
‘కట్’ చేశాడు!
తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్లు, రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్లు... రెండు పదులు కూడా నిండని ఒక యువ బౌలర్ అంతర్జాతీయ కెరీర్‌కు అదిరిపోయే ఆరంభం ఇది. చూస్తే బక్కపల్చటి శరీరం, సాధారణ వేగం... చాలా మందితో పోలిస్తే ఇవి రెగ్యులర్ పేస్ బౌలర్ లక్షణాలు కావు. కానీ నాటి పాక్ యువ సంచలనం మొహమ్మద్ ఆమిర్‌ను అభిమానించే ముస్తఫిజుర్ రహమాన్ అదే తరహాలో అద్భుతమైన అరంగేట్రం చేశాడు. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చి బంగ్లాదేశ్ హీరోగా మారిపోయాడు.
దృష్టిలో పడ్డాడు...
ఉపఖండం నుంచి ఇటీవల వెలుగులోకి వచ్చిన చాలా మంది క్రికెటర్లలాగే ముస్తఫిజుర్‌ది కూడా చిన్న పట్టణం నుంచి వచ్చిన సాధారణ నేపథ్యం. ఢాకా నుంచి దాదాపు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్‌ఖిరా అతని స్వస్థలం. ముందుగా బ్యాటింగ్‌పై ఆసక్తి చూపించినా తర్వాత టెన్నిస్ బాల్‌తో బౌలింగ్ సాధన చేశాడు. ముస్తఫిజుర్ ప్రతిభను గుర్తించిన అతని అన్నయ్య 40 మైళ్ల దూరంలోని ఒక కోచింగ్ సెంటర్‌కు తీసుకెళ్లి ప్రోత్సహించాడు. ఆ సమయంలో నాకు మా అన్నయ్య తప్ప మరేమీ గుర్తుకు రాలేదంటూ తొలి వన్డే ముగిశాక ఈ యువ బౌలర్ చెప్పుకున్నాడు. ఢాకా పేస్ బౌలర్ల క్యాంప్‌లో ప్రతిభను ప్రదర్శించి అండర్-17 జట్టుకు ఎంపికైన రహమాన్ ఆ తర్వాత అండర్-19 టీమ్‌లో భాగమయ్యాడు. గత ఏడాది అండర్-19 ప్రపంచ కప్‌లో ఆరు మ్యాచ్‌లలో 9 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. తొలిసారి ముస్తఫిజుర్‌ను బంగ్లాదేశ్ టి20 జట్టుకు ఎంపిక చేసినప్పుడు తొందరేముందంటూ విమర్శలు వచ్చాయి. అయితే 4 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీయడంతో వన్డేల్లోనూ అవకాశం దక్కింది.
సంచలనానికి శ్రీకారం...
రెండు మ్యాచ్‌లలో కలిపి ముస్తఫిజుర్ తీసిన 11 వికెట్లలో ఎక్కువ భాగం ‘కటర్’లే ఉన్నాయి. బంతి వేగాన్ని తగ్గిస్తూ సాధారణ స్లో డెలివరీగా కాకుండా ఆఫ్ స్పిన్ తరహాలో లోపలికి వచ్చే ‘కటర్’ బంతులను అతను విరివిగా వాడాడు. గతంలో వకార్ యూనిస్, మెక్‌గ్రాత్‌వంటి దిగ్గజ బౌలర్లు ఆఫ్ కటర్, లెగ్ కటర్ల ద్వారా ఎక్కువ వికెట్లు రాబట్టారు. ఇటీవల పేసర్లు దీనిని చాలా తక్కువగా వేస్తున్నారు. సహచరుడు అనాముల్ హక్ ఒకసారి ఈ బంతిని ప్రయత్నించమని చెప్పడంతో నేర్చుకున్న ముస్తఫిజుర్ తర్వాత అందులో చెలరేగిపోయాడు. తొలి వన్డేలో రోహిత్, రహానే, రైనా, అశ్విన్ ఆఫ్ కటర్లకు బలైతే, జడేజా లెగ్‌కటర్‌కు పెవిలియన్ చేరాడు. ముఖ్యంగా రైనాను అవుట్ చేసిన బంతి అయితే అద్భుతమని అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఆదివారం మ్యాచ్‌లో రైనా, ధోని, అశ్విన్‌లు చక్కటి ఆఫ్‌కటర్లకు వెనుదిరిగారు. ‘నేను లెగ్, ఆఫ్ కటర్లను బాగా వేస్తున్న మాట నిజమే. కానీ నేను ఇతరత్రా కూడా మంచి బంతులు వేయగలను. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలంటే ఇది చాలా అవసరం’ అని అతను చెప్పాడు.
బంగ్లా భవిష్యత్తు!
తొలి రెండు వన్డేల్లో ముస్తఫిజుర్ ప్రదర్శన చూస్తే ప్రతిభకు ఏ మాత్రం కొదవ లేదని కనిపిస్తుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ అంటే ఒక మ్యాచ్ లేదా సిరీస్ సంచలనాలతో సరిపోదు. గతంలో భారత్‌పైనే అద్భుతమైన అరంగేట్రం చేసి ఆ తర్వాత ప్రభ కోల్పోయిన అజంతా మెండిస్‌లాంటి బౌలర్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి అతను రాబోయే మ్యాచ్‌లలో నిలకడను ప్రదర్శించాలి. అన్నింటికి మించి తాను అభిమానించే ఆమిర్ తరహాలో కాకుండా ఆటపైనే దృష్టి పెడితే బంగ్లాదేశ్ తరఫున భవిష్యత్తులో మంచి బౌలర్‌గా పేరు తెచ్చుకోగలడు.
-సాక్షి క్రీడావిభాగం
భారత్‌పై బంగ్లాదేశ్ వన్డే సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
బంగ్లాదేశ్‌కు సొంతగడ్డపై ఇది వరుసగా 10వ విజయం.
కెరీర్ తొలి రెండు వన్డేల్లోనూ 5 వికెట్లు తీసిన రెండో బౌలర్ ముస్తఫిజుర్. గతంలో బ్రియాన్ విటోరి (జింబాబ్వే) ఈ ఘనత సాధించాడు. విటోరి 10 వికెట్లు తీయగా, ముస్తఫిజుర్‌కు 11 వికెట్లు దక్కాయి.