మెరిసిన ముంబై.. బెంగళూరు బేజారు
బెంగళూరు: తమ విధ్వంసకారులు విఫలమైన చోట ఓటమిని ఒప్పుకొని, ప్రత్యర్థి జట్టు బాగా ఆడిందంటూ కితాబివ్వడం తప్ప విరాట్ కోహ్లీకి మరో దారిలేదు. అవును. ఐపీఎల్ 9లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బుధవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రతిభ ముందు తలవంచింది. బెంగళూరు విసిరిన 152 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో ఎనిమిది బంతులు ఉండగానే ఛేదించింది.
తెలుగు తేజం అంబటి రాయుడు (44), పొలార్డ్ (35), బట్లర్ (29)లు ముంబై విజయంలో కీలక పాత్ర పోశించారు. ఓపెనర్ రోహిత్ శర్మ 25 పరుగులు చేశాడు. 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై 153 పరుగులు చేసింది. ఈ విజయంతో రోహిత్ సేన పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసిన కుణాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బౌలింగ్కు అనుకూలించిన పిచ్పై బెంగళూరు ఓపెనర్లు విరాట్ కొహ్లీ (7 పరుగులు), క్రిస్గేల్ (5 పరుగులు) ఇద్దరూ విఫలమయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, ఎబీ డివిలియర్స్ ఆచితూచి ఆడుతూ బెంగళూరు ఇన్నింగ్ను చక్కదిద్దారు. తొలి 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులకు చేరింది.
ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్(27 బంతుల్లో 24 పరుగులు) పాండ్యా బౌలింగ్లో వెనుదిరిగినా రాహుల్(53 బంతుల్లో 68, నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ వాట్సన్(14 బంతుల్లో 15)తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు. చివర్లో సచిన్ బేబి(13 బంతుల్లో 25 పరుగులు, నాటౌట్) మెరవడంతో ముంబై ముందు బెంగళూరు 152 పరుగుల టార్గెట్ను ఉంచింది. ముంబై బౌలర్లలో సౌథీ, మెక్క్లెనగన్, పాండ్యాలకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది.