హంటర్స్ అదే కథ.. అదే అదే వ్యథ
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో భాగంగా సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ ల్లో హైదరాబాద్ హంటర్స్ తడబాటును కొనసాగిస్తోంది. సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ముంబై రాకెట్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ హంటర్స్ ఘోరంగా ఓటమిపాలైంది. దీంతో హైదరాబాద్ సొంత మైదానంలో వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది.
తొలుత పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో గురసాయి దత్(ముంబై) 15-12, 15-14 తేడాతో వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ రన్నరప్ సిరిల్ వర్మ(హైదరాబాద్)పై విజయం సాధించాడు. ఇది ముంబైకు ట్రంప్ మ్యాచ్ కావడంతో ఆ జట్టు 2-0 ఆధిక్యం సాధించింది. అనంతరం హైదరాబాద్ ఎంచుకున్న ట్రంప్ సింగిల్స్ మ్యాచ్ లో పారుపల్లి కశ్యప్(హైదరాబాద్) 11-15, 13-15 తేడాతో ప్రణోయ్(ముంబై) చేతిలో ఓడిపోయాడు.
మిక్సడ్ డబుల్స్ లో గుత్తా జ్వాల-మార్కిస్ కిదో(హైదరాబాద్) 8-15, 8-15 తేడాతో కమిల్లా జుహల్-వ్లాదిమిర్ ఇవోనావ్(ముంబై) చేతిలో పరాజయం చవిచూశారు. ఆపై మహిళల సింగిల్స్ లో సుపనిదా(హైదరాబాద్) 15-14, 15-14 తేడాతో లియ్ జి దియ్(ముంబై)పై, పురుషుల డబుల్స్ లో కారస్టెన్ మోగెన్ సెన్-మార్కిస్ కిదో(హైదరాబాద్) 15-7, 15-14 తేడాతో చాయుత్ టి-వ్లాదిమర్ ఇవానోవ్(ముంబై)పై గెలిచారు. అయినప్పటికీ కీలకమైన ట్రంప్ మ్యాచ్ లో ఓటమి పాలుకావడం హైదరాబాద్ విజయావకాశాల్ని దెబ్బతీసింది.. అంతకుముందు ఆదివారం ఇదే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ 3-4 తేడాతో చెన్నై స్మాషర్స్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.