సాక్షి, స్పోర్ట్స్ (మాంచెస్టర్): మూడు టీ20ల భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టుపై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతంగా కీపింగ్ చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించిన వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన కీపర్‌గా మహేంద్రుడు ప్రపంచ రికార్డ్ సాధించాడు. పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ పేరిట ఉన్న రికార్డును ‘మిస్టర్ కూల్’ ధోని అధిగమించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 13 ఓవర్లు ముగిసేసరికి కేవలం 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి పటిష్టస్థితిలో ఉంది. అదే ఫామ్ కొనసాగిస్తే ఆతిథ్య జట్టుకు 200 పరుగులు సులువే. కానీ 14వ ఓవర్లో కుల్దీప్ మ్యాజిక్ మొదలైంది. ఈ చైనామన్ బౌలర్ మూడో(ఇన్నింగ్స్14వ) ఓవర్ ఇంగ్లండ్ పతనానికి కారణమైంది. ఓ ఓవర్ తొలి బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ (7) ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి అందుకోగా నిరాశగా వెనుదిరిగాడు. అపై అదే ఓవర్లో మూడో బంతికి ధోని అద్భుతంగా స్టంపింగ్ చేయడంతో జానీ బెయిర్‌స్టో (0) ఔటయ్యాడు. ఈ వికెట్‌తో కమ్రాన్ అక్మల్ (32 వికెట్లు) పేరిట ఉన్న స్టంపౌట్ల రికార్డును ఎంఎస్ ధోని సమం చేశాడు. ఆ మరుసటి బంతికే జో రూట్‌ను ధోని స్టంపౌట్ చేసి డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టించాడు మహీ. దీంతో టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ (33) చేసిన వికెట్ కీపరగా ధోని నిలిచాడు.
ధోని ఆలోచనల్ని సరిగ్గా అమలుచేసిన కుల్దీప్(5/24) అద్భుత బౌలింగ్‌కు ఇంగ్లండ్ నుంచి సమాధానం కరువై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లోకేశ్ రాహుల్(101; 54 బంతుల్లో 10ఫోర్లు, 5సిక్సర్లు) అజేయ శతకంతో రాణించగా, ఓపెనర్ రోహిత్ శర్మ (30; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్) పరవాలేదనిపించాడు. కెప్టెన్ కోహ్లితో కలిసి రాహుల్ లక్ష్యాన్ని పూర్తి చేసి సిరీస్‌లో టీమిండియాను 1-0 ఆధిక్యంలో నిలిపాడు.
టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్లు
- 33 ఎంఎస్ ధోని
- 32 కమ్రాన్ అక్మల్
- 28 మహ్మద్ షెహజాద్
- 26 ముష్ఫీకర్ రహీం
- 20 కుమార సంగక్కర
Comments
Please login to add a commentAdd a comment