న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా జట్టుతో స్వదేశంలో వచ్చే నెలలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని భారత సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే టి20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు యువ క్రీడాకారిణులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మిథాలీ రాజ్‌ను టి20 జట్టులోకి ఎంపిక చేస్తారో లేదో అనుమానంగా ఉంది. జట్టును ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 5న సెలెక్టర్లు సమావేశం కానున్నారు.
36 ఏళ్ల మిథాలీ 2021 వన్డే వరల్డ్ కప్‌లో ఆడతానని చెప్పినా... టి20 ఫార్మాట్‌లో మాత్రం ఆమెను జట్టులో కొనసాగించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ‘దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌కు నేను అందుబాటులో ఉన్నాను. అయితే వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ గురించి ఇంకా ఆలోచించలేదు. ప్రస్తుతమైతే ఒక్కో సిరీస్‌పైనే దృష్టి పెట్టాను’ అని మిథాలీ తెలిపింది. ‘మిథాలీ గొప్ప క్రికెటర్. కానీ టి20 కెరీర్‌పై ఆమె తొందరగానే ఓ నిర్ణయం తీసుకోవాలి. టి20 వరల్డ్ కప్ మరో ఆరు నెలల్లోనే ఉంది. ఈలోపు కొంతమంది యువ క్రీడాకారిణులకు అవకాశం ఇవ్వాలి. మిథాలీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి’ అని బీసీసీఐ అధికారొకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment