సమ గౌరవమే సరైన రక్ష | Equal respect is the right defense | Sakshi
Sakshi News home page

సమ గౌరవమే సరైన రక్ష

Published Fri, Aug 12 2022 3:29 AM | Last Updated on Fri, Aug 12 2022 3:29 AM

Equal respect is the right defense - Sakshi

కుటుంబంలో ఆమె సమాన భాగస్వామి.
పని ప్రదేశంలో ఆమె సమాన సహోద్యోగి.
సమాజంలో ఆమె సమాన పౌరురాలు.
అవకాశాలలో.. అధికారంలో.. అంతరిక్షంలో అన్నింటా ఆమెకు సమాన హక్కు ఉంది.
పురుషులు గ్రహించ వలసింది ఇదే

రక్షా బంధన్‌ సందర్భంలో. స్త్రీకి సాటి పురుషుల నుంచి ‘రక్ష’ ఇచ్చే బదులు అందరు పురుషులు స్త్రీల సమస్థానాన్ని స్వీకరిస్తే చాలు. అన్న స్థానం మంచిదే.
సమ స్థానం గొప్పది.


పురాణాల్లో ద్రౌపదికి కృష్ణుడు అన్నగా కనిపిస్తాడు. ద్రౌపదికి రక్షగా ఆయన నిలిచిన ఉదంతాలు అందరికీ తెలుసు. కౌరవసభలో జూదంలో ఓడిపోయిన పాండవులను మరింత అవమానించడానికి ద్రౌపది వస్త్రాపహరణానికి పురిగొల్పుతాడు దుర్యోధనుడు. దుశ్శాసనుడు అందుకు పూనుకుంటాడు. నిండు సభలో స్త్రీకి... ఒక రకంగా ఇంటి కోడలికి అవమానం జరగబోతుంది. ఆ సమయంలో ఒక అన్నగా ప్రత్యక్షమయ్యి ఆమెకు రక్షగా నిలుస్తాడు కృష్ణుడు.

మగవారి గొడవలో స్త్రీలను లాగకూడదనే సంస్కారం కౌరవులకు ఉండి ఉంటే ద్రౌపదికి పరాభవం జరిగి ఉండేది కాదు. మగవారైన కౌరవుల నుంచి రక్షించడానికి మగవాడైన కృష్ణుడు ప్రత్యక్షం కావల్సిన అవసరమూ ఉండేది కాదు.
అంటే?
స్త్రీలను గౌరవించాలనే సంస్కారమే ప్రథమం. ఆ సంస్కారం ఉంటే స్త్రీలకు మగవారి నుంచి ఎటువంటి ఆపదా, ఇబ్బంది ఉండదు. వారికి రక్షగా నిలవాల్సిన అవసరమూ ఉండదు.

చెల్లెలు బంగారు తల్లి. ఇంటి ఆడపిల్లంటే లక్ష్మి. తండ్రికి, అన్నకు, తమ్ముడికి కూడా ఆమె అంటే అంతులేని మమకారం. ఆమె పాదంలో ముల్లు దిగితే వారి కంట కన్నీరు పొంగుతుంది. ఆమె కోరింది ఇవ్వబుద్ధవుతుంది. ఆమెను ఇష్టాన్ని మన్నించాలనిపిస్తుంది. కాని ఇదంతా తమ ఇంటి ఆడపిల్ల విషయంలోనే. మరి పొరుగింటి, ఇరుగింటి, ఊళ్లో ఉన్న, ఆఫీసులో ఉన్న స్త్రీలు అందరూ ఇలా ప్రేమగా, ఆదరంగా చూడవలసిన వారే కదా.

మన ఇంటి ఆడవాళ్లని మాత్రమే ఆదరంగా చూస్తాము ఇతర ఇళ్ల ఆడవాళ్లను చులకన చేస్తాము అనే భావన ఎందుకు? అలా ఎవరైనా తమ ఇంటి ఆడవాళ్లను చులకన చేస్తే ‘మేమున్నాం’ అని ఆ ఇంటి అన్నదమ్ములు ముందుకు రావడం ఎందుకు? అసలు ఒక స్త్రీని చులకన గా లేదా ఆధిపత్య భావనతో చూడవలసిన అవసరం ఏముంది? మీరు మేము రక్షగా నిలువదగ్గవారు అని చెప్పవలసిన అవసరం ఏమి?
‘భారతీయులందరూ సహోదరులు’ అని ప్రతిజ్ఞ చేసినట్టుగా ‘స్త్రీ పురుషులందరూ సమాన గౌరవానికి అర్హులు’ అని ప్రతిజ్ఞ చేసుకుంటే ‘రక్షాబంధనం’ అనే ‘రక్ష’కు గుర్తుగా కాక ఆత్మీయతకు, ఆదరణకు, అనురాగానికి, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది.
∙∙
ఆడపిల్ల చదువు విషయంలో, ఉద్యోగాన్ని ఎంచుకునే విషయంలో, జీవిత భాగస్వామిని కోరుకునే విషయంలో, ఆస్తి పంపకాలలో, ఇంటికి సంబంధించిన నిర్ణయాలను వ్యక్తం చేయడంలో ఎంత అవకాశం ఇస్తున్నారో ఎవరికి వారు చూసుకోవాలి. కావలసిన బట్టలు, నగలు కొనిపెట్టడమే అనురాగం, ఆత్మీయత కాదు. వారి ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిత్వానికి చోటు కల్పించాలి. స్వయం సమృద్ధితో జీవితాన్ని నిర్మించుకునే శక్తి, స్వేచ్ఛ పొందేందుకు అడ్డు లేకుండా ఉండాలి. మద్దతుగా నిలవాలి. అది ఇంటికి సంబంధించినంత వరకూ సరైన రక్షా బంధనం అంటే.

