సంతోషంగా వైదొలుగుతా: శరద్ పవార్
న్యూఢిల్లీ:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లోనూ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో డబ్బై ఏళ్లకు పైబడిన వారు సభ్యులుగా ఉండకూడదనే జస్టిస్ లోథా కమిటీ సిఫారుసులను ఇటీవల సుప్రీంకోర్టు సమర్ధించడంతో ముంబై క్రికెట్ అసోషియేషన్ (ఎంసీఏ) చీఫ్ శరద్ పవార్ తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. గతంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అధ్యక్షుడిగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా పని చేసిన శరద్ పవార్..ప్రస్తుతం ఎంసీఏ చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే 70 ఏళ్లు పైబడిన వారు బీసీసీఐలో, రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు కాకూడదని జస్టిస్ లోథా కమిటీ సిఫారుసులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో శరద్ పవార్ తన పదవికి దూరం కావాల్సి వస్తుంది.
ఈ మేరకు శరద్ పవార్ అధ్యక్షతన ఎంసీఏ మేనేజింగ్ కమిటీ ఆదివారం ముంబైలో సమావేశంమైంది. 'మేము సుప్రీంకోర్టు ఆదేశాలపై, లోథా కమిటీ సిఫారుసులపై చర్చించాం. వాటిని అమలు చేయడానికి ఎంసీఏ కట్టుబడి ఉంది. తాజా సుప్రీం రూలింగ్ తో నేను పదవికి దూరం కావాలి. నేను సంతోషంగా వైదులుగుతా. న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవం ఉంది. కాకపోతే ఒక రాష్ట్రానికి ఒక ఓటుపై ఇంకా కొంత స్పష్టత రాలేదు. మహారాష్ట్రలో మూడు క్రికెట్ అసోసియేషన్లో ఉన్నాయి. ఇక్కడ రొటేషన్ పాలసీ అమలు చేయాలంటే, ముందుగా మేనేజింగ్ కమిటీ ఆమోదంతో ఎంసీఏను పునర్ వ్యవస్థీకరించాలి. దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది' అని సమావేశం అనంతరం శరద్ పవార్ స్పష్టం చేశారు.