నేను వైన్ లాంటోడ్ని: ధోని
ఆంటిగ్వా:వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ధనాధన్ మెరుపులు మెరిపించాడు. 79 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగులు చేసి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే ధోని పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన రెండో వికెట్ కీపర్ గా నిలవడమే కాకుండా, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో ఐదో స్థానం పొందాడు. మరొకవైపు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. 294 మ్యాచ్‌లలో ధోని 9,442 పరుగులు చేసి దిగ్గజాల సరసన నిలిచాడు.
ఇదిలా ఉంచితే, నిన్నటి మ్యాచ్లో అటు బ్యాటింగ్ లోనూ ఇటు కీపింగ్లోనూ ఆకట్టుకున్న ధోని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. దీనిలో భాగంగా పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో ధోని సరదాగా మాట్లాడాడు. తన వయసుతో పాటు ఆట కూడా మెరుగవుతుందంటూ అభిప్రాయపడ్డ ధోని.. తాను వైన్ లాంటోడ్ని అని చమత్కరించాడు. ప్రధానంగా టాపార్డర్ రాణించడంతోనే తాను సులువుగా పరుగులు సాధించడానికి ఆస్కారం ఏర్పడిందని ధోని పేర్కొన్నాడు. గత కొంతకాలంగా భారత టాపార్డర్ అద్వితీయంగా ఉందంటూ కొనియాడాడు. దాంతో మిడిల్ ఆర్డర్లో చక్కటి స్కోరు చేయడానికి అవకాశం దొరుకుతుందన్నాడు.