
రాణించిన నితీష్ రానా
కాన్పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం గ్రీన్ పార్క్ స్టేడియంలో గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఆదిలో తడబడినా, నితీష్ రానా(70;36 బంతుల్లో 7 ఫోర్లు,4 సిక్సర్లు) ఆదుకున్నాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ(30;17 బంతుల్లో4 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి నిష్ర్కమించాడు. అనంతరం మరో ఓపెనర్ మార్టిన్ గప్తిల్(7), కృనాల్ పాండ్య(4) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో ముంబై 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో రానా-బట్లర్ ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఓ వైపు రానా ధాటిగా ఆడుతుంటే, బట్లర్(33;31 బంతుల్లో 3 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. ఈ జోడి 75 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో ముంబై తేరుకుంది. ఆ తరువాత పొలార్డ్(9), హర్దిక్ పాండ్యా(8), హర్భజన్ సింగ్(3)లు నిరాశపరచడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి172 పరుగులు నమోదు చేసింది. గుజరాత్ బౌలర్లలో డ్వేన్ స్మిత్, ప్రవీణ్ కుమార్, ధావల్ కులకర్ణి, డ్వేన్ బ్రేవోలు తలో రెండు వికెట్లు సాధించారు.