
ముచ్చటగా మూడోసారి గర్జించిన 'లయన్స్'
ఐపీఎల్ లో కొత్త ఫ్రాంచైజీ జట్టు గుజరాత్ లయన్స్ మరోసారి గర్జించింది. కొత్త జట్టు అయినా.. ఆట మాత్రం ఘనంగా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. చివరి రెండు ఓవర్లలో మ్యాచ్ చేతులు మారుతూ వచ్చింది. చివరి బంతికి ఫోర్ కొట్టి 144 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. గుజరాత్ నిర్ణీత ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.
గుజరాత్ లయన్స్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ మరోసారి హాఫ్ సెంచరీ(67; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) చేసి జట్టును విజయాలబాటలో నడిపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హీరో ఫించ్ ఈ సీజన్ లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ అర్థ శతకాలు బాది జట్టు విజయంలో కీలక పోషించాడు. కెప్టెన్ సురేష్ రైనా (27; 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. బ్రెండన్ మెకల్లమ్(6), దినేష్ కార్తీక్(9), బ్రావో(2) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో మెక్ క్లెనగన్ 4 వికెట్లు పడగొట్టగా, బుమ్రా రెండు వికెట్లు, పాండ్యా ఒక్క వికెట్ తీశారు.
ముంబై ఇన్నింగ్స్:
అంతకుముందు ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి గుజరాత్ లయన్స్ ముందు 144 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటింగ్ చేపట్టిన ముంబై జట్టు ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ్ కొనసాగించింది. ఓపెనర్లలో పార్థీవ్ పటేల్(34) మెస్తరుగా రాణించగా, మిగతా ఆటగాళ్లలో బట్లర్(16),అంబటి రాయుడు(20),టిమ్ సౌతీ(25), కృణాల్ పాండ్యా(20 నాటౌట్)లు మాత్రమే రెండంకెల మార్కును చేరడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కులకర్ణి, తాంబేలు తలో రెండు వికెట్లు సాధించగా, బ్రేవో, జకాతిలకు చెరో వికెట్ దక్కింది. రోహిత్ శర్మ(7) విఫలమయ్యాడు.