సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ తాజాగా నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పరిమితమయ్యారు. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీ (725 పాయింట్లు) అగ్రస్థానంలో నిలవగా, ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ (718 పాయింట్లు) రెండో ర్యాంకు దక్కించుకున్నారు. గతేడాది అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించడంతో కెప్టెన్ మిథాలీ నెంబర్ వన్ ర్యాంకు సాధించారు. కాగా, తాజాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో విఫలం కావడంతో మిథాలీ (707 పాయింట్లు) టాప్ ర్యాంకును కోల్పోవడంతో పాటు రెండు స్థానాలు కిందకి దిగారు.
ఎగబాకిన మంధాన.. హర్మన్ ర్యాంకు కిందకి!
సఫారీలతో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత ఓపెనర్ స్మృతీ మంధాన 14 ర్యాంకులు ఎగబాకారు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో 21వ ర్యాంకులో నిలిచారు. తాజా వన్డే సిరీస్‌లో 84, సెంచరీ (135) ఇన్నింగ్స్‌లతో మంధాన (503 పాయింట్లు) మెరుగైన ర్యాంకు సాధించారు. అదే సమయంలో భారత మరో స్టార్ క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ (660 పాయింట్లు) రెండు స్థానాలు కోల్పోయి 7వ ర్యాంకులో ఉన్నారు.
బౌలర్లలో మరిజాన్నే కాప్ టాప్..
ఐసీసీ బాలర్ల తాజా వన్డే ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా పేసర్ మరిజాన్నే కాప్ (653 పాయింట్లు) అగ్రస్థానాన్ని నిలుపుకున్నారు. వన్డే క్రికెట్లో 200 వికెట్లు సాధించిన తొలి మహిళా బౌలర్‌గా నిలిచిన భారత వెటరన్ క్రికెటర్ జులన్ గోస్వామి (643 పాయింట్లు) రెండో ర్యాంకులో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment