ధోని ఫేవరెట్ సీట్ అది!
న్యూఢిల్లీ: ట్వంటీ 20 వరల్డ్ కప్(2007), వన్డే వరల్డ్ కప్(2011), చాంపియన్స్ ట్రోఫీ(2013) లను భారత జట్టుకు అందించిన ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే ఈ మూడు మెగా టోర్నీల్లో టైటిల్ అందుకుని భారత క్రికెట్ జట్టు ప్రతిష్టను మరింత పెంచాడు. ఇదే కాకుండా ధోని వ్యక్తిగత రికార్డులు అమోఘం. వన్డే ఫార్మాట్ లో వికెట్ కీపర్ గా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రికార్డు ధోనిదే. 2005లో శ్రీలంకపై ధోని(183 నాటౌట్) ఆ ఘనత సాధించాడు.
తాజాగా అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన రెండో వికెట్ కీపర్ గా నిలవడమే కాకుండా, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో ఐదో స్థానం పొందాడు. మరొకవైపు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. 294 మ్యాచ్‌లలో ధోని 9,442 పరుగులు చేసి దిగ్గజాల సరసన నిలిచాడు. ఇలా చెప్పుకుంటే పోతే ధోని సాధించిన ఘనతలు చాలానే ఉన్నాయి.
కాగా, ఎన్ని సాధించిన కూల్ గా ఉండాలనేది ధోని సిద్ధాంతం. సమస్యను సవాల్ గా స్వీకరించే తత్వం ఉన్న ధోని.. జట్టు విజయాల్ని వెనుకే ఉండి పంచుకుంటాడు. ట్రోఫీలతో ఆటగాళ్లు ముందు ఉంటే ధోని మాత్రం వెనక వరుసలో ఉంటాడు. అది కెప్టెన్సీ హోదాలో ఉన్నా లేకపోయినా ధోని స్థానం అదే. ఇక టీమిండియా బస్సులో ప్రయాణించే సమయంలో కూడా ధోనికి ఆఖరి వరుస సీట్ అంటే చాలా ఇష్టమట. అంతర్జాతీయ కెరీర్ ను ఆరంభించిన నాటి నుంచి ఇప్పటివరకూ ధోని చివరి సీట్లోనే ప్రయాణిస్తున్నాడట. కెరీర్ ను ఆరంభించిన కొత్తలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరుల్ని గౌరవించే క్రమంలో ధోని ఆఖరి సీట్లో కూర్చొనేవాడట. దీన్ని అప్పట్నుంచి అలవాటుగా మార్చుకున్న ధోని ఆ ప్లేస్ ను ఇష్టమైనదిగా మార్చేసుకున్నాడు. ఇటీవల వెస్టిండీస్ తో మూడో వన్డే తరువాత కూడా ఆటగాళ్లు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో శిఖర్ ధావన్ సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక్కడ ధోని చివరి వరుసలో కనిపించడంతో అది చర్చనీయాంశంగా మారింది. వికెట్ల వెనుక కూల్ గా వ్యూహాలు రచించే ధోని.. బస్సులో కూడా వెనుకాలే కూర్చొని ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడనే విషయం అర్దమవుతోంది కదా.