుభవాలు ఇవి. ఈ దురదృష్ట అనుభవాలు అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ మనదేశంలో బాగా ఎక్కువ. ఏమిటివి? వీధుల్లో, బస్సుల్లో,రైళ్లలో, ఇళ్లలో,ఆడుకునే స్థలాల్లో, పనిచేసే ప్రదేశాల్లో, గుళ్లలో సమయం సందర్భం ఏదైనాగానీ ఆడవాళ్ళ వెంటబడటం, తేరిపార చూడటం, సైగలు చెయ్యటం, ఫోటోలు తీయటం మాత్రమే కాకుండా కావాలని రాసుకుని వెళ్ళటం, ఇంకా మితిమీరి తాకటం, ముట్టటం, పట్టుకోవడం, కొట్టటం, హఠాత్తుగా మీద పడడం లాంటివి చేసి చాలా ఇబ్బంది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారు అన్నదానికి మానసిక శాస్త్ర పరంగా చాలా కారణాలున్నప్పటికీ ఇది చెడ్డ ప్రవర్తన. ఒకసారి చేసి పట్టుబడనప్పుడు వీళ్లలో ధైర్యం పెరిగి మళ్లీ మళ్లీ చేస్తూ, వారి చర్యల తీవ్రత కూడా పెరుగుతుంది. ముందు భయంతో చేసి, చేశాక ఆనందాన్ని పొందే వీళ్లు తర్వాత తర్వాత దాడికి గురైన ఆడవాళ్ల ముఖంలో ఉండే భయాన్ని, షాక్ ని చూసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. వీళ్లని నియంత్రించే ఒకే ఒక్క మార్గం ఎదిరించటం, పట్టుకుని ప్రశ్నించడం. అలా జరిగిన చాలా సందర్భాల్లో అందరూ కలిసి దేహశుద్ధి చేస్తారు. ఒకసారి పట్టుబడ్డాక చాలామంది మానేస్తారు కానీ కొంతమంది కొనసాగిస్తారు. వీళ్లని కఠినంగా శిక్షించటం ద్వారా ఈ నేరాల తీవ్రత కొంతవరకు తగ్గించవచ్చు. ఈమధ్య వచ్చే కొన్ని సినిమాలు కూడా ఇటువంటి ప్రవర్తనని ఎగదోస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. వాళ్లని చాలా బాధకి గురిచేస్తాయి. కోపం, దిగులు, బయటికెళ్లాలంటే భయం, వణుకు, నిస్సహాయత మొదలైన అనుభూతులకి గురవ్వటమే కాకుండా ఆత్మన్యూనత, తమనితాము నిందించుకోవడం, తమ వస్త్రాలంకరణని ప్రశ్నించుకోవడం, తోడు లేనిదే బయటికి వెళ్లకపోవడం చేస్తుంటారు. పైగా ఈబధని ఎవరితో చెప్పుకోలేక సతమతమౌతుంటారు. చెప్పినా కూడా కొన్నిసార్లు వీళ్లే నిందలకు గురవుతుంటారు. కొన్ని గుర్తుపెట్టుకోండి. 1. ఈ అనుభవాలు మీ ఒక్కరికే కాదు, దాదాపు అందరి ఆడవాళ్లలో ఉంటాయి. ఒకసారి మీ అమ్మాయి/సోదరి/భార్య/స్నేహితురాళ్లతో చర్చించండి. వారికి సాంత్వన చేకూర్చి ధైర్యాన్ని ఇచ్చినవాళ్లవుతారు. 2. తప్పు ఎప్పుడూ దాడి చేసినవాళ్లదే. మీరు ఒంటరిగా బయటికి వెళ్ళటం, మీ వస్త్రాలంకరణ, మీ మాటలు ఇవేవీ కూడా వారు మీతో అలా ప్రవర్తించడానికి పచ్చజెండా కాదు. 3. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగరూకతతో ఉండండి, ఎదుటివాళ్లపై అనుమానం ఉంచి వాళ్లు మిమ్మల్ని దరి చేరేటప్పుడు బ్యాగ్ ఒక చేతి నుంచి ఇంకో చేతికి మార్చటం, చేతులు విదల్చటం వంటి హఠాత్చర్యల వలన దాడిచేసేవాళ్లు దూరం జరుగుతారు. 4. దాడి జరిగినప్పుడు వెంటనే పట్టుకుని ప్రశ్నించండి. వాళ్లు హెడ్లైట్ల కింద దొరికిన కుందేలులా స్థాణువైపోతారు. 5. ఇటువంటి అనుభవాలు మిమ్మల్ని తీవ్ర మానసిక ఇబ్బందికి గురిచేసినా లేక మీ లైంగిక జీవితాన్ని అస్తవ్యస్తం చేసినా మానసిక నిపుణుల్ని కలవండి. డాక్టర్ శ్రీకాంత్ మిరియాల -
సమ గౌరవమే సరైన రక్ష
కుటుంబంలో ఆమె సమాన భాగస్వామి. పని ప్రదేశంలో ఆమె సమాన సహోద్యోగి. సమాజంలో ఆమె సమాన పౌరురాలు. అవకాశాలలో.. అధికారంలో.. అంతరిక్షంలో అన్నింటా ఆమెకు సమాన హక్కు ఉంది. పురుషులు గ్రహించ వలసింది ఇదే రక్షా బంధన్ సందర్భంలో. స్త్రీకి సాటి పురుషుల నుంచి ‘రక్ష’ ఇచ్చే బదులు అందరు పురుషులు స్త్రీల సమస్థానాన్ని స్వీకరిస్తే చాలు. అన్న స్థానం మంచిదే. సమ స్థానం గొప్పది. పురాణాల్లో ద్రౌపదికి కృష్ణుడు అన్నగా కనిపిస్తాడు. ద్రౌపదికి రక్షగా ఆయన నిలిచిన ఉదంతాలు అందరికీ తెలుసు. కౌరవసభలో జూదంలో ఓడిపోయిన పాండవులను మరింత అవమానించడానికి ద్రౌపది వస్త్రాపహరణానికి పురిగొల్పుతాడు దుర్యోధనుడు. దుశ్శాసనుడు అందుకు పూనుకుంటాడు. నిండు సభలో స్త్రీకి... ఒక రకంగా ఇంటి కోడలికి అవమానం జరగబోతుంది. ఆ సమయంలో ఒక అన్నగా ప్రత్యక్షమయ్యి ఆమెకు రక్షగా నిలుస్తాడు కృష్ణుడు. మగవారి గొడవలో స్త్రీలను లాగకూడదనే సంస్కారం కౌరవులకు ఉండి ఉంటే ద్రౌపదికి పరాభవం జరిగి ఉండేది కాదు. మగవారైన కౌరవుల నుంచి రక్షించడానికి మగవాడైన కృష్ణుడు ప్రత్యక్షం కావల్సిన అవసరమూ ఉండేది కాదు. అంటే? స్త్రీలను గౌరవించాలనే సంస్కారమే ప్రథమం. ఆ సంస్కారం ఉంటే స్త్రీలకు మగవారి నుంచి ఎటువంటి ఆపదా, ఇబ్బంది ఉండదు. వారికి రక్షగా నిలవాల్సిన అవసరమూ ఉండదు. చెల్లెలు బంగారు తల్లి. ఇంటి ఆడపిల్లంటే లక్ష్మి. తండ్రికి, అన్నకు, తమ్ముడికి కూడా ఆమె అంటే అంతులేని మమకారం. ఆమె పాదంలో ముల్లు దిగితే వారి కంట కన్నీరు పొంగుతుంది. ఆమె కోరింది ఇవ్వబుద్ధవుతుంది. ఆమెను ఇష్టాన్ని మన్నించాలనిపిస్తుంది. కాని ఇదంతా తమ ఇంటి ఆడపిల్ల విషయంలోనే. మరి పొరుగింటి, ఇరుగింటి, ఊళ్లో ఉన్న, ఆఫీసులో ఉన్న స్త్రీలు అందరూ ఇలా ప్రేమగా, ఆదరంగా చూడవలసిన వారే కదా. మన ఇంటి ఆడవాళ్లని మాత్రమే ఆదరంగా చూస్తాము ఇతర ఇళ్ల ఆడవాళ్లను చులకన చేస్తాము అనే భావన ఎందుకు? అలా ఎవరైనా తమ ఇంటి ఆడవాళ్లను చులకన చేస్తే ‘మేమున్నాం’ అని ఆ ఇంటి అన్నదమ్ములు ముందుకు రావడం ఎందుకు? అసలు ఒక స్త్రీని చులకన గా లేదా ఆధిపత్య భావనతో చూడవలసిన అవసరం ఏముంది? మీరు మేము రక్షగా నిలువదగ్గవారు అని చెప్పవలసిన అవసరం ఏమి? ‘భారతీయులందరూ సహోదరులు’ అని ప్రతిజ్ఞ చేసినట్టుగా ‘స్త్రీ పురుషులందరూ సమాన గౌరవానికి అర్హులు’ అని ప్రతిజ్ఞ చేసుకుంటే ‘రక్షాబంధనం’ అనే ‘రక్ష’కు గుర్తుగా కాక ఆత్మీయతకు, ఆదరణకు, అనురాగానికి, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ∙∙ ఆడపిల్ల చదువు విషయంలో, ఉద్యోగాన్ని ఎంచుకునే విషయంలో, జీవిత భాగస్వామిని కోరుకునే విషయంలో, ఆస్తి పంపకాలలో, ఇంటికి సంబంధించిన నిర్ణయాలను వ్యక్తం చేయడంలో ఎంత అవకాశం ఇస్తున్నారో ఎవరికి వారు చూసుకోవాలి. కావలసిన బట్టలు, నగలు కొనిపెట్టడమే అనురాగం, ఆత్మీయత కాదు. వారి ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిత్వానికి చోటు కల్పించాలి. స్వయం సమృద్ధితో జీవితాన్ని నిర్మించుకునే శక్తి, స్వేచ్ఛ పొందేందుకు అడ్డు లేకుండా ఉండాలి. మద్దతుగా నిలవాలి. అది ఇంటికి సంబంధించినంత వరకూ సరైన రక్షా బంధనం అంటే. ఇక పని ప్రదేశాలలో మహిళా ఉద్యోగినుల ప్రతిభను గౌరవించాలి. వారికి ‘బాస్’లుగా ఎదిగే సామర్థ్యం ఉంటే వారి దగ్గర పని చేయడం ఇతర పురుష బాస్‌ల వద్ద పని చేయడంతో సమానంగానే భావించాలి. వారు ఇంటిని, పిల్లలను చూసుకుంటూ ఉద్యోగంలో కూడా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి అనుక్షణం గుర్తుంచుకోవాలి. పురుషుడు కేవలం ఉద్యోగం చేస్తే సరిపోతుంది. ఉద్యోగం చేయాలనుకునే స్త్రీ ఇల్లు కూడా చూసుకోవాలి. కనుక ఆఫీసులో వారే ఎక్కువ సమానం అవుతారు కాని తక్కువ సమానం కాదు. పురుష ఉద్యోగులతో పరస్పర సహకారం అందిస్తూ ఎలా పని చేస్తారో మహిళా ఉద్యోగులతో కూడా పరస్పర సహకారం అందిస్తూ పని చేస్తే అదే ఆఫీసు వరకు నిజమైన రక్షాబంధనం. సమాజంలో అనేక దొంతరల్లో ఇవాళ స్త్రీలు వికాస పథంలో పని చేస్తున్నారు. పురుషులకు అట్టి వారిని చూసినప్పుడు ప్రధానంగా ప్రశంసాపూర్వకంగా చూడాలి. నాయకులు, ఆటగాళ్ళు, కళాకారులు, అధికారులు అనంటే పురుషుల మాత్రమే కాదని, స్త్రీలు కూడా అని గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా ఇవాళ స్త్రీలే ఫోర్బ్స్‌కు ఎక్కుతున్నారని గ్రహిస్తే వారిని స్ఫూర్తిగా తీసుకుని మన ఇంటి అమ్మాయికి వారిని ఆదర్శం చేయడమే సమాజానికి సంబంధించినంత వరకూ సరైన రక్షా బంధనం. పులితో పోరాడిన స్త్రీలు, బిడ్డను నడుముకు కట్టుకుని శత్రువులతో పోరాడిన స్త్రీలు మన దగ్గర కొదవ కాదు. వారు పరాక్రమవంతులు. వారే ఎవరికైనా రక్షగా నిలువగలరు. తమను తాము రక్షించుకోగలరు. వారు కోరేదల్లా తమ దారిన తాము నడవనివ్వమని. తమ ఎంపికల పట్ల ప్రజాస్వామికంగా ఉండమని. బాధ్యతల బంధాల బట్వాడాలో సమన్యాయం పాటించమని. తమను గౌరవిస్తూ తమ గౌరవం పొందే విధంగా పురుషులు ఉండాలని. తల్లీతండ్రి, భార్యా భర్త, అక్కా తమ్ముడు, స్త్రీ పురుషుడు, యువతీ యువకుడు... జీవన– సామాజిక చక్రాలలో స్త్రీలు పురుషులకు రక్షగా పురుషులు స్త్రీలకు రక్షగా సందర్భాన్ని బట్టి మారాల్సి ఉంటుంది. ఆ సందర్భాలను గుర్తించమని చెప్పేదే నిజమైన రక్షాబంధనం. ‘భారతీయులందరూ సహోదరులు’ అని ప్రతిజ్ఞ చేసినట్టుగా ‘స్త్రీ పురుషులందరూ సమాన గౌరవానికి అర్హులు’ అని ప్రతిజ్ఞ చేసుకుంటే ‘రక్షాబంధనం’ అనే ‘రక్ష’కు గుర్తుగా కాక ఆత్మీయతకు, ఆదరణకు, అనురాగానికి, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. -
పెరుగుతున్న ఆయుష్షు
సాక్షి, అమరావతి: మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తుండటంతో దేశంలోను, రాష్ట్రంలోను ప్రజల జీవిత కాలం పెరుగుతోంది. ప్రధానంగా పురుషుల కన్నా స్త్రీల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుందని జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక పేర్కొంది. 2031–35 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, స్త్రీ, పురుషుల ఆయర్దాయంపై నివేదికను రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మగవాళ్ల కన్నా ఆడవాళ్ల ఆయుర్దాయం నాలుగేళ్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. రాష్ట్రంలో 2011–15 మధ్య మహిళల ఆయుర్దాయం 71.2 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 75.6 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో పురుషుల ఆయుర్దాయం 2011–15 మధ్య 67.1 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 71.4 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా వేశారు. అంటే పురుషులకంటే స్త్రీల ఆయుర్దాయం నాలుగేళ్లు ఎక్కువ ఉంటుందని నివేదిక వెల్లడిస్తోంది. దేశంలో 2011–15 మధ్య స్త్రీల ఆయుర్దాయం 70 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 74.7 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా. పురుషుల ఆయుర్దాయం 2011–15 మధ్య 66.9 సంవత్సరాలుండగా 2031–35 మధ్య 71.2 సంవత్సరాలు ఉంటుందని అంచనా. దేశంలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక దేశం మొత్తంమీద కేరళ రాష్ట్రంలోనే పరుషులు, స్త్రీల ఆయుష్షు అత్యధికంగా ఉంటుందని అంచనా వేశారు. కేరళలో మహిళల ఆయుర్దాయం 2031–35 మధ్య 80.2 సంవత్సరాలు, పురుషుల ఆయుర్దాయం 74.5 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా వేశారు. ఉత్తరప్రదేశ్‌లో పురుషుల, స్త్రీల ఆయుర్దాయం అత్యల్పంగా ఉంటుందని అంచనా. ఉత్తరప్రదేశ్‌లో 2031–35 మధ్య పురుషుల ఆయుర్దాయం 69.4 సంవత్సరాలు, మహిళల ఆయుర్దాయం 71.8 సంవత్సరాలు ఉంటుందని అంచనా. దేశంలో ఏటేటా పురుషులు, స్త్రీల ఆయుష్షు పెరుగుతుందని నివేదిక తెలిపింది. పెరుగుతున్న వృద్ధులు అన్ని రాష్ట్రాల్లో ఆయుర్దాయం పెరుగుతుండటంతో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. దేశంలో సంతానోత్పత్తి క్షీణించడంతో పాటు జనం ఆయుర్దాయం పెరుగుతుండటం దీనికి కారణమని వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం జనాభాలో వృద్ధుల వాటా 8.4 శాతం ఉంది. 2031–35 మధ్య వృద్ధుల సంఖ్య రెండింతలు పెరిగి 14.9 శాతానికి చేరుతుందని నివేదిక అంచనా వేసింది. -
మనుషులిద్దరు... గుండెచప్పుడు ఒకటే
భార్యాభర్తల బంధమంటే... ఇద్దరు మనుషులు ఒక జీవితమని తెలుసు. కానీ ఇద్దరు మనుషులు.. ఒకటే గుండె చప్పుడని ఇప్పుడు రుజువైంది. ఇష్టమైన వాళ్లు దగ్గరగా వస్తే గుండె వేగంగా కొట్టుకోవడం చాలా సినిమాల్లో కనిపించే సీన్. ఎక్కువకాలం బంధంలో ఉన్న స్త్రీ, పురుషుల గుండె చప్పుడు కూడా ఒకటే అవుతోందని ఇలినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ప్రొఫెసర్ ఓగోస్కీ నేతృత్వంలో జరిగిన ఈ పరశోధనా ఫలితాలు ఇటీవల ‘సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్స్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఎక్కువకాలం రిలేషన్లో ఉన్న కొన్ని జంటలను తీసుకుని.. వాళ్ల మధ్య దూరం, వారిద్దరి గుండె చప్పుడును లెక్కించారు. 64 నుంచి 88 మధ్య వయసుండి... 14 నుంచి 65 ఏళ్లపాటు రిలేషన్షిప్లో ఉన్న పది జంటలను పరిశోధకులు రెండు వారాలపాటు పరీక్షించారు. ‘‘దూరంగా ఉన్నప్పుడు ఒకలా ఉన్న గుండెకొట్టకునే తీరు... ఇద్దరూ సమీపంలోకి వచ్చినప్పుడు క్రమంగా ఒక్కటి అవుతోంది. అంటే ఇద్దరూ దగ్గరగా ఉన్నప్పుడు ఒకరి గుండె మరొకరి గుండెను ప్రభావితం చేస్తోంది. ఒకసారి భార్య గుండె భర్త గుండెపై ఎఫెక్ట్ చూపిస్తే... మరోసారి భర్త గుండె భార్య గుండెను ప్రభావితం చేస్తోంది. ముప్ఫై, నలభై ఏళ్లు కలిసి జీవించిన జంటల హృదయం సైతం ఒకరికోసం ఒకరు అన్న అంకితభావంతో పనిచేస్తోంది’’అని ఒగోస్కీ చెప్పారు. -సాక్షి సెంట్రల్ డెస్క్ -
తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది!
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అందరూ భయపడుతున్న విధంగానే మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే కో-ఎడ్యుకేషన్‌ను రద్దు చేస్తూ తొలి ఫత్వా జారీ చేశారు. తమ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యానికి తావేలేదని, అంతా షరియత్ చట్టాల ప్రకారమేనని ఇప్పటికే కరాఖండిగా తేల్చి చెప్పిన తాలిబన్లు ఆవైపుగానే నిర్ణయాలను తీసుకుంటున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కో-ఎడ్యుకేషన్ విధానాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేసిన కొన్ని రోజులకే తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. తాలిబన్ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఆడ, మగ పిల్లలు కలిసి చదువు కోవడాన్ని నిషేధించారు. అంతేకాదు ‘సమాజంలోని అన్ని దుర్మార్గాలకు అదే మూలం' అని వర్ణించడం గమనార్హం. చదవండి : తాలిబన్ల చెరలో అఫ్గన్: హృదయ విదారక ఫోటోలు వైరల్ వర్సిటీ ప్రొఫెసర్లు, ప్రైవేట్ సంస్థల యజమానులు తాలిబన్ అధికారుల మధ్య సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖామా ప్రెస్ న్యూస్ ఏజెన్సీ శనివారం నివేదించింది. అఫ్గాన్ ఉన్నత విద్యకు చెందిన తాలిబన్ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడు గంటలపాటు ఈ సమావేశాన్ని నిర్వహించారు. కో-ఎడ్యుకేషన్‌ను నిలిపివేయాల్సిందేనని, వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. అలాగే మహిళా లెక్చరర్లు కేవలం మహిళా విద్యార్థులకు మాత్రమే బోధించడానికి అనుమతి ఉంటుంది తప్ప, పురుషులకు బోధించే అవకాశం ఉండదని కూడా వెల్లడించారు. చదవండి : Afghanistan: తాలిబన్ల సంచలన ప్రకటన కాగా గత రెండు దశాబ్దాలలో, అఫ్గాన్‌లోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఇనిస్టిట్యూట్లలో కో-ఎడ్యుకేషన్, జెండర్ బేస్డ్ ప్రత్యేక తరగతుల మిశ్రమ వ్యవస్థను అమలు చేసింది. అధికారిక అంచనాల ప్రకారం హెరాత్‌లో ప్రైవేట్, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 40వేలమంది విద్యార్థులు, 2వేల లెక్చరర్లు ఉన్నారు. చదవండి : Afghanistan: ఆమె భయపడినంతా అయింది! -
పగలు ఆడ.. రాత్రి మగ
టీ.నగర్(చెన్నై): కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఈ కోవలోనే మదురైలోని ఓ వ్యక్తి ఆరునెలలుగా ఆడవేషం ధరించి ఇళ్లలో పనులు చేస్తూ పొట్టనింపుకుంటున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఇతని సొంతవూరు శివగంగై జిల్లా మానామదురై. వయసు సుమారు 40 ఉంటుంది. తన ఊరిలో ఇతను లుంగీ, షర్టు ధరిస్తాడు. ప్రతిరోజూ ఊరి నుంచి మదురైకు వచ్చి రాజర్రోడ్డు తెప్పకుళం ప్రాంతంలో ఒక మరుగైన ప్రదేశం చేరుకుంటాడు. అక్కడ లుంగీ, షర్టు విప్పేసి చీర, జాకెట్, తలకు విగ్ ధరించి ఆడవేషంలో బయటికి వస్తాడు. ఆ ప్రాంతంలోని మూడు ఇళ్లకు వెళ్లి పాత్రలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు చేసి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చి తలపై విగ్ తొలగించి లుంగీ, షర్టుతో ఊరికి బయలుదేరుతాడు. రాజా.. రాజాత్తి అతను మగాడిగా వెళ్లి దుస్తులు మార్చుకుని ఆడదానిలా రావడాన్ని ఆ ప్రాంతానికి చెందిన కొందరు గమనించారు. దీంతో అతన్ని పట్టుకుని విచారణ జరిపారు. అందులో అతని అసలైన పేరు రాజాగా తెలిసింది. తాను పనిచేసే ఇళ్లలో తన పేరు రాజాత్తిగా చెప్పుకున్నట్లు తెలిపాడు. మానామదురైలో తనకు ఎలాంటి పని దొరకలేదని, వృద్ధులైన తల్లిదండ్రులను పోషించుకునేందుకు గత్యంతరం లేక ఆడవేషం వేసినట్లు తెలిపాడు. ఆరునెలల క్రితం పనుల కోసం మదురైకి వచ్చానన్నాడు. మూడు ఇళ్లలో పనులు: తనను మహిళగా భావించి మూడు ఇళ్లలో పనులు ఇచ్చారని, అక్కడ ఇంటి పనులు చేసి మళ్లీ సాయంత్రం ఇంటికి వెళతానన్నాడు. ఈ విధంగా వచ్చే ఆదాయంతో వృద్ధాప్య తల్లిదండ్రులను కాపాడుతున్నానని తెలిపాడు. తాను వివాహం చేసుకోలేదని, కొందరు తాను మహిళ వేషంలో మోసగిస్తున్నట్లు భావించవచ్చని, అయితే తల్లిదండ్రులను చూసుకోవడానికి తనకు మరో మార్గం కనిపించలేదని పేర్కొన్నాడు. తాను పనిచేస్తున్న ఇళ్లలో ఇంతవరకు ఎవరూ అనుమానించలేదని, తన మాటలు, నడవడిక మహిళల రీతిలో ఉండేలా చూసుకుంటానన్నారు. తాను పనులు చేస్తున్న చోట క్రమశిక్షణతోనే మెలిగానని తెలిపాడు. ఏదైనా ఒకరోజు యజమానులకు ఈ విషయం తెలిసినా.. తన పరిస్థితి గమనించి పనిలో పెట్టుకుంటారని ఆశతో పనిచేస్తున్నానని చెప్పాడు. సామాజిక మాధ్యమాల్లో.. రాజా దుస్తులు మార్చుకుని మహిళగా వస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ అయ్యాయి. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో మదురైలో సంచలనం ఏర్పడింది. -
అదే కథ... అదే వ్యథ!
మరో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ముగిసింది. ఆశల పల్లకి మోస్తూ బరిలోకి దిగిన భారత బృందం రిక్తహస్తాలతో వెనుదిరిగి వచ్చింది. చిన్నాచితక దేశాలూ పతకాలు కొల్లగొడుతున్న వేళ భారత్ మాత్రం నిరాశపరుస్తోంది. కారణాలు ఏమైనా... మనోళ్లు ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్, గ్రాండ్‌ప్రి సిరీస్‌లలోనే మెరిపిస్తారని... అందరి దృష్టి కేంద్రీకృతమయ్యే విశ్వ వేదికలపై మాత్రం తడబడతారని మరోసారి తేటతెల్లం అయ్యింది. సాక్షి క్రీడా విభాగం పదహారేళ్ల క్రితం అంజూ బాబీ జార్జి మహిళల లాంగ్‌జంప్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత పలువురు భారత క్రీడాకారులు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్స్ వరకు వెళ్లినా పోడియంపై మాత్రం స్థానం సంపాదించలేకపోతున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు పాల్గొనే సన్నాహక టోర్నమెంట్లలో పతకాలు సాధించి ఆశలు రేకెత్తించి... తీరా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం చేతులెత్తుస్తున్నారు. ఒత్తిడికి తలవంచుతారో... పోటీతత్వానికి తట్టుకోలేకపోతారోగానీ కొందరు అగ్రశ్రేణి అథ్లెట్స్ సీజన్లో తమ అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోతారు. మూడు ఈవెంట్స్‌లో ఫైనల్స్ చేరడం... రెండు ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకోవడం మినహా ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విశేషాలు లేవు. మహిళల జావెలిన్ త్రోలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అన్ను రాణి గుర్తింపు పొందడం... 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత బృందం ఫైనల్‌కు చేరడంతోపాటు ఒలింపిక్ బెర్త్ సాధించడం... పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో అవినాశ్ సాబ్లే మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు తన పేరిటే ఉన్న జాతీయ రికార్డులను సవరించడం, టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం మనకు కాస్త ఊరటనిచ్చాయి. ఆసియా చాంపియన్‌షిప్‌లలో మెరిపించే భారత క్రీడాకారులు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్–5లో కూడా ఉండటం లేదు. పురుషుల షాట్‌పుట్ విభాగంలో ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్ అయిన తజీందర్ పాల్ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ హీట్స్‌లోనే ఇంటిదారి పట్టింది. 4్ఠ400 మీటర్ల పురుషుల, మహిళల విభాగం రిలేల్లోనూ భారత బృందాలు నిరాశ పరిచాయి. అమెరికా అదుర్స్... మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్న అమెరికా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 14 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 29 పతకాలను గెల్చుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్లో నమోదైన మూడు ప్రపంచ రికార్డులు అమెరికా అథ్లెట్స్ సాధించడం విశేషం. మహిళల 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో దలీలా మొహమ్మద్ 52.16 సెకన్లలో గమ్యానికి చేరి 52.20 సెకన్లతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. టైరెల్ రిచర్డ్, జెస్సికా బియర్డ్, జాస్మిన్ బ్లాకర్, ఒబి ఇగ్బోక్విలతో కూడిన అమెరికా మిక్స్డ్ రిలే బృందం 4్ఠ400 హీట్స్‌లో 3ని:12.42 సెకన్లతో ప్రపంచ రికార్డును సృష్టించగా... ఫైనల్లో పోటీపడిన అలీసన్ ఫెలిక్స్, విల్బెర్ట్, కొట్నీ ఒకోలో, మైకేల్ చెర్రీలతో కూడిన అమెరికా మిక్స్డ్ రిలే బృందం 3ని:09.34 సెకన్లతో హీట్స్‌లో తమ సహచర బృందం నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆఫ్రికా ఆకట్టుకుంది.... అమెరికాకు ఎదురులేకున్నా... ఆఫ్రికా దేశాల అథ్లెట్స్ కూడా ఈసారీ తమ సత్తాను చాటుకున్నారు. పతకాల పట్టికలో టాప్–10లో మూడు ఆఫ్రికా దేశాలు ఉండటం విశేషం. కెన్యా 5 స్వర్ణాలు, 2 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 11 పతకాలతో రెండో స్థానం సాధించడం గమనార్హం. ఇథియోపియా 2 స్వర్ణాలు, 2 రజతాలు, ఒక కాంస్యంతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఉగాండా రెండు స్వర్ణాలతో పదో స్థానంలో నిలిచింది. అమ్మలు అదరగొట్టారు... తల్లి హోదా వచ్చాక ఆటకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని... పట్టుదలతో కృషి చేస్తే అద్భుతాలు చేయవచ్చని ఈ మెగా ఈవెంట్లో స్టార్ అథ్లెట్స్ నియా అలీ, షెల్లీ యాన్ ఫ్రేజర్, అలీసన్ ఫెలిక్స్ (అమెరికా) నిరూపించారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఇద్దరు పిల్లల తల్లి అయిన నియా అలీ (అమెరికా)... 100 మీటర్ల విభాగంలో జమైకా స్టార్ షెల్లీ యాన్ ఫ్రేజర్... 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో అలీసన్ ఫెలిక్స్ స్వర్ణాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. మిక్స్డ్ రిలేలో స్వర్ణం సాధించిన క్రమంలో అలీసన్ ఫెలిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యధికంగా 11 స్వర్ణాలతో ఉసేన్ బోల్ట్ (జమైకా) పేరిట ఉన్న రికార్డును 12వ పసిడి పతకంతో సవరించింది. నియా అలీ షెల్లీ ఫెలిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన మహిళల విభాగం 100 మీటర్లు: ద్యుతీ చంద్ (11.48 సెకన్లతో తన హీట్స్‌లో ఏడో స్థానం. ఓవరాల్‌గా 47 మందిలో 37వ స్థానం). 200 మీటర్లు: అర్చన (23.65 సెకన్లతో తన హీట్స్‌లో ఎనిమిదో స్థానం. ఓవరాల్‌గా 43 మందిలో 40వ స్థానం) 400 మీటర్లు: అంజలి దేవి (52.33 సెకన్లతో తన హీట్స్‌లో ఆరో స్థానం. ఓవరాల్‌గా 47 మందిలో 37వ స్థానం). 1500 మీటర్లు: చిత్రా ఉన్నికృష్ణన్ (4ని:11.10 సెకన్లతో తన హీట్స్‌లో ఎనిమిదో స్థానం. ఓవరాల్‌గా 35 మందిలో 30వ స్థానం). జావెలిన్ త్రో: అన్ను రాణి (క్వాలిఫయింగ్‌లో 62.43 మీటర్లతో గ్రూప్ ‘ఎ’లో మూడో స్థానం. ఓవరాల్‌గా ఐదో స్థానం. 12 మంది పాల్గొన్న ఫైనల్లో 61.12 మీటర్లతో ఎనిమిదో స్థానం). 4x400 మీటర్ల రిలే: (జిస్నా మాథ్యూ, పూవమ్మ రాజు, విస్మయ, శుభాలతో కూడిన బృందం 3ని:29.42 సెకన్లతో హీట్స్‌లో ఆరో స్థానం) పురుషుల విభాగం 400 మీటర్ల హర్డిల్స్: జబీర్ మదారి (49.62 సెకన్లతో తన హీట్స్‌లో మూడో స్థానంలో నిలిచి సెమీఫైనల్ చేరాడు. అనంతరం మూడో సెమీఫైనల్లో 49.71 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయాడు); ధరుణ్ అయ్యసామి (50.55 సెకన్లతో తన హీట్స్‌లో ఆరో స్థానం). 1500 మీటర్లు: జిన్సన్ జాన్సన్ (3ని:39.86 సెకన్లతో తన హీట్స్‌లో పదో స్థానం. ఓవరాల్‌గా 43 మందిలో 34వ స్థానం) 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్: అవినాశ్ సాబ్లే (హీట్స్‌లో 8ని:25.23 సెకన్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ చేరిక. 15 మంది పాల్గొన్న ఫైనల్లో 8ని:21.37 సెకన్లతో 13వ స్థానం) 4x400 మీటర్ల రిలే: (జాకబ్, అనస్, జీవన్, నోవా నిర్మల్‌లతో కూడిన భారత బృందం తమ హీట్స్‌లో 3ని:03.09 సెకన్లతో ఏడో స్థానం) 20 కిలోమీటర్ల నడక: ఇర్ఫాన్ (గంటా 35ని.12 సెకన్లతో 27వ స్థానం); దేవేందర్ సింగ్ (గంటా 41ని.48 సెకన్లతో 36వ స్థానం). మారథాన్: గోపీ (2గం:15ని.57 సెకన్లతో 21వ స్థానం) లాంగ్‌జంప్: శ్రీశంకర్ (14 మంది పోటీపడిన క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’లో 7.62 మీటర్లతో 12వ స్థానం). జావెలిన్ త్రో: శివపాల్ సింగ్ (16 మంది పోటీపడిన క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎ’లో 78.97 మీటర్లతో పదో స్థానం. ఓవరాల్‌గా 30 మందిలో 24వ స్థానం) షాట్‌పుట్: తజీందర్ సింగ్ (18 మంది పోటీపడిన క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’లో 20.43 మీటర్లతో ఎనిమిదో స్థానం) 4x400 మిక్స్డ్ రిలే: (అనస్, నోవా, జిస్నా, విస్మయలతో కూడిన భారత బృందం హీట్స్‌లో 3ని:16.14 సెకన్లతో మూడో స్థానం. ఎనిమిది జట్లు పాల్గొన్న ఫైనల్లో 3ని:15.77 సెకన్లతో ఏడో స్థానం) కనీసం ఒక పతకమైనా సాధించిన దేశాల సంఖ్య:43 ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనీసం ఒక స్వర్ణమైనా సాధించిన దేశాల సంఖ్య:20 పురుషుల 4x400 మీటర్ల హీట్స్‌లో భారత అథ్లెట్స్ -
సమానత్వానికి మరో 200 ఏళ్లు
మానవుడు అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా లింగ వివక్షత మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో లింగ భేదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్థికం, రాజకీయం, ఉద్యోగం ఇలా దాదాపు అన్ని రంగాల్లో ఇంకా మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఈ లింగ వివక్షతను దాటి స్త్రీపురుష సమానత్వం సాధించడానికి ఇంకా 200 ఏళ్లు పడుతుందట. అంతర్జాతీయంగా అధ్యయనం చేసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం తేల్చిన సత్యమిది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2018 భారత్‌లో స్త్రీపురుష సమానత్వానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పకనే చెప్పింది. దేశంలోని ఆర్థిక రంగంలో ఉన్న లింగ అసమానతలను పరిష్కరించుకోవాల్సిన తక్షణ ఆవశ్యకతను అది నొక్కి చెప్పింది. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా నాలుగు కీలకాంశాల ఆధారంగా లింగపరమైన ఆర్థిక అసమానతలను అంచనా వేసింది. ఆర్థిక అవకాశాలు, రాజకీయ సాధికారత, విద్య, ఆరోగ్య రంగాల్లో స్త్రీపురుష అంతరాలను కొలమానంగా తీసుకుని మన దేశంలో కొనసాగుతున్న అసమానతలపై దృష్టి సారించాలని చెప్పింది. గత దశాబ్దకాలంగా ఆరోగ్యం విషయంలో ప్రపంచంలోనే మన దేశం చివరి నుంచి మూడోస్థానంలో ఉండటం ప్రమాదానికి సంకేతంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం భావించింది. స్త్రీపురుషుల మధ్య ఆర్థిక అసమానతలు తొలగడానికి రెండు శతాబ్దాల కాలం పడుతుందని స్పష్టం చేసింది. అమెరికా కన్నా బెటర్... రాజకీయ సాధికారతలో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 54వ స్థానంలో ఉన్న అమెరికా, 33వ స్థానంలో ఉన్న యుకె కన్నా మెరుగైన ఫలితాలను కనబర్చి మన దేశ మహిళలు ప్రపంచంలోనే 15వ స్థానంలో నిలిచినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం రిపోర్టు వెల్లడించింది. పది ప్రధాన ప్రమాణాలను గమనిస్తే.. బంగ్లాదేశ్, శ్రీలంకతో పోలిస్తే మన దేశం లింగ అసమానతలను జయించాలంటే చాలా విషయాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. 100 ప్రధాన కంపెనీల్లో కేవలం 5 శాతం మంది మహిళలు మాత్రమే కీలక స్థానాల్లో ఉన్నారు. అలాగే అతి కొద్ది మందికి మాత్రమే నూతన కంపెనీల స్థాపనకు ఆర్థిక తోడ్పాటునిచ్చినట్లు తేలింది. నిర్వహణ రంగం స్త్రీ భాగస్వామ్యం - ముంబై స్టాక్ ఎక్చేంజీలోని టాప్ 100 కంపెనీల్లో సీఈఓలుగా ఉన్న మహిళలు 2018 జనవరి నాటికి ఐదుగురు మాత్రమే. అలాగే 2019 జనవరి నాటికి ఇందులో ఎలాంటి మార్పు లేదు. - ముంబై స్టాక్ ఎక్సేంజీలోని టాప్ 500 కంపెనీల్లో సీఈఓలుగా ఉన్న స్త్రీలు 2018 జనవరి నాటికి 18 మంది కాగా, 2019 జనవరి నాటికి 25 మందికి చేరారు. - ముంబై స్టాక్ ఎక్చేంజీలోని టాప్ 100 కంపెనీల్లో బోర్డు సభ్యులుగా ఉన్న మహిళలు 2018 నాటికి 172 మంది ఉండగా, 2019 జనవరి నాటికి 180 మందికి చేరారు. - టాప్ 482 కంపెనీల్లో మొత్తం డైరెక్టర్లలో మహిళలు 2018 నాటికి 14.08 శాతం ఉండగా, 2019 జనవరి నాటికి 14.49 శాతానికి పెరిగింది. మెరుగ్గా ఐస్లాండ్... ప్రపంచ దేశాల్లో ఐస్లాండ్ గత పదేళ్లుగా మహిళా సాధికారతలో మెరుగ్గా ఉంది. మహిళా శాసనకర్తలు, సీనియర్ అధికారులు, మేనేజర్లు మాత్రం ఐస్లాండ్లో గతంకన్నా కొద్దిగా తగ్గినప్పటికీ.. మిగిలిన దేశాలకన్నా అసమానతలు ఈ దేశంలో తక్కువగా ఉన్నట్లు తేలింది. గత అక్టోబర్‌లో ఐస్లాండ్ ప్రధాని కత్రిన్ జాకోబ్స్డాటిర్తో సహా ఐలాండ్ మహిళలంతా వేతనాల్లో అసమానత్వానికి, లైంగిక వేధింపులకు నిరసనగా పనిమానేసి వీ«ధుల్లోకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఆధారంగా రాజకీయాలు, పనిలో భాగస్వామ్యం, ఆరోగ్యం, విద్యారంగాల్లో అంతరాలను అధిగమించడంలో ప్రపంచవ్యాప్తంగా 0.1 శాతం మెరుగుదల సాధించాం. ఈ లెక్కన సమానతకు ప్రపంచం చాలా దూరంలో ఉంది. స్త్రీ పురుష సమానత్వం కోసం ఇంకా 202 ఏళ్లు ఎదురుచూడటం చాలా సుదీర్ఘ ప్రయాస అని యుఎన్ ఉమన్ రీజనల్ డైరెక్టర్ అన్నా కరీన్ జాట్ఫోర్స్ వ్యాఖ్యానించారు. సమాన వేతన విధానాలు, మహిళల అవసరాలకు తగినట్లుగా గర్భిణులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, అవకాశాలు కల్పించడం, ప్రసవానంతరం మహిళలకు చట్టబద్ధమైన ఉద్యోగ భరోసా ఇవ్వడం ద్వారా స్త్రీ పురుషుల ఆర్థిక అంతరాలను కొంతవరకైనా తగ్గించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 200 ఏళ్లు ఆగాల్సిందే.. జెనీవాకు చెందిన అంతర్జాతీయ సంస్థ 149 దేశాల్లో విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, రాజకీయ సాధికారత తదితర రంగాల్లో కొనసాగుతున్న అసమానతలను రికార్డు చేసింది. ఈ యేడాది విద్య, ఆరోగ్యం, రాజకీయ భాగస్వామ్యంలో ఉన్న అంతరాలను ప్రపంచ ఆర్థిక సంస్థ వెల్లడించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నైపుణ్యం తదితర విషయాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నట్లు ఈ రిపోర్టు గుర్తించింది. పశ్చిమ యూరప్ దేశాలు మరో ఆరు దశాబ్దాల్లో ఆర్థిక అంతరాలను అధిగమిస్తారని, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాలో లింగ వివక్షను అధిగమించేందుకు మరో 153 ఏళ్లు వేచిచూడాల్సిందేనని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెల్లడించింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా స్త్రీపురుషుల మధ్య అసమానతలు పూడ్చటానికి కనీసం 202 ఏళ్లు పడుతుందని ఫోరం అంచనా వేసింది. -
అమ్మతోడు.. అమ్మాయిగానే..
సాక్షి,సిటీబ్యూరో: మరో జన్మంటూ ఉంటే మళ్లీ అమ్మాయిగానే పుడతానంటున్నారు సిటీ అమ్మాయిలు. నిత్య జీవితంలో ప్రతిచోటా వివక్ష ఎదురైనా దానికి చరమగీతం పాడేందుకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. కొందరు ఇంట్లో వివక్షను ఎదుర్కొంటే.. పాఠశాల.. కళాశాల స్థాయిలో తాము అధికమార్లు వివక్షకు గురైనట్లు ఇంకొందరు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో కెరీర్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు విరామమెరుగక శ్రమిస్తామని చాటిచెబుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వ్యాప్తంగా బుధవారం ‘సాక్షి’ బృందం సుమారు వెయ్యి మంది కళాశాలల విద్యార్థినుల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలను సేకరించింది. వారి అభిప్రాయాలిలా ఉన్నాయి.. సాక్షి సర్వే 1. మళ్లీ జన్మంటూ ఉంటేఎలా పుడతారు ? ఎ.అమ్మాయి: 682 బి.అబ్బాయి: 187 సి.చెప్పలేం: 131 2. అమ్మాయిగా ఎప్పుడైనావివక్ష ఎదుర్కొన్నారా..? ఎ.అవును: 549 బి.లేదు: 401 సి. చెప్పను: 50 3. మీరు ఎక్కడ వివక్ష ఎదుర్కొన్నారు? ఎ.స్కూల్/కాలేజ్: 649 బి.ఇంట్లో: 309 సి.లేదు: 42 4. మీ ఆకాంక్షలకు అనుగుణంగాచివరి లక్ష్యాన్ని (లైఫ్‌గోల్) చేరుకోగలమనిభావిస్తున్నారా? ఎ.అవును: 730 బి.కాదు: 207 సి. చెప్పలేను: 63 5. సంప్రదాయకెరీర్ ఎంచుకోవాలనుకుంటున్నారా.. లేదాఛాలెంజింగ్ జాబ్ చేయాలనుకుంటున్నారా? ఎ. రిస్క్ ఎక్కువగా ఉండని జాబ్: 464 బి.ఛాలెంజింగ్ జాబ్: 489 సి.చెప్పలేను: 47 -
ఆ ట్యాగ్ మాకెందుకు?
ఆడపిల్లలా ఉండు.. ఆడపిల్లలా మాట్లాడు.. ఆడపిల్లలా నడువు..చివరకు నవ్వడం, ఏడ్వడం, కూర్చోవడం, తినడం.. ఇలా అన్నీ ఆడపిల్లలా చేయమంటారు! ఎందుకు వేశారీ శిక్షలు.? ఎవరు విధించారీ ఆంక్షలు.? అసలీ ‘ఆడపిల్ల’ ట్యాగ్ మాకెందుకు? అంటూ ప్రశ్నించారు హోలీమేరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థినులు. స్త్రీ వివక్షపై ‘సాక్షి’ సాగిస్తున్న సమరంలో భాగంగా ‘నేను శక్తి’ శీర్షికతో అమ్మాయిలు మనసు విప్పి మాట్లాడారు. స్త్రీపురుషసమానత్వ భావనకు సాక్ష్యంగా నిలిచారు. సాక్షి, సిటీబ్యూరో : మేము అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. బరువుగా కాదు.. బాధ్యతగా ఎదుగుతాం. మా చుట్టూ ఉన్న సమాజాన్ని నిలదీస్తాం. మార్పుని సాధిస్తాం. అమ్మాయే కదా.! అన్నీ నిశ్శబ్దంగా భరిస్తుంది అనుకుంటున్నారా? ఎదుర్కొంటాం.. తిరగబడతాం.. సమానత్వం కోసం.. సమాజంలో మార్పు కోసం.. ఆడపిల్లవి మెకానికల్ ఇంజినీరింగ్ తీసుకున్నావా? అని ఆశ్చర్యపోతాడు చుట్టం చూపుగా వచ్చిన అంకుల్. అయినా ఇంజినీరింగ్ ఎందుకు? త్వరగా పూర్తయ్యే డిప్లొమా కోర్సు ఏదైనా చేయలేకపోయావా? అంటూ ఉచిత సలహా ఇస్తాడు దారినపోయే దానయ్య. పురివిప్పిన నెమలిలా ఓ ఆడపిల్ల అన్నయ్య పెళ్లిలో నాట్యం చేయడం కూడా తప్పేనంట. ఆడపిల్ల చదివితే ఓ సమస్య.. ఉద్యోగం చేస్తే మరో సమస్య. ఆమె ఇంట్లో ఉన్నా, బయటకెళ్లినా సమస్యే. నిజానికి ఆమె ప్రతి కదలికా ఓ సమస్యే. అసలు ఆడపిల్లే సమస్యగా మారిన చోట అంబరాన్నంటే ఆత్మవిశ్వాసంతో అడుగడుగునా తనని తాను రుజువు చేసుకుంటూ.. వివక్షని ఎదిరిస్తూ.. తమ కాళ్లపై తాము నిలబడుతూ మహిళా శక్తికి మారుపేరుగా నిలుస్తున్నారీ నేటి బాలికలు. తాము ఎదుర్కొన్న అవమానాలు, వివక్షలను చెప్పిన అమ్మాయిలు... ‘సాక్షి’ సమరంలో భాగమవుతామని ముక్తకంఠంతో నినదించారు. అన్నింట్లో వివక్షే.. ‘ఆటల దగ్గర్నుంచి వేషధారణ వరకు మగపిల్లల్లో లేని అణకువని ఆడపిల్లల్లో ఎందుకు వెతుకుతారు? అణకువగా ఉండడమంటే అణిగిమణిగి ఉండడమనేనా? ఆడపిల్లలకు అభిప్రాయాలుండవా? ఆకాంక్షలుండవా? ఆశలుండవా? చదువు, ఉద్యోగం ఆడపిల్లలకు అవసరం లేని విషయాలా? ఆ రెండింటిలోనూ ఎంపిక బాధ్యత ఆమెది కాదా? ఏ కోర్సు చేయాలి.. డిప్లొమోనా? ఇంజనీరింగా? ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి... మెకానికలా? కంప్యూటర్ సైన్సా? ఏ ఉద్యోగం చేయాలి.. టీచరా? డాక్టరా? చివరకు ఏ మీడియం తీసుకోవాలి... అన్నయ్యకైతే ఆంగ్లం..? నాకైతే తెలుగు! ఏ డ్రెస్ వేసుకోవాలి... చూడీదారా? షార్ట్స్ వేసుకోవాలా? మా పనులకు హద్దు సూర్యాస్తమయమేనా? నాన్నకి జబ్బు చేస్తేనో, అమ్మకి మందులు అయిపోతేనే ఆడపిల్లలు బయటకెళ్తే రేప్‌లు జరుగుతాయని భయపెట్టడం కన్నా... అలా జరగకుండా మగపిల్లల్ని పెంచరెందుకో? డబ్బున్నా లేకున్నా ఆడపిల్లకి సర్కార్ బడి, అన్నయ్యకి ప్రైవేట్ కార్పొరేట్ చదువు. ఎందుకీ వివక్ష? తల్లిందండ్రుల బాధ్యతను ఆడపిల్లలు పంచుకోరనేగా? ఈ అసమానతలను, వివక్షనూ పక్కనపెట్టి మమ్మల్ని సమానంగా ఎదగనివ్వండి.. మేమేంటో నిరూపిస్తాం’ అంటూ సవాల్ చేశారు ‘హోలీమేరీ’ విద్యార్థినులు. అన్నింటికీ అమ్మాయి అంటూ తక్కువ చేసి చూసే అసమాన భావనలకు స్వస్తి పలుకుతూ... మాకు తగిలిస్తోన్న ‘అమ్మాయి ట్యాగ్’ను వదిలించుకొని.. మేమొక శక్తిగా ఎదుగుతామని చాటి చెప్పారు. -
వేడుకలు.. వేర్వేరుగా
విభజించు.. సమస్యలను నివారించు అనే విధానాన్ని రాజధాని పోలీసులు నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు వినియోగిస్తున్నారు. ఏడాది చివరిరోజు రాత్రి ఉత్సవాల్లో మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా స్థలం కేటాయింపులతో అనేక సమస్యలు దూరమవుతాయని భావిస్తున్నారు. సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీలో 31న సాయంత్రం నుంచి నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి వీలుగా నగర పోలీసులు వినూత్న భద్రతా విధానాలు అమలు చేయనున్నారు. సంబరాలు జరిగే ప్రాంతాల్లో పురుషులకు, మహిళలకు వేర్వేరు ప్రాంతాలను కేటాయించబోతున్నారు. నగరంలో ఇలాంటి పద్ధతి ఇదే ప్రథమం. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మహిళలపై మద్యం, డ్రగ్స్ మత్తులో కొందరు దుండగులు మహిళలపై కీచక పర్వాలకు దిగడం వేడుకలు.. వేర్వేరుగా తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. దీంతో గత రెండువారాలుగా అటువంటి దురాగతాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల పై అన్ని వర్గాల ప్రజలతో ప్రజలు చర్చలు జరుపుతున్నారు. ♦ వేడుక వేళ భద్రతా చర్యల్లో భాగంగా ఎంజీ, బ్రిగేడ్ రోడ్లలో 30 శాతాన్ని కేవలం మహిళల కోసం కేటాయించనున్నారు. ఇక్కడకు ఎట్టి పరిస్థితుల్లోనూ పురుషులను అనుమతించరు. ♦ అదే విధంగా 70 శాతం రోడ్డును పురుషులకు కేటాయిస్తారు. ఇక్కడ పురుషులతో పాటు మహిళలకూ ప్రవేశం ఉంటుంది. దంపతులు, స్నేహితులు తదితరులు ఇక్కడకు వచ్చి వేడుకల్లో పాల్గొనవచ్చు. ♦ అయితే ఉత్సవాలు అంటేనే అందరూ కలిసి చేసుకోవడమని ఇలా మహిళలు, పురుషులంటూ వేరు చేయడం సరికాదని కొంతమంది వాదిస్తున్నారు. ♦ ఈ పద్ధతి వల్ల మహిళలు భయాందోళనలు లేకుండా సంతోషంగా వేడుకలను ఎంజాయ్ చేయవచ్చునని పోలీసులు చెబుతున్నారు. 2 నిమిషాల చీకటికి స్వస్తి? ♦ న్యూ ఇయర్ వేడుకల పై నిఘా వహించడానికి వీలుగా నగర పోలీసులు దాదాపు 8,500 మంది పోలీసులతో పాటు 200 ఫోకస్ లైట్లు...500 సీసీ కెమెరాలను భద్రతా పర్యవేక్షణకు వినియోగించనున్నారు. ♦ ముఖ్యంగా అర్ధరాత్రి 11:58 నుంచి 12 గంటల వరకూ అంటే రెండు నిమిషాల పాటు ఎం.జీ రోడ్డు, బ్రిగెడ్ రోడ్డుల్లో లైట్లను ఆఫ్ చేసే విధానాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో గందరగోళాలు చెలరేగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ♦ కెమెరాలు, లైట్ల ఏర్పాటు ద్వారా ప్రతి ఒక్కరి పై నిఘా ఉంచడానికి వీలవుతుందనేది పోలీసుల ఆలోచన. త్వరలో స్పష్టమైన ప్రకటన ఇదిలా ఉండగా ఎం.జీ రోడ్, బ్రిగెడ్ రోడ్డుల వద్ద వ్యాపారులతో ఇప్పటికే 12 సార్లు సమీక్ష సమావేశాలు జరిపిన నగర పోలీసులు మరో రెండుసార్లు ఈ విషయం పై చర్చలు జరపనున్నారు. తర్వాత వేడుకల విషయంలో తీసుకునే జాగ్రత్తలు, ఇందుకు ప్రజలు సహకరించాల్సిన విధానం పై కూడా అధికారికంగా ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. -
ఓ ఆడ, మగ కలసి ఓ పని చేస్తే.....
కాలిఫోర్నియా: పరస్పర సహకారంతో చేయాల్సిన ఓ పనిని ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్లు కలసి చేస్తే ఎలా ఉంటుంది? అదే ఓ ఆడ, మగ కలసి చేస్తే ఎలా ఉంటుంది? చేసే పని పట్ల వారి దృక్పథాలు ఎలా ఉంటాయి? అప్పుడు వారి మెదళ్లు ఎలా స్పందిస్తాయి? వారి మెదళ్లలోని ఏ భాగంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? అన్న విషయంలో శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారు. ఇద్దరు కలిసి చేసే పనిని ఇద్దరు ఆడవాళ్లు చేయడంకన్నా ఇద్దరు మగవాళ్లు చేస్తేనే ఉత్తమ ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చి చెప్పారు. అదే ఓ ఆడ, మగ కలసి పని చేస్తే పని పట్ల వారి ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందో, వారి మెదళ్లలో ఎక్కడ ఎలాంటి మార్పులు సంభవిస్తాయో తెలసుకునేందుకు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తాజాగా పరిశోధనలు జరిపారు. పని చేస్తున్నప్పుడు వారి మెదళ్లను ఎప్పటికప్పుడు స్కాన్ చేయడం ద్వారా ఫలితాలను విశ్లేషించారు. అనుకున్న పనిని పూర్తిచేసేందుకు మగవాళ్లు బహు విధాల ఆలోచిస్తారు. ఆడవాళ్లు ఒకే రీతిన ఆలోచిస్తారు. సాధారణంగా మగవాడు ఏం చేయబోతున్నాడన్నది అంచనావేసి అతడు ఆలోచనా ధోరణికి అనుగుణంగా పనిచేస్తూ ఆ పనిని పూర్తయ్యేందుకు ఆడవాళ్లు సహకరిస్తారు. ఇద్దరి దృక్పథాల్లో భిన్న ధోరణులు ఉన్నట్లే వారి మెదడులోని వేర్వేరు ప్రాంతాల్లో స్పందనలు కనిపిస్తాయి. మగవాడు బహువిధ దృక్పథంతో ఆలోచిస్తాడు కనుక మెదడులోని కార్టెక్స్ కుడి పైభాగం స్పందిస్తుంది. ఆడవాళ్లు ఏక దృక్పథంతో ఆలోచిస్తారు కనుక కార్టెక్స్ కుడివైపు దిగువ భాగం స్పందిస్తుంది. పనిచేస్తున్నప్పుడు రక్తంలోని ఆక్సిజన్ ఏ ప్రాంతానికి ఎక్కువగా చేరుతుందో గమనించడం ద్వారా ఆ ప్రాంతం స్పందిస్తున్న విషయాన్ని గుర్తిస్తారు. 200 మంది ఆడ, మగ జంటలకు పరస్పర సహకారంతో పూర్తి చేయాల్సిన ఒకే పనిని అప్పగించడం ద్వారా ఈ ప్రయోగాన్ని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇద్దరు ఆడవాళ్లకన్నా ఇద్దరు మగవాళ్లే నిర్దేశిత పనిని ఉత్తమంగా చేస్తారన్న గత అధ్యయనాలను కూడా ఈ ప్రయోగం శాస్త్ర విజ్ఞానపరంగా రుజువు చేస్తోంది. ఇద్దరు ఆడవాళ్లకన్నా కూడా ఒక మగ, ఆడ కలిసి బాగా పనిచేస్తారని కూడా తేలింది. ఇద్దరు మగవాళ్లు పూర్తిచేసే పనిలో, ఆడ, మగ జంట కాస్త వెనకబడినప్పటికీ వ్యత్యాసంలో పెద్ద తేడా లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఓ నిర్దేశిత పనిని పూర్తి చేయడంలో ఆడ, మగ మధ్య తేడా ఉంటుందని చెప్పడం తమ ఉద్దేశం ఎంతమాత్రం కాదని, పని పూర్తి చేయడంలో ఆడ, మగ మెదళ్లలో కలిగే మార్పులను సూచించడమే తమ ఉద్దేశమని పరిశోధకులు వివరించారు. భవిష్యత్తులో ఆడ, మగ కలసి సమష్టిగా పనిచేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఎలా సాధించాలో అంచాను రావడం కోసమే తమ ప్రయోగమని చెప్పారు. అయినా తాము నిర్వహించిన ఈ తాజా ప్రయోగంతో అప్పుడే ఓ నిశ్చితాభిప్రాయానికి రానవసరం లేదని, ఈ దిశగా మరిన్ని ప్రయోగాలు నిర్వహించాల్సి ఉందని వారు తెలిపారు. సాంస్కృతిక, సామాజిక పరిస్థితులనుబట్టి కూడా ఆగ, మగ దృక్పథాల్లో మార్పులు ఉండవచ్చని వారన్నారు.