మెక్సికో శుభారంభం
మెక్సికో : 1
(పెరాల్టా 61వ ని.)
కామెరూన్ :0
నాటల్: ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఓటమి లేకుండా ముందుకు సాగడం మెక్సికో జట్టు ఆనవాయితీ. 1998 నుంచి మూడు టోర్నీలలో తొలి మ్యాచ్ గెలిచి, ఒక టోర్నీలో డ్రా చేసుకున్న మెక్సికో... ఈసారి బ్రెజిల్ ప్రపంచకప్‌లో కూడా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 1-0తో కామెరూన్‌పై నెగ్గింది.
హాప్రారంభం నుంచే బంతి ఎక్కువగా మెక్సికో ఆధీనంలో ఉంది. ముఖ్యంగా రైట్ వింగ్‌లో డిఫెండర్ అగిలర్ చురుగ్గా కదులుతూ ప్రమాదకరంగా కనిపించాడు. 11వ నిమిషంలో మెక్సికో మిడ్ ఫీల్డర్ హెరేరా నుంచి క్రాస్‌ను అందుకున్న సాంటోస్ చేసిన గోల్‌ను రిఫరీ ఆఫ్ సైడ్‌గా ప్రకటించారు.
హా20వ నిమిషంలో కామెరూన్ స్టార్ సామ్యూల్ ఎటో 12 గజాల దూరం నుంచి కొట్టిన షాట్ తృటిలో తప్పిపోయింది. అలాగే 29వ నిమిషంలో కార్నర్ నుంచి వచ్చిన బంతిని డాస్ సాంటోస్ గోల్ పోస్ట్‌లోకి పంపినప్పటికీ ఆఫ్ సైడ్ కారణంతో రిఫరీ అంగీకరించలేదు. ఈ నిర్ణయం వివాదాస్పదమైంది.
హామెక్సికో గోల్ ప్రయత్నం 61వ నిమిషంలో ఫలించింది. డాస్ సాంటోస్ తక్కువ ఎత్తులో కొట్టిన షాట్‌ను కీపర్ అడ్డుకున్నా అతడి చేతిలో నుంచి బయటకు వచ్చిన బంతిని వెంటనే స్ట్రయికర్ ఒరైబ్ పెరాల్టా గురి తప్పకుండా గోల్ చేశాడు. చివరి వరకూ మెక్సికో డిఫెన్స్ పటిష్టంగా కనిపించడంతో పాటు ఎటోకు సహకారం అందించే వారు కరువవడంతో కామెరూన్‌కు స్కోరు సమం చేసే అవకాశం రాలేదు.