ఢిల్లీకి ‘అమితా’నందం! | Mishra, de Kock hand Kings XI a thrashing | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి ‘అమితా’నందం!

Published Sat, Apr 16 2016 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

ఢిల్లీకి ‘అమితా’నందం!

ఢిల్లీకి ‘అమితా’నందం!

అమిత్‌మిశ్రా స్పిన్ మ్యాజిక్
డేర్‌డెవిల్స్‌కు సీజన్‌లో తొలి విజయం
8 వికెట్ల తేడాతో పంజాబ్ చిత్తు
రాణించిన డికాక్, శామ్సన్

 నైపుణ్యానికి అనుభవాన్ని జోడించిన అమిత్ మిశ్రా ఐపీఎల్‌లో తన పంజా విసిరాడు. ప్రత్యర్థి జట్టులో నలుగురు నాణ్యమైన విదేశీ బ్యాట్స్‌మెన్ ఉన్నా... గింగరాలు తిరిగే బంతులతో బోల్తా కొట్టించాడు. తన కోటా ఓవర్లు పూర్తికాకముందే కీలకమైన నాలుగు వికెట్లు తీసి పంజాబ్‌ను చుట్టేసి ఢిల్లీకి ‘అమితా’నందాన్ని అందించాడు.

న్యూఢిల్లీ: తొలి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఎదురైన పరాజయాన్ని మరిపిస్తూ.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఐపీఎల్-9లో విజయాల బోణీ చేసింది. కుర్రాళ్లతో బరిలోకి దిగినా... నాణ్యమైన ఆటతీరుతో సొంతగడ్డపై చెలరేగిపోయింది. అమిత్ మిశ్రా (4/11) స్పిన్ మ్యాజిక్‌కు తోడు బ్యాటింగ్‌లో నిలకడ చూపడంతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై గెలిచింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా, పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 111 పరుగులు చేసింది. మన్నన్ వోహ్రా (24 బంతుల్లో 32; 5 ఫోర్లు), ప్రదీప్ సాహు (12 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 13.3 ఓవర్లలో 2 వికెట్లకు 113 పరుగులు చేసింది. డికాక్ (42 బంతుల్లో 59 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), సంజూ శామ్సన్ (32 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక భాగస్వామ్యంతో  ఆకట్టుకున్నారు.

 మిశ్రా మ్యాజిక్
పిచ్ నుంచి లభించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఢిల్లీ బౌలర్లు ఆరంభం నుంచే చెలరేగారు. రెండో ఓవర్‌లో మురళీ విజయ్ (1)ను రనౌట్ చేయడంతో పంజాబ్ 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత వోహ్రా, మార్ష్ (13)లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆరో ఓవర్‌లో వోహ్రా మూడు ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో పంజాబ్ స్కోరు 37/1కి చేరుకుంది. ఈ దశలో స్పిన్నర్ మిశ్రా పంజాబ్‌ను స్పిన్ ఉచ్చులో బిగించాడు. తన తొలి ఓవర్ రెండో బంతికి మార్ష్‌ను అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

తర్వాత తన రెండో ఓవర్‌లో నాలుగు బంతుల తేడాలో మిల్లర్ (9), మ్యాక్స్‌వెల్ (0)లను వెనక్కిపంపి షాకిచ్చాడు. ఇక తన మూడో ఓవర్‌లో నిలకడగా ఆడుతున్న వోహ్రానూ పెవిలియన్‌కు చేర్చడంతో పంజాబ్ 59 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. ఇక్కడి నుంచి ఢిల్లీ బౌలర్లు మరింత పకడ్బందిగా బౌలింగ్, ఫీల్డింగ్ చేయడంతో పంజాబ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా (3), అక్షర్ పటేల్ (11) నిరాశపర్చినా... మోహిత్ శర్మ (15) భారీ సిక్సర్, ఫోర్‌తో ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ జహీర్, మోరిస్ వరుస ఓవర్లలో శర్మతో పాటు జాన్సన్ (4)ను అవుట్ చేయడంతో పంజాబ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.

 అద్భుత భాగస్వామ్యం
లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లలో శ్రేయస్ అయ్యర్ (3) విఫలమైనా... డికాక్, శామ్సన్ ఆచితూచి ఆడారు. భారీ షాట్లకు పోకుండా స్ట్రయిక్‌ను రొటేట్ చేయడంతో పవర్‌ప్లేలో రన్‌రేట్ బాగా మందగించింది. ఐదో ఓవర్‌లో క్యాచ్ అవుట్ ప్రమాదం నుంచి బయటపడ్డ డికాక్ ఆ తర్వాత వరుస ఫోర్లతో ఒత్తిడిని తగ్గించుకున్నాడు. రెండో ఎండ్‌లో సాహుకు భారీ సిక్సర్ రుచి చూపెట్టిన శామ్సన్ వీలైనంత వేగంగా ఆడాడు. దీంతో 11 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 79/1కి చేరుకుంది. జాన్సన్ వేసిన 12వ ఓవర్‌లో డికాక్ ఓ సిక్స్, రెండు ఫోర్లతో 17 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 13వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి శామ్సన్ అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 10.4 ఓవర్లలో 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక 42 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో డికాక్ ఓ ఫోర్, పవన్ నేగి (8 నాటౌట్) ఓ సిక్స్ బాది విజయాన్ని ఖాయం చేశారు.

స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ రనౌట్ 1; వోహ్రా (బి) మిశ్రా 32; మార్ష్ (స్టం) డికాక్ (బి) మిశ్రా 13; మిల్లర్ ఎల్బీడబ్ల్యు (బి) మిశ్రా 9; మ్యాక్స్‌వెల్ (సి) బ్రాత్‌వైట్ (బి) మిశ్రా 0; అక్షర్ (సి) నేగి (బి) జయంత్ 11; సాహా రనౌట్ 3; జాన్సన్ (బి) మోరిస్ 4; మోహిత్ (సి) మోరిస్ (బి) జహీర్ 15; ప్రదీప్ సాహు నాటౌట్ 18; సందీప్ శర్మ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 111.
వికెట్ల పతనం: 1-8; 2-37; 3-52; 4-52; 5-59; 6-65; 7-73; 8-90; 9-99.
బౌలింగ్: జహీర్ 4-1-14-1; నేగి 1-0-10-0; మోరిస్ 4-0-19-1; బ్రాత్‌వైట్ 4-0-33-0; మిశ్రా 3-0-11-4; జయంత్ యాదవ్ 4-0-23-1.

 ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ నాటౌట్ 59; అయ్యర్ (సి) సాహా (బి) సందీప్ 3; శామ్సన్ (బి) అక్షర్ 33; పవన్ నేగి నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (13.3 ఓవర్లలో 2 వికెట్లకు) 113.
వికెట్ల పతనం: 1-9; 2-100.
బౌలింగ్: సందీప్ 2-1-6-1; జాన్సన్ 3-0-28-0; మోహిత్ శర్మ 2-0-10-0; అక్షర్ పటేల్ 3-0-25-1; ప్రదీప్ సాహు 2.3-0-27-0; మ్యాక్స్‌వెల్ 1-0-11-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement