ఆ దిగ్గజ క్రికెటర్లు నా దగ్గరకు వస్తారు! | Mumbai BatMan Aslam Chaudhry Busy While IPL | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 30 2018 5:31 PM | Last Updated on Mon, Apr 30 2018 5:57 PM

Mumbai ‘BatMan’ Aslam Chaudhry, Busy While IPL - Sakshi

అస్లాం చౌదరీ

సాక్షి, ముంబై: ఐపీఎల్‌ క్రికెట్‌ అంటే దంచుడే, దంచుడు. ఏ బ్యాట్స్‌మన్‌ అయినా దొరికిన బంతిని బలంగా బాదడం తప్పనిసరి. సిక్సర్ల వర్షంతో ఎలాంటి బ్యాటయినా విరిగిపోవడం, పాడవడం పరిపాటి. అయితే అవన్నీ మామూలు బ్యాట్లయితే పర్లేదు. వాటిని పక్కన పడేసి కొత్త బ్యాట్లందుకుంటారు బ్యాట్స్‌మెన్‌. కానీ ఎంతో అచ్చొచ్చిన బ్యాటయితే ఎలా మరి? దాన్ని త్వరగా, చక్కగా బాగుచేసి బ్యాట్స్‌మెన్‌ను బతికించేదెవరు? అనే ప్రశ్నకు సమాధానం ముంబైకి చెందిన అస్లాం చౌదరీ.  అతన్ని ముద్దుగా అందరూ ఐపీఎల్‌ ‘బ్యాట్‌మన్‌’. అని పిలుస్తారు.  ఎప్పుడో 1920లో తన తండ్రి ప్రారంభించిన బ్యాట్ల తయారీ వర్క్‌ షాప్‌ని అస్లాం నిర్వహిస్తున్నారు.

షాప్‌ పాతదే అయినా.. తన కళా నైపుణ్యంతో నాణ్యమైన బ్యాట్లని తయారు చేసి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చౌదరీ. ఎప్పడూ బ్యాట్ల తయారీలో తీరిక లేకుండా మునిగి పోయే 65 ఏళ్ల అస్లాం ఐపీఎల్‌ సీజన్‌ వస్తే ఇంకాస్త బిజీ అయిపోతారు. తమకు బాగా కలిసొచ్చిన బ్యాట్లను రిపేరు చేయడానికి గొప్ప  క్రికెట్‌ స్టార్లు ఆయనను ఆశ్రయిస్తారు. అస్లాం ఆదివారం ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్యాట్ల తయారీ ప్రస్థానాన్ని వివరించారు. తండ్రి చూపిన దారిలో పయనిస్తూ తన నాణ్యమైన క్రికెట్‌ బ్యాట్ల తయారీ పరంపరను చెప్పుకొచ్చారు.

ఎప్పుడూ క్రికెటర్ల మేనేజర్లు, సహాయక సిబ్బంది ఫోన్‌ చేసి ఆయా స్టార్ల బ్యాట్లకు మరమ్మతులు చేయాలని పిలుస్తుంటారు. కానీ ఒకసారి స్వయంగా విరాట్‌ కోహ్లి ఫోన్‌ చేశాడని, తాను ఒక్క క్షణంపాటు.. మాట్లాడేది విరాట్‌ కాదేమోనని సంశయించానని అస్లాం తన ఆనందం వ్యక్తం చేశారు. సచిన్‌, డుప్లెసిస్‌, స్టీవ్‌ స్మిత్‌, క్రిస్‌ గేల్‌ వంటి దిగ్గజ క్రికెటర్లకు బ్యాట్లు అందించానని ఈ బ్యాట్‌మన్‌ చెప్పుకొచ్చారు. అయితే ‘‘ఐపీఎల్‌ సీజన్‌లో బ్యాట్లకు మరమ్మతులు చేయడం కొంచెం ఇబ్బందే. ఎందుకంటే తమ సెంటిమెంట్‌ బ్యాట్‌ దెబ్బతిన్నప్పుడు ఏ ఆటగాడికైనా ఏం చేయాలో పాలుపోదు. వారు ఆడబోయే మరుసటి మ్యాచ్‌కి బ్యాట్‌ మరమ్మతులు పూర్తి కావాలి. దాంతో కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.’’ అని అస్లాం తెలిపారు.

తన వద్దకు మరమ్మతులకు వచ్చే బ్యాట్లకు ఎక్కువగా..  వాటి ఆకృతిని సరిచేయడం, బ్యాట్‌ అంచులు పెంచడం లేక తగ్గించడం చేస్తుంటానన్నారు. బ్యాట్ల రిపేర్‌ కోసం క్రికెటర్లు ఉండే చోటుకి వెళ్లి వాటిని తెస్తుంటానని, ఎందుకంటే, ఈ ఇరుకు వీధుల్లోకి ఆటగాళ్లు వస్తే మళ్లీ తిరిగి వెళ్లడం చాలా కష్టమని చెప్పారు. ఒకసారి శ్రీలంక బ్యాట్స్‌మన్‌ లసిత్‌ మలింగ అలా వచ్చి ఇరుక్కుపోయాడని, దాదాపు రెండు గంటలు మా షాప్‌లోనే నిరీక్షించి పోలీసుల సాయంతో బయటపడ్డాడని గుర్తు చేసుకున్నారు. కాగా, ఇప్పటికీ చేతితో బ్యాట్లను తయారు చేసే అతి కొద్ది మందిలో అస్లాం ఒకరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement