
నాల్గో టెస్టులో షమీ!
ఆస్ట్రేలియాతో జరిగే నాల్గో టెస్టులో భారత ప్రధాన పేసర్ మొహ్మద్ షమీ ఆడటం దాదాపు ఖాయంగానే కనబడుతోంది.
ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరిగే నాల్గో టెస్టులో భారత ప్రధాన పేసర్ మొహ్మద్ షమీ ఆడటం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. ప్రస్తుతం భారత జట్టుతో కలిసిన షమీ ప్రాక్టీస్లో పాల్గొంటున్నాడు. గతేడాది నవంబర్ లో ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు తరపున షమీ చివరిసారి కనిపించాడు. ఆ సమయంలో గాయపడిన షమీ దాదాపు నాలుగు నెలల పాటు జట్టుకు దూరమయ్యాడు. అయితే ఇటీవల విజయ్ హజారే వన్డే ట్రోఫీ సందర్బంగా బెంగాల్ తరపున ఆడిన షమీ నాలుగు వికెట్లతో రాణించి తన ఫిట్ నెస్ను నిరూపించుకున్నాడు. దాంతో భారత్ జట్టులో చేరేందుకు షమీకి మార్గం సుగమైంది.
ఆసీస్ తో నాలుగు టెస్టులు సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ లో ఐదుగురు బౌలర్లతో ఆడే అవకాశం ఉంటే మాత్రం షమీ ఆడటం ఖాయం. అలా కాకుండా నలుగురు బౌలర్లతో బరిలోకి దిగితే మాత్రం ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ల్లో ఒకరికి విశ్రాంతినిస్తే కానీ షమీ ఆడటం కుదరుదు. నాల్గో టెస్టులో షమీని ఆడించేందుకు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి మొగ్గుచూపుతున్నాడు. ఆ క్రమంలోనే అతను ఫిట్నెస్ నిరూపించుకున్న మరుక్షణమే జట్టులో స్థానం కల్పించారు. దీనిలో భాగంగానే ఈ నెల 25వ తేదీ నుంచి ఆరంభమయ్యే దేవధార్ ట్రోఫీలో పాల్గొనే జట్టుల్లో కూడా షమీకి చోటు కల్పించలేదు.