
మహేంద్ర సింగ్ ధోని
ముంబై: వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ తర్వాత భారత జట్టుకు దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అతని రిటైర్మెంట్ లేదా ఆటలో కొనసాగడంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై ధోని మొదటిసారి స్వయంగా స్పందించాడు. అదీ ఏకవాక్యంలో! పునరాగమనం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...‘జనవరి వరకు నన్నేమీ అడగొద్దు’ అని తేల్చేశాడు. బుధవారం ‘పనెరై’ అనే వాచీ కంపెనీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ధోని తన కెరీర్‌కు సంబంధించిన రెండు అత్యుత్తమ క్షణాలను పంచుకున్నాడు.
‘సుదీర్ఘ కెరీర్‌లో రెండు సంఘటనలు నా మనసుకు అత్యంత చేరువగా నిలిచాయి. అలాంటివి మళ్లీ రావు. 2007 టి20 ప్రపంచ కప్ గెలిచి స్వదేశం తిరిగొచ్చిన తర్వాత ముంబైలో ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు జరిగింది. ఆ సమయంలో ప్రఖ్యాత మెరైన్ డ్రైవ్ ఈ మూల నుంచి ఆ మూల వరకు పూర్తిగా నిండిపోయింది. తమ పనులన్నీ వదిలేసుకొని వారంతా మా కోసం వచ్చారు. వారి కళ్లలో ఎంతో ఆనందం కనిపించింది. ఇక 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విజయానికి 1520 పరుగుల దూరంలో ఉన్నప్పుడు స్టేడియంలో ప్రేక్షకులు వందేమాతరం నినాదంతో హోరెత్తించారు’ అని ధోని గుర్తు చేసుకున్నాడు.
భార్య సంతోషమే నా సంతోషం!
కెప్టెన్‌గా తాను ఎన్ని విజయాలు సాధించినా ఇంట్లో మాత్రం భార్య సాక్షి మాటే చెల్లుబాటు అవుతుందని ధోని సరదాగా వ్యాఖ్యానించాడు. వయసుతో పాటు భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత దృఢమవుతుందని అతను అభిప్రాయపడ్డాడు. ‘పెళ్లయ్యేంత వరకు అందరు మగాళ్లు సింహాల్లాగే ఉంటారు. నేను ఆదర్శవంతమైన భర్తను. ఎందుకంటే నా భార్య ఏం చేయాలనుకున్నా నేను అడ్డు చెప్పను. నా భార్య సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. అది జరగాలంటే ఆమె ఏం చెప్పినా నేను తలూపాల్సిందే. నా దృష్టిలో 50 ఏళ్ల వయసు దాటిన తర్వాతే వివాహ బంధం అసలు ఆనందం ఏమిటో తెలుస్తుంది. బాధ్యతలకు దూరంగా ఒకరినొకరు ప్రేమించుకునేందుకు అది సరైన వయసని భావిస్తున్నా’ అని కెప్టెన్ కూల్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment