ఆన్‌లైన్‌లో ఐపీఎల్ హక్కుల వేలానికి సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: ఐపీఎల్‌కు సంబంధించిన టీవీ, ఇంటర్‌నెట్, మొబైల్ ప్రసార హక్కులను ఈ–వేలం ద్వారా నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. లోధా ప్యానెల్ సూచించినట్టుగా బోర్డు పారదర్శకతలో భాగంగా ఈ–వేలంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి గతంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ–వేలం తప్పనిసరేమీ కాదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, ఖన్‌విల్కర్, చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.
ఐదేళ్లపాటు ఉండే ఈ హక్కుల కోసం ఇప్పటికే 24 కంపెనీలు బిడ్ డాక్యుమెంట్లను కొనుగోలు చేశాయి. స్టార్ ఇండియా, సోనీ పిక్చర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ మూడింటి హక్కుల ద్వారా రూ.20 వేల కోట్ల రాబడిని బోర్డు అంచనా వేస్తోంది. వచ్చే నెల 4 వరకు బిడ్డింగ్‌కు గడువుంది. అయితే స్వామి పిటిషన్‌కు కౌంటర్‌గా ప్రస్తుతం కొనసాగుతున్న టెండర్ ప్రక్రియ ఎలా మెరుగైందో తెలపాలని గత నెల 28న సీఓఏను కోర్టు కోరింది.
దీంతో ప్రస్తుత టెండర్ ప్రక్రియ ఉత్తమమైందని, ఆసక్తి ఉన్నవారు తమ బిడ్డింగ్ ధరను సీల్డ్ కవర్‌లో అందిస్తారని సీఓఏ తరఫున సీనియర్ అడ్వకేట్ పరాగ్ త్రిపాఠి కోర్టుకు తెలిపారు. ప్రసార హక్కుల పేరిట రూ. 25 వేల నుంచి 30 వేల కోట్లు ఇందులో భాగస్వామ్యం కానుందని, అందుకే ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ–వేలం ద్వారా నిర్వహించేందుకు సూచించాలని స్వామి కోర్టుకు విన్నవించారు. అయితే సీఓఏ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన కోర్టు ఆయన కోరికను తిరస్కరించింది.