ఇక పని ప్రదేశాలలో మహిళా ఉద్యోగినుల ప్రతిభను గౌరవించాలి. వారికి ‘బాస్‌’లుగా ఎదిగే సామర్థ్యం ఉంటే వారి దగ్గర పని చేయడం ఇతర పురుష బాస్‌ల వద్ద పని చేయడంతో సమానంగానే భావించాలి. వారు ఇంటిని, పిల్లలను చూసుకుంటూ ఉద్యోగంలో కూడా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి అనుక్షణం గుర్తుంచుకోవాలి. పురుషుడు కేవలం ఉద్యోగం చేస్తే సరిపోతుంది. ఉద్యోగం చేయాలనుకునే స్త్రీ ఇల్లు కూడా చూసుకోవాలి. కనుక ఆఫీసులో వారే ఎక్కువ సమానం అవుతారు కాని తక్కువ సమానం కాదు. పురుష ఉద్యోగులతో పరస్పర సహకారం అందిస్తూ ఎలా పని చేస్తారో మహిళా ఉద్యోగులతో కూడా పరస్పర సహకారం అందిస్తూ పని చేస్తే అదే ఆఫీసు వరకు నిజమైన రక్షాబంధనం.

సమాజంలో అనేక దొంతరల్లో ఇవాళ స్త్రీలు వికాస పథంలో పని చేస్తున్నారు. పురుషులకు అట్టి వారిని చూసినప్పుడు ప్రధానంగా ప్రశంసాపూర్వకంగా చూడాలి. నాయకులు, ఆటగాళ్ళు, కళాకారులు, అధికారులు అనంటే పురుషుల మాత్రమే కాదని, స్త్రీలు కూడా అని గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా ఇవాళ స్త్రీలే ఫోర్బ్స్‌కు ఎక్కుతున్నారని గ్రహిస్తే వారిని స్ఫూర్తిగా తీసుకుని మన ఇంటి అమ్మాయికి వారిని ఆదర్శం చేయడమే సమాజానికి సంబంధించినంత వరకూ సరైన రక్షా బంధనం.

పులితో పోరాడిన స్త్రీలు, బిడ్డను నడుముకు కట్టుకుని శత్రువులతో పోరాడిన స్త్రీలు మన దగ్గర కొదవ కాదు. వారు పరాక్రమవంతులు. వారే ఎవరికైనా రక్షగా నిలువగలరు. తమను తాము రక్షించుకోగలరు. వారు కోరేదల్లా తమ దారిన తాము నడవనివ్వమని. తమ ఎంపికల పట్ల ప్రజాస్వామికంగా ఉండమని. బాధ్యతల బంధాల బట్వాడాలో సమన్యాయం పాటించమని. తమను గౌరవిస్తూ తమ గౌరవం పొందే విధంగా పురుషులు ఉండాలని.
తల్లీతండ్రి, భార్యా భర్త, అక్కా తమ్ముడు, స్త్రీ పురుషుడు, యువతీ యువకుడు... జీవన– సామాజిక చక్రాలలో స్త్రీలు పురుషులకు రక్షగా పురుషులు స్త్రీలకు రక్షగా సందర్భాన్ని బట్టి మారాల్సి ఉంటుంది. ఆ సందర్భాలను గుర్తించమని చెప్పేదే నిజమైన రక్షాబంధనం.
 
‘భారతీయులందరూ సహోదరులు’ అని ప్రతిజ్ఞ చేసినట్టుగా ‘స్త్రీ పురుషులందరూ సమాన గౌరవానికి అర్హులు’ అని ప్రతిజ్ఞ చేసుకుంటే ‘రక్షాబంధనం’ అనే ‘రక్ష’కు గుర్తుగా కాక ఆత్మీయతకు, ఆదరణకు, అనురాగానికి, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement