'మ్యాచ్ ల తరలింపు'పై సుప్రీంకు..
ముంబై:మహారాష్ట్రలో నీటి కరువు కారణంగా ఆ రాష్ట్రంలో నిర్వహించే మ్యాచ్లను వేరే చోటకి తరలించాలన్న బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఎంసీఏ శుక్రవారం సుప్రీంలో అప్పీల్ చేసింది. 'మహారాష్ట్రలో ప్రజలకు మేము వ్యతిరేకం కాదు. వారి పట్ల మాకు సానుభూతి ఉంది. అయితే క్రికెట్ మ్యాచ్లను తరలించాలనడం సరికాదు'అని ఎంసీఏ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయితే ఎంసీఏ దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది.
మహారాష్ట్రలో నీటి ఎద్దడితో రాష్ట్రంలో జరగాల్సిన 12 మ్యాచ్ లను వేరే చోటకి తరలించాల్సి వచ్చింది. ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లన్నీ తరలించాలని బాంబే హైకోర్టు పేర్కొనడంతో ముంబై ఇండియన్స్, పుణె సూపర్ జెయింట్స్, కింగ్స్ పంజాబ్ జట్ల హోం గ్రౌండ్ లను మార్చాల్సి వచ్చింది. దీంతో పుణె సూపర్ జెయింట్స్ తన హోం గ్రౌండ్ గా విశాఖను ఎంచుకోగా, ముంబై ఇండియన్స్ తన హోం పిచ్ గా జైపూర్ ను, కింగ్స్ పంజాబ్ ధర్మశాలను హోం గ్రౌండ్ గా ఎంచుకున్నాయి.