
కంటికి బౌన్సర్ తగిలి కుప్పకూలాడు!
వెల్లింగ్టన్: న్యూజీలాండ్ ఆటగాడు మిచేల్ మెక్‌క్లాన్‌గన్ బౌన్సర్ ధాటికి మైదానంలో కుప్పకూలాడు. పాకిస్థాన్ బౌలర్ అన్వర్ అలీ మెరుపువేగంతో వేసిన బౌన్సర్.. మిచేల్ ధరించిన హెల్మెట్‌ను దాటుకొని మరీ అతని ఎడుమ కన్నును బలంగా ఢీకొంది. దీంతో బాధతో విలవిలలాడుతూ అతను మైదానంలో పడిపోయాడు. వెల్లింగ్టన్‌లో సోమవారం న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.
టెయిల్ ఎండర్‌గా బరిలోకి దిగిన మిచేల్ మైదానంలోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే.. బౌన్సర్ అతనిపై విరుచుకుపడింది. దీంతో కన్ను చుట్టు రక్తస్రావం జరిగి నొప్పితో విలవిలల్లాడుతున్న అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి కొన్ని కుట్లు వేశారు. కంటి చుట్టు ఉన్న ఎముకలు కొన్ని విరిగాయని, అయితే, తాను బాగున్నానని మిచేల్ ఆ తర్వాత ట్విట్టర్‌లో తెలిపాడు. తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే కన్ను చుట్టు ఉన్నఎముక స్వల్పంగా విరుగడం వల్ల మిచేల్‌కు చిన్నపాటి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరముందని వైద్యులు తెలిపారు.