ముంబై, అహ్మదాబాద్‌  ఘనవిజయం | Mumbai Rockets and Ahmadabad Smash Masters Boni | Sakshi
Sakshi News home page

ముంబై, అహ్మదాబాద్‌  ఘనవిజయం

Dec 24 2018 5:37 AM | Updated on Dec 24 2018 5:37 AM

Mumbai Rockets and Ahmadabad Smash Masters Boni - Sakshi

ముంబై: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో ముంబై రాకెట్స్, అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ బోణీ కొట్టాయి. ఆదివారం జరిగిన పోటీల్లో ముంబై 5–0తో ఢిల్లీ డాషర్స్‌పై గెలుపొందగా, అహ్మదాబాద్‌ 4–1తో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌పై విజయం సాధించింది. వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సైనా నెహ్వాల్‌ గాయంతో బరిలోకి దిగలేదు. ముందుగా ఢిల్లీతో జరిగిన పోరులో ముంబై రెండు ట్రంప్‌ మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. పురుషుల డబుల్స్‌ను ముంబై ట్రంప్‌గా ఎంచుకోగా... లీ యంగ్‌ డే–కిమ్‌ జి జంగ్‌ (ముంబై) ద్వయం 14–15, 15–12, 15–9తో వాంగ్‌ సిజి–చై బియావో జంటపై గెలిచింది. తర్వాత రెండు పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లోనూ ముంబై ఆటగాళ్లే గెలిచారు. అండర్స్‌ అంటోన్సెన్‌ (ముంబై) 15–13, 15–7తో సుగియార్తోపై, సమీర్‌ వర్మ (ముంబై) 15–14, 15–9తో ప్రణయ్‌పై నెగ్గారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో లీ యంగ్‌ డే–బెర్నడెత్‌ (ముంబై)జోడీకి 11–15, 12–15తో  మనిపాంగ్‌ జొంగ్‌జిత్‌–చియా సిన్‌ లీ జంట చేతిలో చుక్కెదురైంది. ఢిల్లీ ఎంచుకున్న మహిళల సింగిల్స్‌ ట్రంప్‌ మ్యాచ్‌లో శ్రేయాన్షి పరదేశి (ముంబై) 12–15, 15–8, 15–10తో ఎవజెనియా కొసెట్స్‌కయాపై గెలిచింది. దీంతో –1 పాయింట్‌ వల్ల మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గెలిచిన స్కోరును ఢిల్లీ కోల్పోయింది.
 
స్మాష్‌ మాస్టర్స్‌ జోరు... 
అనంతరం జరిగిన పోరులో పురుషుల డబుల్స్‌ను నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్, పురుషుల సింగిల్స్‌ను అహ్మదాబాద్‌ ట్రంప్‌ మ్యాచ్‌లుగా ఎంచుకున్నాయి. వరుసగా జరిగిన ఈ పోటీల్లో అహ్మదాబాద్‌ ప్లేయర్లే గెలిచారు. దీంతో మరో మూడు మ్యాచ్‌లుండగానే అహ్మదాబాద్‌ జట్టు 3– (–1)తో విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ – లీ రెగినాల్డ్‌ (అహ్మదాబాద్‌)జంట 10–15, 15–14, 15–14తో లియో మిన్‌ చన్‌– యు సియాంగ్‌పై నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో అక్సెల్సన్‌ (అహ్మదాబాద్‌) 15–11, 15–14తో సెన్సొబూన్సుక్‌ను ఓడించాడు. గిల్మోర్‌ (అహ్మదాబాద్‌)కు 8–15, 9–15తో రీతూపర్ణ దాస్‌ షాకిచ్చింది. పురుషుల సింగిల్స్‌లో డారెన్‌ ల్యూ (అహ్మదాబాద్‌)11–15, 15–10, 10–15తో తియాన్‌ హౌవీ చేతిలో ఓడిపోయాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌–సిక్కిరెడ్డి (అహ్మదాబాద్‌) జోడీ 15–8, 15–7 యు సియాంగ్‌–కిమ్‌ హ న జంటపై గెలిచింది. నేడు ముంబైలో జరిగే చివరి పోరులో పుణే సెవెన్‌ ఏసెస్‌తో అవధ్‌ వారియర్స్‌ తలపడుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement