న్యూఢిల్లీ:ఇటీవల కాలంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రికెట్ భవిష్యత్తుపై తీవ్రంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పొట్టి ఫార్మాట్ కు ధోని గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందంటూ మాజీ ఆటగాళ్లు అజిత్ అగార్కర్, వీవీఎస్ లక్ష్మణ్, ఆకాశ్ చోప్రాలు వ్యాఖ్యానించారు. ఇక ధోని తన స్థానాన్ని యువకులకు వదులుకుని టీ 20 ఫార్మాట్ కు దూరంగా ఉండాలని వారు సూచించారు. అయితే ధోనికి కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో పాటు దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ లు అండగా నిలిచారు. కేవలం ధోనినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాగా, టీ 20 ఫార్మాట్ నుంచి వైదొలగాలంటూ తనపై వస్తున్న విమర్శలపై ధోని స్పందించాడు.
'దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్పగా భావిస్తున్నా. ఇది నా వరకూ అయితే బెస్ట్ మోటివేషన్. నేను దేశం తరపున కొన్నేళ్లగా క్రికెట్ ఆడుతున్నా. కొంతమంది ఒక సంవత్సరం నుంచి 15 ఏళ్ల వరకూ క్రికెట్ ఆడగలరు. మరికొంతమంది 20 ఏళ్లు క్రికెట్ ఆడతారు. ఇక్కడ 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లు క్రికెట్ ఆడటం అనేది సమస్య కాదు. ఒక్కసారి దేశానికి ప్రాతినిథ్యం వహించినా అదొక గొప్ప గౌరవం. భారత క్రికెట్ జట్టులో భాగస్వామ్యం కావడం అనేది చాలా పెద్ద ఘనత. నేను నా శక్తి సామర్థ్యాలను మాత్రమే నమ్ముతాను. 10 గేమ్ లు పాటు దూరంగా ఉన్నా జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడాలి.
నేను నమ్మేది ఒక్కటే అవసరానికి తగ్గట్టు ఆడటమే. ఇక్కడ ఫలితం అనేది ప్రధానం కాదు. నేను ఎప్పుడూ రిజల్ట్ కోసం ఆలోచించను..జట్టు ప్రయోజనాల కోసం ఆడుతున్నానా, లేదా అనేది మాత్రమే ఆలోచిస్తా. ఒకసారి మ్యాచ్ ముగిసిపోయాక నేను ఎలా ఆడాను అనేది పరిశీలించుకుంటా. సాధ్యమైనంత వరకూ నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నిస్తా. ఆ క్రమంలోనే ఫలితాన్ని అంగీకరిస్తా. మ్యాచ్ లో సిక్స్ కొట్టి విజయాన్ని అందించినా అది అవసరానికి తగ్గట్టు మాత్రమే ఉండాలనేది నా సిద్ధాంతం'అని ధోని పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ తో ట్వంటీ 20 సిరీస్ లో భాగంగా రాజ్ కోట్ లో జరిగిన రెండో మ్యాచ్ లో ధోని బంతుల్ని వృథా చేయడంతో విమర్శలు మొదలయ్యాయి. ఆ మ్యాచ్ లో ధోని 49 పరుగుల్ని సాధించి పెవిలియన్ చేరాడు. కాగా, టీ 20 ప్రమాణాల ప్రకారం ధోని ఆడలేదంటూ పలువురు విమర్శలకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment