
ఈసారి కూడా ధోనికి నిరాశేనా?
న్యూఢిల్లీ: భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోని పేరును దేశ మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుకు బీసీసీఐ సిఫారుసు చేసిన సంగతి తెలిసిందే. అయితే ధోనికి పద్మభూషణ్ పురస్కారం లభించే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఈ అవార్డుకు ధోని పేరును మాత్రమే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సిఫారుసు చేసినా ఉపయోగంలేనట్లే కనబడుతోంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ధోని పేరును ప్రభుత్వం మరోసారి తిరస్కరించినట్లు తెలుస్తోంది.
గతంలో ఈ అవార్డుకు 2013, 16ల్లోనూ ధోని పేరును బీసీసీఐ నామినేట్ చేసినా అప్పట్లో కేంద్రం తిరస్కరించింది. 2013 ఐపీఎల్లో భాగంగా స్పాట్ ఫిక్సింగ్ కేసులో ధోని పేరు పదే పదే సుప్రీంకోర్టులో ప్రస్తావనకు రావడం వల్ల ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు అతని పేరును తిరస్కరించారు. అప్పట్లో పెద్ద దుమారం రేపిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్ పై నిషేధం పడినప్పటికీ, ఫిక్పింగ్ తో ధోనికి సంబంధాలున్నట్లు రుజువు కాలేదు. అయినప్పటికీ ఆ స్పాట్ ఫిక్సింగ్ ను సాకుగా చూపే అప్పట్లో ధోనికి పద్మభూషణ్ ను ఇవ్వడానికి కేంద్రం మొగ్గు చూపలేదు. ఈసారి కూడా అదే రిపీట్ అయ్యేటట్లు కనబడుతోంది.
టీమిండియాకు రెండు ప్రపంచకప్లు(2007 ట్వంటీ 20 వరల్డ్ కప్,2011 వన్డే ప్రపంచకప్) సాధించిన ఘనత ధోనిది. మరొకవైపు దాదాపు పదివేల వన్డే పరుగులకు కూడా ధోని చేరువయ్యాడు. ఇటీవల మూడొందల వన్డేను పూర్తి చేసుకున్న ధోని..ఈ ఘనత సాధించిన అరుదైన క్రికెటర్ల జాబితాలో కూడా చేరిపోయాడు. అదే క్రమంలో వన్డేల్లో వంద స్టంపింగ్లతో సరికొత్త రికార్డును ధోని లిఖించాడు. భారత క్రికెట్ లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ధోని.. పద్మభూషణ్ అందుకోవడానికి అన్నివిధాలుగా అర్హుడిగానే చెప్పాలి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ధోని పేరును బీసీసీఐ ఏకగ్రీవంగా సిఫారుసు చేసింది. మరి ప్రభుత్వం మాత్రం ధోనికి పద్మభూషణ్ ఇవ్వడానికి వెనుకడుగు వేసినట్లు సమాచారం.